MI: ఈ సీజన్‌లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్‌ | To Rohit Hardik: Nita Ambani Loud Message MI Disappointing IPL 2024 Show | Sakshi
Sakshi News home page

MI: ఈ సీజన్‌లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్‌

Published Tue, May 21 2024 10:44 AM | Last Updated on Tue, May 21 2024 11:56 AM

To Rohit Hardik: Nita Ambani Loud Message MI Disappointing IPL 2024 Show

రోహిత్‌ శర్మ- నీతా అంబానీ- హార్దిక్‌ పాండ్యా (PC: MI X)

ఐపీఎల్‌-2024 ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన ఈ జట్టు.. ఈసారి మాత్రం దారుణంగా విఫలమైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి ఎనిమిది పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది.

పేలవ ప్రదర్శనతో ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్‌ శర్మను కాదని హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ను చేసినందుకు ముంబై యాజమాన్యం భారీ మూల్యమే చెల్లించిందనే విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ జట్టును ఉద్దేశించి డ్రెస్సింగ్‌ రూంలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. ‘‘ఈ సీజన్‌ మనందరినీ ఎంతగానో నిరాశ పరిచింది. మనం ఆశించినట్లుగా ఏదీ జరగలేదు.

అయినా నేనెప్పటికీ ముంబై ఇండియన్స్‌ జట్టుకు వీరాభిమానినే. కేవలం యజమానిగా ఉన్నందుకు మాత్రమే నేను ఈ మాటలు చెప్పడం లేదు. ముంబై ఇండియన్స్‌ జెర్సీ ధరించడం.. జట్టుతో ఇలా మమేకం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.

మన ఆట తీరును సమీక్షించుకుందాం. ఓటములకు గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం’’ అని నీతా అంబానీ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌-2024 ఆడబోయే భారత జట్టుకు ఎంపికైన ముంబై ఆటగాళ్లకు నీతా అంబానీ ఈ సందర్భంగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

‘‘రోహిత్‌, హార్దిక్‌, సూర్య, జస్‌ప్రీత్‌.. భారతీయులంతా మీ కోసం ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు’’ అంటూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాలను విష్‌ చేశారు. కాగా జూన్‌ 1 నుంచి వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement