టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.
గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.
అదొక్కటి హైలైట్
తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్‌గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్‌లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.
ఇదిలా ఉంటే.. మేనేజ్‌మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్‌తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.
వచ్చే ఏడాది మెగా వేలం
ఇక ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.
ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్‌లో వైఫల్యాల గురించి చర్చించాం.
తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్‌కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.
తగిన శాస్తి జరిగిందంటూ
పనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది.
ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్.
Comments
Please login to add a commentAdd a comment