
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మరోసారి సొంత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ చెత్త నిర్ణయాలే ముంబై కొంపముంచాయని వాపోతున్నారు. నామమాత్రపు స్కోర్‌ను కాపాడుకునే క్రమంలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాను కాదని తాను బౌలింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుమ్రా కాకపోతే కొయెట్జీ, తుషార కనిపించలేదా అని నిలదీస్తున్నారు.
ఏదో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌లా తొలి ఓవర్ వేయడమేంటని ధ్వజమెత్తుతున్నారు. బౌలర్లను మార్చే విషయంలో గల్లీ కెప్టెన్ల కంటే అధ్వానంగా ఉన్నావని ఫైరవుతున్నారు. హార్దిక్ బ్యాటింగ్ చెప్పనశక్యమైన ఛండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోతూ ఆల్‌రౌండర్‌నని ఎలా చెప్పుకుంటావని దుర్భాషలాడుతున్నారు.
ఈ సీజన్‌లో ముంబై యాజమాన్యం స్వయంకృతాపరాధమే (హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం) ఐదు సార్లు ఛాంపియన్ అయిన తమ ఫేవరెట్ జట్టు కొంపముంచుతుందని వాపోతున్నారు. హార్దిక్‌ను వెంటనే కెప్టెన్సీ నుంచి తీసిపారేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రాయల్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్‌లో 10 పరుగులు (10 బంతుల్లో ఓ ఫోర్) చేసి, బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు.
183 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో హార్దిక్ తొలి ఓవర్ వేసి బట్లర్‌చే బాదించుకున్నాడు. ఆతర్వాత 13వ ఓవర్‌లో శాంసన్, యశస్వి ధాటికి 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్‌లో హార్దిక్ చెత్త నిర్ణయాలు, చెత్త వ్యక్తిగత ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతానికి ఆ జట్టు 8 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సందీప్ శర్మ (4-0-18-5), ట్రెంట్ బౌల్ట్ (4-0-32-2) ముంబైని దెబ్బకొట్టారు.
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) రాయల్స్‌ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment