IPL 20-20
-
కొత్తగా సత్తా చాటేందుకు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సూపర్ స్టార్ల, అంతర్జాతీయ క్రికెటర్ల ఆటే కాదు... అప్పటి వరకు అనామకులుగా కనిపించిన వారిని కూడా హీరోలుగా మార్చేస్తుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించే భారత యువ ఆటగాళ్లకు ప్రతీ ఏటా లీగ్ అలాంటి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదిక మీద సత్తా ప్రదర్శించి చెలరేగితే అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకోవచ్చు. దేశవాళీ, జూనియర్ క్రికెట్లో ఇప్పటికే తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నా... ఐపీఎల్ అందించే కిక్కే వేరు. అలాంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కూడా ఏరికోరి జట్టులోకి తీసుకున్నాయి. రాబోయే ఐపీఎల్ –2020లో అలా అందరి దృష్టీ నిలిచిన కొందరు ‘అన్క్యాప్డ్’ యువ భారత ఆటగాళ్ల వివరాలు... యశస్వి జైస్వాల్ (రాజస్తాన్ రాయల్స్) ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించి ముంబైలో స్థిరపడ్డ 18 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించే యశస్వి పేరిట దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎన్నో ఘనతలున్నాయి. 13 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలోనే అతను ఆరుసార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. సగటు 70.81 కాగా, అందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. రాజస్తాన్ రాయల్స్ తుది జట్టులో దాదాపుగా చోటు ఖాయం. మనన్ వోహ్రా, రాబిన్ ఉతప్పలతో ఓపె నర్ స్థానానికి పోటీ పడుతున్న యశస్వికే ఎక్కువ చాన్స్ ఉంది. అబ్దుల్ సమద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) జమ్మూ కశ్మీర్‌కు చెందిన 19 ఏళ్ల సమద్‌ను ప్రతిభాన్వేషణలో భాగంగా స్వయంగా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేశాడు. గత సీజన్లో అద్భుత బ్యాటింగ్‌తో రంజీ మ్యాచ్‌లో పటిష్ట కర్ణాటకపై చెలరేగి అందరి దృష్టిలో పడ్డాడు. స్పిన్ బౌలింగ్‌లో విరుచుకుపడగల సత్తా ఉంది. గత రంజీ సీజన్లో గరిష్ట మ్యాచ్‌ల కంటే రెండు మ్యాచ్‌లు తక్కువే ఆడినా అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత అతని సొంతం. సన్‌రైజర్స్ ఆరు లేదా ఏడో స్థానంలో ఆడించి ఫినిషర్‌గా వాడుకునేందుకు మంచి అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) చక్కటి టెక్నిక్ ఉన్న దూకుడైన మహారాష్ట్ర బ్యాట్స్‌మన్. గత రెండు సీజన్లలో కలిపి చూస్తే భారత దేశవాళీ వన్డేల్లో అతను అందరికంటే ఎక్కువ పరుగులు (15 ఇన్నింగ్స్‌లలో 843) సాధించాడు. ధోని మాటల్లో చెప్పాలంటే ‘చురుకైన బుర్ర’ కలవాడు. సాధారణంగా అతను ఓపెనింగ్ లేదా మూడో స్థానాల్లో ఆడతాడు. రైనా గైర్హాజరులో 23 ఏళ్ల రుతురాజ్‌కు సత్తా ఇది సువర్ణావకాశం. జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ కూడా ఇదే మాట చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆరంభ మ్యాచ్‌లకు ఒకవేళ దూరమైనా...తర్వాతి నుంచైనా రుతురాజ్ చెలరేగిపోగలడు. దేవ్‌దత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఏడాది కాలంలో భారత దేశవాళీ క్రికెట్లో తన దూకుడైన ఆటలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న క్రికెటర్ 20 ఏళ్ల దేవ్‌దత్. కేరళలో జన్మించి కర్ణాటక జట్టుకు ఆడుతున్న దేవ్‌దత్ గత దేశవాళీ సీజన్లో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండింటిలో కూడా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తాక్ అలీ టోర్నీలోనైతే ఏకంగా 175.75 స్ట్రయిక్ రేట్‌తో అతను 580 పరుగులు సాధించడం విశేషం. బెంగళూరు జట్టులో ఓపెనర్ స్థానంలో అతను పార్థివ్ పటేల్‌తో పోటీ పడుతున్నాడు. రవి బిష్ణోయ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అండర్–19 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావం చూపించిన లెగ్ స్పిన్నర్. 6 మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు తీసిన అతడిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. రాజస్తాన్‌కు చెందని 20 ఏళ్ల రవి బిష్ణోయ్ గుగ్లీలు ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెడతాయనేది సీనియర్ క్రికెటర్ల మాట. పంజాబ్ తుది జట్టులో కృష్ణప్ప గౌతమ్, అశ్విన్ మురుగన్ నుంచి పోటీ ఉన్నా... బిష్ణోయ్‌పై అందరి దృష్టి ఉంది. టీమ్ కోచ్‌గా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటంతో అతని మార్గనిర్దేశనంలో రవి మరింతగా రాటుదేలినట్లు టీమ్ వర్గాలు చెబుతున్నాయి. -
‘ఐపీఎల్ ప్రాక్టీస్‌తో ఆసీస్‌లో రాణిస్తాం’
దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత్ క్రికెటర్లకు మంచి ప్రాక్టీస్ లభించనుందని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడనున్నాడు. రెండు నెలల తర్వాత ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టూర్‌కు ఐపీఎల్ ఎంతో లాభించనుందని తెలిపాడు. ఆసీస్‌తో టీ 20 సిరీస్, 4టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. అయితే ఐపీఎల్లో ఆసీస్ ఆటగాళ్లు పాల్గొంటున్నందున తమకెంతో ఉపయోగపడనుందని షమీ తెలిపాడు. కాగా ఆసీస్ జట్టును ఎదుర్కొవడానికి నిరంతరం టీమ్ ఆటగాళ్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ తరువాత ఆసీస్ టూర్‌కు సమయం ఎక్కువ లేదనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తు ఐపీఎల్ తక్కువ ఓవర్ల లీగ్ కాబట్టి ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదని అభిప్రాయపడ్డాడు. కాగా పేస్, సీమ్, రిథమ్‌లు కలగలిపిన షమీ తన బౌలింగ్‌ను పదునుపెట్టే పనిలో పడ్డాడు. లాక్డౌన్ సమయంలోను ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఉన్న ఫామ్ హౌజ్‌లో షమీ ప్రాక్టీస్ చేశాడు. (చదవండి: సరిగ్గా ఏడాది క్రితం.. వరల్డ్‌కప్‌లో) -
అశ్విన్‌ను అలా చేయనివ్వను!
న్యూఢిల్లీ: గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా జాస్ బట్లర్‌ను రనౌట్ చేయడం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ ఒకే మాటపై నిలబడగా...అది క్రీడా స్ఫూర్తినికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చాయి. ఈ సారి 2020 ఐపీఎల్లో అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. దానికి హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇకపై అలాంటి ఘటన జరగదని, ఈ విషయంలో తాను అశ్విన్‌తో ‘గట్టిగా’ మాట్లాడతానని పాంటింగ్ వ్యా ఖ్యానించాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి ఘటనా జరగదని పాంటింగ్ హామీ ఇచ్చాడు. ‘మా జట్టు అలాంటి తరహా క్రికెట్‌ను ఆడబోవడం లేదు. నేను అశ్విన్‌ను కలవగానే అన్నింటికింటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు. అశ్విన్ అద్భుతమైన బౌలర్. ఈ ఘటన జరిగినప్పుడు నేను మా ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను. అశ్విన్‌లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మాత్రం అలాగే భావిస్తాం’ అని పాంటింగ్ వివరించాడు. అయితే అశ్విన్ తరహాలో ‘మన్కడింగ్’ ద్వారా బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడం తప్పేమీ కాదంటూ ఎంసీసీ రూపొందించిన నిబంధనల కమిటీలో పాంటింగ్ కూడా సభ్యుడు కావడం విశేషం. మరో వైపు 2008లో సిడ్నీలో భారత్‌తో జరిగిన టెస్టు లో పలు మార్లు క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన పాంటింగ్, ఇప్పుడు క్రీడా స్ఫూర్తి మాటలు చెప్పడం హాస్యాస్పదమని భారత అభిమానులు అతనిపై విరుచుకు పడ్డారు. -
‘డ్రీమ్ 11’ ఒక్క 2020కే...
న్యూఢిల్లీ: రూ. 222 కోట్లకు ఐపీఎల్ –2020 టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ ఎలెవన్’ జోరుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడ్డుకట్ట వేసింది. ఈ ఏడాదిలాగే 2021, 2022 ఐపీఎల్‌లకు కూడా ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతామనే ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. వారితో ఒప్పందం ఈ ఒక్క ఏడాదికే ఖరారైందని స్పష్టం చేసింది. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్ల చొప్పున చెల్లిస్తామని, తమకే హక్కులు ఇవ్వాలంటూ ‘డ్రీమ్ 11’ బోర్డుకు ఆఫర్ ఇచ్చింది. అయితే ఇది తమకు ఆమోదయోగ్యం కాదంటూ బోర్డు నో చెప్పేసింది. అదనపు రెండేళ్లు ఒప్పందం విషయంలో డ్రీమ్ 11కు, బీసీసీఐకి మధ్య చర్చలు జరిగాయని... తమకు ఇవ్వచూపిన మొత్తాన్ని పెంచాలంటూ బోర్డు కోరడంతో ఏకాభిప్రాయం కుదర్లేదని తెలిసింది. ‘ఐపీఎల్–13 కోసం డ్రీమ్ 11 ఎక్కువ మొత్తానికి కోట్ చేసింది కాబట్టి వారికి హక్కులు ఇచ్చాం. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్లకే మేం ఎందుకు ఇస్తాం. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రాబోయే రోజుల్లో పరిస్థితులు కచ్చితంగా మెరుగు పడతాయి. అయినా ‘వివో’తో మా ఒప్పందం పూర్తిగా రద్దు కాలేదు. ఈ ఏడాది విరామం మాత్రమే ఇచ్చామంతే. రూ. 440 కోట్లు ఇచ్చేవారు ఉండగా, రూ. 240 కోట్లకు హక్కులు అందజేస్తామా’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో ఐపీఎల్ జరుగుతుంది. మాకు చాలా బాధ కలిగింది: సీఏఐటీ ఒక వైపు చైనా కంపెనీలతో సంబంధాలు తెంచుకోవాలంటూ, మరో వైపు ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ ఒప్పందం చేసుకోవడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ (సీఏఐటీ) ప్రశ్నించింది. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీకే ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులు ఇవ్వడం తమను బాధించిందని ఈ సమాఖ్య అభిప్రాయ పడింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సీఏఐటీ లేఖ రాసింది. ‘డ్రీమ్ 11లో చైనాకు చెందిన టెన్సెంట్ గ్లోబల్ కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే భారత అభిమానుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇలా దొడ్డి దారిన హక్కులు కేటాయించడం సరైంది కాదు. ఇది భారత ప్రయోజనాలను పణంగా పెట్టడమే’ అని సీఏఐటీ తమ లేఖలో పేర్కొంది. -
‘ఐపీఎల్ కోసం అత్యుత్తమ శిక్షణ’
న్యూఢిల్లీ: ప్రస్తుత తరం క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హవా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. విరాట్ కేవలం క్రికెట్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతు అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020పై కోహ్లీ స్పందిస్తూ.. సెప్టెంబర్‌లో జరగబోయే ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాగా త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం అత్యుత్తమ శిక్షణతో సాధన చేశామని అన్నారు. శిక్షణ తరగతులను టీమ్ ఆటగాళ్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా తమ జట్టు ఆటగాళ్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని కోహ్లీ తెలిపారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2020 19 సెప్టెంబర్ నుంచి 8నవంబర్ 2020 వరకు యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్.. మానసిక స్థితిని మార్చుతుంది: గంభీర్
ముంబై: ఐపీఎల్–13వ సీజన్ మొదలైతే దేశం మానసికస్థితి కాస్త మారుతుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కరోనా విలయతాండవంతో దేశంలో ఒక విధమైన భయానక, ఆందోళనకర వాతావరణం నెలకొందని... ఇలాంటి సమయంలో లీగ్ జరిగితే దేశ ప్రజలకు క్రికెట్ ద్వారా సాంత్వన లభిస్తుందని చెప్పాడు. ఆటతో జాతి మానసిక స్థితి మారుతుందని కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ సారథి గంభీర్ అన్నాడు. ‘13వ సీజన్ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతం. ముందు జరగడమే ముఖ్యం. మన ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థితి మారుతుంది. క్రికెట్ నుంచి లభించే ఊరట జాతి మోమునే మార్చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ గెలుస్తారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరెక్కువ వికెట్లు తీస్తున్నారు అనే పట్టింపుల కన్నా... దేశ మానసిక స్థితి మారుతుంది. ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్ గతంలో జరిగిన లీగ్‌లకంటే గొప్పదవుతుంది. దేశానికి సాంత్వన చేకూరుస్తుంది’ అని అన్నాడు. యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుంది. -
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఆశలు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యం అయ్యేలా లేదని ఆతిథ్య దేశం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఫ్రాంచైజీల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏదో విధంగా ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని పులువురు ఫ్రాంచైజీ యజమానులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయిలో లేదా కుదించైనా, భారత్‌లో కుదరకపోతే విదేశాల్లోనైనా లీగ్‌ను నిర్వహించడంపై బీసీసీఐ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇటీవలే లీగ్ నిర్వహణపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించిన బీసీసీఐ, తదుపరి కార్యాచరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ నిర్వహణపై స్పష్టతనివ్వడంతో ఫ్రాంచైజీలన్నీ బీసీసీఐ వైపు ఆశగా చూస్తున్నాయి. లీగ్ పరిధి విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు. ‘పూర్తి స్థాయి లీగ్ నిర్వహించేందుకే బీసీసీఐ ప్రయత్నిస్తుంది అందులో సందేహం లేదు. కానీ సమయానుకూలతను బట్టి టోర్నీని కుదించినా మంచిదే. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణే సులభంగా ఉంటుంది. 2009లో కూడా కేవలం నెల వ్యవధిలో లీగ్‌ను దక్షిణాఫ్రికాకు తరలించాం. భారత్‌లో నిర్వహణ సాధ్యం కాకుంటే శ్రీలంక, న్యూజిలాండ్‌లో నిర్వహించవచ్చు. ఒక్కసారి లీగ్‌పై ప్రకటన వస్తే స్పాన్సర్లు కూడా వారంతటవారే వస్తారు’ అని వాడియా అభిప్రాయపడ్డారు. మరోవైపు మైదానాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించకపోయినప్పటికీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్పాన్సర్లను ఆకట్టుకోవచ్చని చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. వ్యూయర్షిప్ కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయ పడిన ఆయన... ఐపీఎల్ తేదీలు ప్రకటించాకే స్పాన్సర్లు ఫ్రాంచైజీలను సంప్రదిస్తారని అన్నారు. మరో ఫ్రాంచైజీకి చెందిన అధికారి మాట్లాడుతూ ఐపీ ఎల్ జరిగితే వ్యక్తిగత స్పాన్సర్‌షిప్‌ల కన్నా కూడా బీసీసీఐ సెంట్రల్ పూల్ ద్వారానే అధిక ఆదాయం పొందవచ్చని చెప్పాడు. ఆదాయం గురించి పక్కన పెడితే ఐపీఎల్ నిర్వహణకు సెప్టెంబర్–అక్టోబర్ తగిన సమయమని అన్నాడు. -
మార్చి 29 నుంచి ఐపీఎల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్ మ్యాచ్‌ల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫైనల్ మాత్రం మే 24న నిర్వహించడం ఖాయమైంది. గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్ హెడర్’ మ్యాచ్‌ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్‌లు) సంఖ్యను బాగా తగ్గించారు. ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్ హెడర్లు జరుగుతాయి. దాంతో లీగ్ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్ మ్యాచ్‌లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది. మరోవైపు రాజస్తాన్ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్‌గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్ క్రికెట్ సంఘం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్‌లో...: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్ తమ మ్యాచ్‌లు ఆడుతుంది. -
ఐపీఎల్ 20-20పై బెట్టింగుల జోరు
పలమనేరు,న్యూస్‌లైన్ : జిల్లాలోని తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో ఐపీఎల్20-20 బెట్టింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు గంటల్లో ఫలితమొస్తుండడంతో ఈ మ్యాచ్‌లకు లక్షలాది రూపాయలు బెట్టింగుల రూపేణా చేతులు మారుతున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ విన్ ఎవరవుతారు? విన్ అయితే బ్యాటింగా, బౌలిం గా? పది ఓవర్ల మ్యాచ్ తర్వాత ఎంత స్కోరు వస్తుంది? సెకెండ్ బ్యాటింగ్‌కు దిగిన జట్టు గెలుస్తుందా, ఓడుతుం దా? ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారు? వికెట్లు పడగొట్టేదెవరు? ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కుతుంది? అంటూ పందెం కాస్తున్నారు. మరికొందరు తొందరగా డబ్బులు సంపాదించుకోవాలనో ఏమో ఓవర్ టు ఓవర్ బెట్టింగులు కడుతున్నారు. ఒక్క ఓవర్లో ఆరు బంతులకు ఎన్ని పరుగులొస్తాయి ? అనే విషయంపై నిమిషాల వ్యవధిలో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఐదు జట్లపైనే భారీగా బెట్టింగులు పంజాబ్, చెన్నైలు ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకోగా, మిగిలిన జట్లలో ఐదు అర్హత సాధించే అవకాశాలున్నాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్పై భారీగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఓ పారిశ్రామికవేత్త ఐపీఎల్ ట్రోఫీని పంజాబ్ కైవసం చేసుకుంటుందంటూ రూ.50 లక్షలు పందెం కాసినట్లు తెలుస్తోంది. ఇక మదనపల్లెకు చెందిన పలువురు రియల్టర్లు, పంజాబ్,రాజస్థాన్, కోల్‌కత్తాపై లక్షల రూపాయల బెట్టింగులు పెట్టినట్లు వినికిడి. పల్లెల నుంచి పట్టణాల దాకా........ పల్లెల్లో కోళ్ల పందేలు, పేకాట తదితర జూదాలుండేవి. పట్టణాల్లో అయితే పేకాట జోరుగా సాగుతుండేది. అయితే వ్యసనపరులు ట్రెండ్ మార్చారు. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా ఓ టీకొట్టులో కుర్చొని క్రికెట్ చూస్తూ పందెం కాస్తున్నారు. పట్టణాల్లో దాబాల వద్ద ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుకు వ్యసనపరులుగా మారిన యువకులు నిత్యం పందేలు కాసి తీవ్రంగా నష్టపోతున్నారు. తిరుపతి, మదనపల్లెలో పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్‌లు, వారు ధరించిన బంగారు ఆభరణాలను సైతం ఈ బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారని పలువురు చెబుతున్నారు.