SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ | IPL 2024 SRH vs RR: Sanju Samson On Loss Lauds Sandeep Next After Bumrah | Sakshi
Sakshi News home page

SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ

Published Sat, May 25 2024 11:57 AM | Last Updated on Sat, May 25 2024 12:37 PM

IPL 2024 SRH vs RR: Sanju Samson On Loss Lauds Sandeep Next After Bumrah

సంజూ శాంసన్‌ (PC: IPL/BCCI)

‘‘కీలకమైన మ్యాచ్‌. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్‌ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్‌ మిడిల్‌ ఓవర్లలో వారి స్పిన్‌ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.

అక్కడే మ్యాచ్‌ మా చేజారింది. ఈ పిచ్‌పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి వికెట్‌ పూర్తి భిన్నంగా మారిపోయింది.

బంతి కాస్త టర్న్‌ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్‌ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్‌ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.

అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు.

ఐపీఎల్‌-2024 క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.

బుమ్రా తర్వాత అతడే
ఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్‌లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్‌లోని యంగ్‌ టాలెంట్‌ను మేము వెలికితీయగలుగుతున్నాం.

రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్‌కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.

ఇక సందీప్‌ శర్మ.. అతడి బౌలింగ్‌ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.

గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్‌!’’ అంటూ రాజస్తాన్‌ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్‌ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.

విఫలమైన సంజూ శాంసన్‌
ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్‌(21 బంతుల్లో 42), ధ్రువ్‌ జురెల్‌(56 నాటౌట్‌) మాత్రమే రాణించారు.

తిప్పేసిన స్పిన్నర్లు
అంతకు ముందు సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో రాజస్తాన్‌ పేసర్‌ సందీప్‌ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షాబాజ్‌ అహ్మద్‌, అభిషేక్‌ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

క్వాలిఫయర్‌-2: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు:
👉టాస్‌: రాజస్తాన్‌.. తొలుత బౌలింగ్‌
👉సన్‌రైజర్స్‌ స్కోరు: 175/9 (20)

👉రాజస్తాన్‌ స్కోరు: 139/7 (20)
👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్‌

చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌.. ఇంకొక్క అడుగు 
SRH vs RR: ఓవరాక్షన్‌.. మూల్యం చెల్లించకతప్పలేదు!

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement