
ముంబై: ఐపీఎల్–13వ సీజన్ మొదలైతే దేశం మానసికస్థితి కాస్త మారుతుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కరోనా విలయతాండవంతో దేశంలో ఒక విధమైన భయానక, ఆందోళనకర వాతావరణం నెలకొందని... ఇలాంటి సమయంలో లీగ్ జరిగితే దేశ ప్రజలకు క్రికెట్ ద్వారా సాంత్వన లభిస్తుందని చెప్పాడు. ఆటతో జాతి మానసిక స్థితి మారుతుందని కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ సారథి గంభీర్ అన్నాడు. ‘13వ సీజన్ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతం. ముందు జరగడమే ముఖ్యం.
మన ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థితి మారుతుంది. క్రికెట్ నుంచి లభించే ఊరట జాతి మోమునే మార్చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ గెలుస్తారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరెక్కువ వికెట్లు తీస్తున్నారు అనే పట్టింపుల కన్నా... దేశ మానసిక స్థితి మారుతుంది. ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్ గతంలో జరిగిన లీగ్‌లకంటే గొప్పదవుతుంది. దేశానికి సాంత్వన చేకూరుస్తుంది’ అని అన్నాడు. యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment