
PC: BCCI/IPL.com
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్‌గా కొనసాగుతోంది. ఐపీఎల్‌ను మరింత ఆకర్షణగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత 74 మ్యాచ్‌ల నుండి టోర్నమెంట్‌ను 94 మ్యాచ్‌ల సీజన్‌కు విస్తరించాలని బీసీసీఐ భావిస్తోంది. 2028 నుంచే మ్యాచ్‌ల సంఖ్య పెంచేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు.
"భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచే అవకాశముంది. ఇదే విషయాన్ని ఐసీసీతో చర్చిస్తున్నాము. బీసీసీఐలో కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ను కూడా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. మ్యాచ్‌ల సఖ్యను పెంచి అభిమానులకు మరింత వినోదాన్ని అందించడమే మా లక్ష్యం.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తొమ్మిది వారాలు పాటు జరుగుతుంది. దాన్ని 11 వారాలకు పెంచాలని ఆలోచిస్తున్నాము. అంటే 74 మ్యాచ్‌ల నుంచి 84 లేదా 94కి పెంచవచ్చు. ప్రతి జట్టు సొంత గడ్డపై, ప్రత్యర్థి గడ్డపై రెండేసి మ్యాచ్‌లు ఆడేందుకు వీలు ఉంటుంది" అని ధుమాల్ పేర్కొన్నారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఇప్పటిలో కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చే ఆలోచన లేదని ఆయన తెలిపారు. కాగా 59 మ్యాచ్‌లతో ప్రారంభమైన ఐపీఎల్.. ప్రస్తుతం 74 మ్యాచ్‌ల సీజన్‌గా కొనసాగుతోంది.