ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
కాగా ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.
ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్‌లో కెప్టెన్‌గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.
రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?
ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్‌లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదిలేయాలని సూచించాడు.
షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదు
ఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.
మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.
అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?
మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన మాటేమిటి?
ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లనే నమ్ముకోవాలిక!
వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలి
వచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్‌లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు.
మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు.
చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్
అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment