‘‘ఏదేమైనా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మనం అక్కడే ఉండి పోరాడాలి. ఒక్కోసారి జీవితం మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.
అయితే, నేను మాత్రం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆటను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ యుద్ధ రంగంలో వెన్నుచూపితే మనం అనుకున్న ఫలితాలు రాబట్టలేం కదా!
ఇక్కడ కూడా అంతే.. ఆట ద్వారా మనమేం పొందాలనుకుంటున్నామో.. వాటిని సాధించాలంటే కాస్త ఓపికగా ఎదురుచూడాలి. ఒక్కోసారి అది చాలా కష్టంగా ఉంటుందన్న మాట వాస్తవం.
అయితే, నేను ఎప్పుటికప్పుడు మా మనసుని తేలిక చేసుకుంటాను. అంతకు ముందు ఎలా ఉన్నానో.. క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.
జీవితంలో మంచి రోజులు, గడ్డు పరిస్థితులు.. వస్తూ పోతూ ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటిని దాటుకుని విజయవంతంగా ముందడుగు వేశాను.
నిజానికి నేను సక్సెస్‌ను అంత సీరియస్‌గా తీసుకోను. నేను బాగా ఆడిన రోజును మర్చిపోతాను. అదే విధంగా.. చేదు అనుభవాలను కూడా!
అలా అని పరిస్థితుల నుంచి పారిపోను. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. ఏదో ఒకరోజు వాటి నుంచి బయటపడతాను. ఆట, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ.. కఠిన శ్రమకోరుస్తూ ముందుసాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.
అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వును మాత్రం వీడకూడదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే గాయపడిన పాండ్యా మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.
విమర్శల వర్షం
ఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ బరోడా క్రికెటర్.. ముంబై కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు అతడిపై ఆగ్రహం వెళ్లగక్కారు.
స్టేడియంలో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఇక కెప్టెన్‌గానూ హార్దిక్ విఫలం కావడంపై అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ.. బీసీసీఐ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచి ఈ పేస్ ఆల్‌రౌండర్.. తదుపరి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తాను ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్లేనని పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.
భార్యతో విభేదాలు.. విడాకులంటూ ప్రచారం
కాగా ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శన ద్వారా విమర్శలపాలైన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని.. ఈ క్రమంలో ఆమె విడాకులకు అప్లై చేసిందనే ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం వాటా కూడా నటాషాకు లభించనుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.
ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడిపోతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇక వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో పైవిధంగా ఉద్వేగ పూరితంగా మాట్లాడటం గమనార్హం.
చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment