Rohit Sharma- MI: ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు! | Think Rohit Has Played His Last Match For MI: Aakash Chopra On IPL 2025 Auction | Sakshi
Sakshi News home page

Rohit Sharma- MI: ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు.. వాళ్లు మాత్రమే జట్టుతో!

Published Wed, May 29 2024 7:00 PM | Last Updated on Wed, May 29 2024 8:46 PM

Think Rohit Has Played His Last Match For MI: Aakash Chopra On IPL 2025 Auction

రోహిత్‌ శర్మ (PC: IPL/BCCI)


టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ కెరీర్‌లోనే 2024 సీజన్‌ను ఓ చేదు జ్ఞాపకంగా చెప్పవచ్చు. 2011లో ముంబై ఇండియన్స్‌ కుటుంబంలో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఆ తర్వాత రెండేళ్లకే కెప్టెన్‌గా ప్రమోట్‌ అయిన హిట్‌మ్యాన్‌.. సారథిగా తొలి ప్రయత్నంలోనే ముంబై ఇండియన్స్‌కు టైటిల్‌ అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు జట్టును చాంపియన్‌గా నిలిపి.. అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

ఇక గతేడాది ముంబైని ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన రోహిత్‌ శర్మకు.. ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే ముంబై మేనేజ్‌మెంట్‌ షాకిచ్చింది. కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.

గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్‌ చేసుకుని మరీ కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలో ముంబై ఈసారి చెత్తగా ఆడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. రోహిత్‌ శర్మ సైతం ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయాడు.

ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ముంబై మేనేజ్‌మెంట్‌ వైఖరితో విసిగిపోయిన రోహిత్‌ శర్మ వచ్చే సీజన్‌లో ఆ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌-2025 వేలానికి ముందు ముంబై రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

‘‘నాకు తెలిసి వాళ్లు ఇషాన్‌ కిషన్‌ను వదిలేస్తారు. అతడి కోసం రైట్‌ టూ మ్యాచ్‌ కార్డు వాడతారనుకుంటా. ఎందుకంటే ఇషాన్‌ కోసం 15.5 కోట్లు వెచ్చించడం సరికాదు.

కాబట్టి వాళ్లు అతడిని వదిలేస్తారు. ఇక రోహిత్‌ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ తరఫున తన ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. తనను ఫ్రాంఛైజీ రిటైన్‌ చేసుకోవాలని అతడు కోరుకోవడం లేదు.

అదే విధంగా ఫ్రాంఛైజీ కూడా అతడిని అట్టిపెట్టుకోవాలని భావించడం లేదు. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌, రోహిత్‌ శర్మ దారులు వేరయ్యాయి. రోహిత్‌ను మరోసారి ముంబై జెర్సీలో చూసే అవకాశం లేదు.

అయితే, ఇది కేవలం నా అంచనా మాత్రమే. ఒకవేళ ఇది నిజం కావచ్చు. కాకపోవచ్చు. ఏదేమైనా రోహిత్‌ శర్మ వచ్చే సీజన్‌లో ముంబైకి మాత్రం ఆడబోడని నమ్మకంగా చెప్పగలను’’ అని ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌లో పేర్కొన్నాడు.

ఇక ముంబై రిటైన్‌ చేసుకునే ఆటగాళ్లలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మొదటి ఆటగాడిని.. అతడితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మను కూడా కొనసాగిస్తుందని ఆకాశ్‌ చోప్రా అంచనా వేశాడు. కాగా ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌లో ముంబై ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది.‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement