
ఎన్నికల్లో పోటీ చేయలేనంటూ బీజేపీ అధిష్టానానికి సమాచారం
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ నియోజకవర్గం ఎంపీ గౌతమ్ గంభీర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సంకేతాలిచ్చారు. క్రికెట్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ కానున్నందున తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలంటూ శనివారం ఆయన బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గంభీర్ శనివారం ‘ఎక్స్’లో.. ‘నాకు రాజకీయ బాధ్యతల నుంచి విరామం ఇవ్వాలంటూ గౌరవ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశాను.
దీనివల్ల రానున్న క్రికెట్ సీజన్‌లో ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జీలకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు. గంభీర్‌ను ఈసారి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి మార్చొచ్చంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. జార్ఖండ్‌లోని హజారీబాగ్ బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా కూడా గౌతమ్ గంభీర్ బాటలోనే నడుస్తున్నారు. తనకు క్రియాశీల రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలంటూ పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment