న్యూఢిల్లీ: రూ. 222 కోట్లకు ఐపీఎల్ –2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు దక్కించుకున్న ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ ఎలెవన్’ జోరుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడ్డుకట్ట వేసింది. ఈ ఏడాదిలాగే 2021, 2022 ఐపీఎల్‌లకు కూడా ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతామనే ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. వారితో ఒప్పందం ఈ ఒక్క ఏడాదికే ఖరారైందని స్పష్టం చేసింది. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్ల చొప్పున చెల్లిస్తామని, తమకే హక్కులు ఇవ్వాలంటూ ‘డ్రీమ్ 11’ బోర్డుకు ఆఫర్ ఇచ్చింది. అయితే ఇది తమకు ఆమోదయోగ్యం కాదంటూ బోర్డు నో చెప్పేసింది.
అదనపు రెండేళ్లు ఒప్పందం విషయంలో డ్రీమ్ 11కు, బీసీసీఐకి మధ్య చర్చలు జరిగాయని... తమకు ఇవ్వచూపిన మొత్తాన్ని పెంచాలంటూ బోర్డు కోరడంతో ఏకాభిప్రాయం కుదర్లేదని తెలిసింది. ‘ఐపీఎల్–13 కోసం డ్రీమ్ 11 ఎక్కువ మొత్తానికి కోట్ చేసింది కాబట్టి వారికి హక్కులు ఇచ్చాం. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్లకే మేం ఎందుకు ఇస్తాం. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రాబోయే రోజుల్లో పరిస్థితులు కచ్చితంగా మెరుగు పడతాయి. అయినా ‘వివో’తో మా ఒప్పందం పూర్తిగా రద్దు కాలేదు. ఈ ఏడాది విరామం మాత్రమే ఇచ్చామంతే. రూ. 440 కోట్లు ఇచ్చేవారు ఉండగా, రూ. 240 కోట్లకు హక్కులు అందజేస్తామా’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో ఐపీఎల్ జరుగుతుంది.
మాకు చాలా బాధ కలిగింది: సీఏఐటీ
ఒక వైపు చైనా కంపెనీలతో సంబంధాలు తెంచుకోవాలంటూ, మరో వైపు ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ ఒప్పందం చేసుకోవడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ (సీఏఐటీ) ప్రశ్నించింది. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీకే ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ హక్కులు ఇవ్వడం తమను బాధించిందని ఈ సమాఖ్య అభిప్రాయ పడింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సీఏఐటీ లేఖ రాసింది. ‘డ్రీమ్ 11లో చైనాకు చెందిన టెన్సెంట్ గ్లోబల్ కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే భారత అభిమానుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇలా దొడ్డి దారిన హక్కులు కేటాయించడం సరైంది కాదు. ఇది భారత ప్రయోజనాలను పణంగా పెట్టడమే’ అని సీఏఐటీ తమ లేఖలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment