SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌: కమిన్స్‌ | IPL 2024 SRH In Final: Pat Cummins Reveals Mastermind Behind To Bring Shahbaz As Impact Player | Sakshi
Sakshi News home page

SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌.. ఇంకొక్క అడుగు

Published Sat, May 25 2024 8:35 AM | Last Updated on Sat, May 25 2024 3:45 PM

IPL 2024 SRH In Final: Cummins On Decision To Bring Shahbaz As Impact Player

ప్యాట్‌ కమిన్స్‌ (PC: BCCI/SRH)

ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్‌ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.

విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.

కొత్త కోచ్‌ డానియల్‌ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్‌ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్‌ఆర్‌హెచ్ సారథి కమిన్స్‌ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.

మా బలం అదే
‘‘ఈ సీజన్‌ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్‌ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్‌ అన్న సంగతి మాకు తెలుసు. 

అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్‌ నా పని మరింత సులువు చేశారు.

ఆ నిర్ణయం నాది కాదు
ఇక ఈ రోజు షాబాజ్‌ అహ్మద్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్‌ వెటోరీదే. ‌ ఈ లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.

అతడొక సర్‌ప్రైజ్‌
ఇక అభిషేక్‌ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్‌(2/24) చేయడం నిజంగా ఓ సర్‌ప్రైజ్‌ లాంటిదే. మిడిల్‌ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్‌ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.

కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.

ఇంకొక్కటి మిగిలి ఉంది
మేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.

ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్‌ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్‌ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్‌ ఇచ్చాడు.

ఇంపాక్ట్‌ చూపిన షాబాజ్‌
కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ స్థానంలో ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌.. యశస్వి జైస్వాల్‌(42), రియాన్‌ పరాగ్‌(6), రవిచంద్రన్‌ అశ్విన్‌(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ కెప్టెన్‌ సంజూ శాంసన్‌(10), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.

క్వాలిఫయర్‌-2: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు:
👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్‌), చెన్నై
👉టాస్‌: రాజస్తాన్‌.. తొలుత బౌలింగ్‌

👉సన్‌రైజర్స్‌ స్కోరు: 175/9 (20)
👉రాజస్తాన్‌ స్కోరు: 139/7 (20)

👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ విజయం.. ఫైనల్‌కు అర్హత
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షాబాజ్‌ అహ్మద్‌(18 పరుగులు, 3/23).

చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్‌-2024కు పాకిస్తాన్‌ జట్టు ప్రకటన..

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement