However
-
జిల్లాకో మెడికల్ కాలేజీ!
కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి, పాలమూరులో ఏర్పాటుకు ప్రతిపాదనలు కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు ప్రాధాన్యత పీఎంఎస్ఎస్వై కింద కేంద్రాన్ని నిధులు కోరాలనే యోచన సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు లేని కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒక్కో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్వై) పథకం కింద కేంద్ర సాయం కోరాలని భావిస్తోంది. ఆయా జిల్లాల్లో కళాశాలల ఏర్పాటుకు సంబంధించి గతంలో స్థలాలను గుర్తించినప్పటికీ వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం త్వరలోనే ఆయా జిల్లాల్లో పర్యటించి గతంలో గుర్తించిన స్థలాలను మరోసారి పరిశీలించనుంది. మరోవైపు కళాశాలల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కేంద్రాన్ని ఏ మేరకు సాయం అడగాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వీలైనంత ఎక్కువ సాయాన్ని అందించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో గతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకైన వ్యయంలో కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులను ఖర్చు చేసినందున ఇదే నిష్పత్తిలో కేంద్ర సాయం కోరాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని, వీటిని అతి త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్రం ఐదు కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తుందనే అంశంపై స్పష్టత లేనప్పటికీ కనీసం మూడు కొత్త కళాశాలలైనా మంజూరవుతాయని అధికారులు ధీమాతో ఉన్నారు. వీటిలో కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. కేంద్రం నుంచి అనుమతి లభించినప్పటి నుంచి రెండేళ్లలో కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చే సేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
తిరుపతిలో సైబర్ హర్రర్
ఆందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు తిరుపతి క్రైం: ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాలు, మెట్రో పాలిటన్ సిటీలకు పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడిప్పుడే తిరుపతి పట్టణంలోకీ తొంగి చూస్తున్నా యి. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమాయక ప్రజలను రకరకాలుగా మోసగిస్తున్నారు. లక్షల రూపాయలు బహుమతిగా వచ్చాయంటూ సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతారు. ఆ మొత్తం పొందాలంటే ముందుగా కొంత నగదును చెల్లించాలని నమ్మబలుకుతారు. దీన్ని నమ్మి డబ్బు ఇచ్చిన వారికి ఎలాంటి బ హుమతి సొమ్మూ రాదు. లేదంటే, బహుమతి సొమ్ము పంపుతాం, బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ పంపించమని కోరుతారు. ఈ వివరాలు పంపారంటే, ఇక అంతే.. వారి అకౌంట్లోని మొత్తం హుష్‌కాక్.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చాలామంది యువతీ యువకులు ఇలాంటి మెసేజ్‌ల ద్వారా మోసపోయారని పోలీసులు చెబుతున్నారు. బయటకు తెలిస్తే అవమానంగా భావించి కొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల తిరుచానూరులో వెలుగు చూసింది. నైజీరియా దేశానికి చెందిన ఇమ్మానుయేల్ ఈజీగా డబ్బు సంపాదించడం కోసం మహిళ పేరుతో తిరుపతికి చెందిన రియల్టర్ వెంకటరమణనాయుడును ఈ మెయిల్ ద్వారా ముగ్గులోకి లాగాడు. అతని నుంచి రూ.3.61 లక్షలు తన అకౌంట్లోకి వేయించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న వెంకటరమణనాయుడు ఇమ్మానుయేల్‌ను తెలివిగా తిరుపతికి రప్పించి నిర్బంధించాడు. చివరకూ ఇద్దరూ కటకటాల వెనక్కు వెళ్లారు. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు తిరుపతితోపాటు పరిసర ప్రాంతాలకు పాకడంపై పోలీసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. కాగా ఇలాంటి నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. మెయిల్స్, మెసేజ్‌లను చూసి మోసపోవద్దు ఫోన్ మెసేజ్‌లను, మొయిల్స్‌ను చూసి మోసపోవద్దండి. ఈజీగా మనీ సంపాదించేందుకు కొంతమంది క్రిమినల్స్ ఇలాంటి వాటిని ఎరగా వాడుకుంటున్నారు. అలాంటి చీటింగ్‌లకు మోసపోకూడదు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి సైబర్నేరగాళ్లను పట్టుకుంటాం. -ఎస్వీ.రాజశేఖర్‌బాబు, ఎస్పీ, తిరుపతి అర్బన్ జిల్లా -
అడుగు వేయలేకపోయినా..ఏడడుగులు నడిచారు..!
శారీరకంగా వారిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ మానసికంగా వారు మామూలు మనుషులే. సాటి మానవులతో సమానంగా ప్రేమానురాగాలతో కూడిన నిండైన వైవాహిక జీవితాన్ని ఆశిస్తున్నవారే. అంత సులభంగా నెరవేరని వారి ఆశలకు ఓ ట్రస్టు రూపంలో ఆలంబన చేకూరింది. మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడేలా చేసింది. అడుగు తీసి అడుగు వేయలేని వారి చేత ‘ఏడడుగులు’ వేయించింది. పిల్లాపాపలతో కేరింతలు కొట్టే నిండైన సంసార జీవితాన్ని ప్రసాదించింది. చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని తిరుప్పోరూర్‌లో పంక్చర్ షాపు నడుపుతున్న రమేశ్‌కు మూడేళ్ల వయసులో రెండు కాళ్లూ చచ్చుపడిపోయాయి. ముస్లిం మతానికి చెందిన ఫరీదాబాను పిన్న వయసులోనే ఎడమకాలు కోల్పోయారు. దాంతో ఇద్దరికీ పెళ్లి సంబంధాలు రాలేదు. పెళ్లి అవుతుందన్న ఆశ కూడా వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన ఓ ప్రత్యేక స్వయంవరం వారిద్దరినీ కలిపింది. పరస్పరం ఇష్టపడటంతో పెద్దలను ఒప్పించి ట్రస్ట్ సాయంతో వివాహం చేసుకున్నారు.‘‘వికలాంగులమైన మాకు పెళ్లి కావడం, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వ నుండడం ఊహించని విషయం. ఇది మాకు ఓ పునర్జన్మ లాంటిది. శారీరక లోపంతో కుంగిపోయే మా లాంటి వారికి కొత్త జీవితాన్ని స్తోంది చెన్నైలోని శ్రీగీతాభవన్ ట్రస్ట్’’ అన్నారు రమేశ్, ఫరీదాబాను దంపతులు. ధనిక, పేద, విద్య, అవిద్య, జాతి, కుల, మతాల వివక్ష చూపకుండా ఉచిత వివాహాలతో వికలాంగులను ఒక ఇంటివారిని చేస్తోంది ఈ ట్రస్టు. గడచిన ఐదేళ్లుగా సత్సంప్రదాయ విధానంలో వివాహాలకు చట్టబద్ధత కల్పించి, సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదిస్తోంది. ఆధ్యాత్మిక, సాంఘిక సేవా కార్యక్రమాల కోసం 1971లో చెన్నైలో శ్రీగీతాభవన్ ట్రస్ట్ ఏర్పడింది. మొదట్లో... ఉచితంగా గీతాబోధ, సంస్కృత పాఠాలు, హిందీ క్లాసులు, యోగా శిక్షణ, విద్యార్థులకు చిత్రలేఖనం, సంగీతం, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం వంటివి నిర్వహించేవారు. సేవా కార్యక్రమాలతో మరింత వినూత్నంగా ముందుకు సాగాలనుకున్నారు. అవయవ లోపంతో అవివాహితులుగా మిగిలిపోతున్న వారిని ఒక ఇంటివారిని చేయాలన్న సంక ల్పంతో, ప్రత్యేక ప్రతిభావంతుల కోసం స్వయంవరం నిర్వహించాలని భావించింది ఈ ట్రస్ట్. ఈ ఆలోచన 2010లో కార్యరూపం దాల్చింది. దేశంలోనే తొలిసారి... దేశంలోనే తొలిసారిగా చేస్తున్న ప్రయత్నం కావడంతో అవివాహితుల హాజరుపై నిర్వాహకులు అనుమానపడ్డారు. వారి అనుమానాన్ని పటాపంచలు చేస్తూ వందలాది మంది హాజరయ్యారు. ట్రస్ట్ పెద్దల సాక్షిగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అప్పటి నుంచి ట్రస్ట్ కార్యకలాపాల్లో ‘ప్రత్యేక స్వయంవరం’ ప్రధాన అంశంగా మారిపోయింది. పుట్టుకతో, ప్రమాదాలతో వికలాంగులైనవారే కాదు, కుష్ఠు వ్యాధిగ్రస్తులకూ ఇందులో అవకాశం ఉంది. వీరిలో ప్లస్ టూ నుంచి పీజీ వరకు చదివిన విద్యావంతులున్నారు. 2010లో తొలి ప్రయత్నంగా జరిపిన స్వయంవరంతో 34 జంటలు పెళ్లి పీటలెక్కాయి. ఇప్పటి దాకా దాదాపు 200 జంటలు ఇలా ఒక్కటయ్యారు. నిబద్ధతతో నిర్వహణ సామూహిక వివాహాలతో ఏకమైన జంటలు నిండు నూరేళ్లు కలిసి ఉండేలా నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మేనేజింగ్ ట్రస్టీ అశోక్ గోయల్. 18-36 ఏళ్ల వయసు వారు ఇందుకు అర్హులు. ఇతర ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కూడిన దరఖాస్తులను పరిశీలించి, స్వయంవరానికి కబురు పంపుతారు. పెద్దల సమక్షంలో వధూవరుల నిర్ణయం జరిగిన తరువాత వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, లాయర్లు కౌన్సెలింగ్ ద్వారా వధూవరులకు అన్ని విషయాలను వివరిస్తారు. అన్నింటికీ అంగీకరించినట్లుగా వారి నుంచి ఒప్పంద పత్రం తీసుకుని, హిందూ సంప్రదాయం ప్రకారం వేదపండితులతో వివాహం జరిపిస్తారు. ‘‘ఇతర మతాల వారు ట్రస్ట్ అనుమతితో వారికి ఇష్టమైన చోట పెళ్లి చేసుకోవచ్చు. ట్రస్ట్ అధ్వర్యంలో జరిగే వివాహాలకు రిజిస్ట్రారును హాజరుపరిచి రిజిస్ట్రేషన్ పత్రం మంజూరు చేయడం ద్వారా వీరి వివాహానికి చట్టబద్ధత కల్పిస్తున్నాం’’ అని అశోక్ వివరించారు. బంగారు తాళిబొట్టు, వధూవరులకు నూతన వస్త్రాలు, కొత్త కాపురానికి అవసరమైన వంటసామాగ్రి, నెలకు సరిపడా బియ్యం, సరుకులు ఉచితంగా ఇవ్వడం మరో విశేషం. మంచి మనసుకూ, మనుషుల సేవకూ వైకల్యం ఉండాల్సిన పని లేదనడానికి ఇదే నిదర్శనం. - కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై ఫోటోలు: వన్నె శ్రీనివాసులు వివాహంతో కొత్త వెలుగు వికలాంగులమైన మాకు జీవితంలో ఎప్పటికైనా వివాహం జరుగుతుందా అని ఆందోళన చెందాం. గీతాభవన్ ట్రస్ట్ మా జీవితాల్లో వెలుగులు నింపింది. - రమేశ్, ఫరీదాబాను సెప్టెంబరు 5 న తాజా స్వయంవరం వికలాంగుల నుండి అపూర్వ స్పందన రావడంతో ఎప్పటిలాగే ఈ ఏడాది సెప్టెంబరు 5న చెన్నైలోని ట్రస్ట్ హాలులో స్వయంవరం నిర్వహిస్తున్నారు. అర్హులైన జంటలకు నవంబరు 6న సామూహిక వివాహాలు జరిపిస్తారు. ఇందుకోసం జూలై 31లోగా ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: శ్రీగీతాభవన్ ట్రస్ట్, 334, అవ్వై షణ్ముగం రోడ్డు, గోపాలపురం, చెన్నై - 600 086. ఫోన్స్ 044-28351513, 9445198100. దరఖాస్తు ఫారాలను tnhfctmatri.com/ geetabhavantrust.com ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇ-మెయిల్: gbhavantrust@gmail.com / tnhfctrust@ yahoo.co. in -
రోడ్డు ప్రమాదమా.. హత్యాయత్నమా?
గాయపడ్డ ముగ్గురు ‘ఎర్ర’ దొంగలు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : అనంతపురం శివారులో ఆదివారం వేకువజామున జరిగిన ఎర్రచందనం దొంగల ముఠా సభ్యుల రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారా.. లేక ఎర్రచందనం దుంగలను రహస్యంగా తరలించి సొమ్ము చేసుకుంటుంటే పసిగట్టి ముఠా నేతలే వాహనంలో వెంబడించి ఏమైనా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్నది అంతుచిక్కడం లేదు. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నారాయణ అలియాస్ అగస్టీన్, ఇదే మండలం దొరికొట్టాలకు చెందిన రాజు, కర్ణాటకవాసి సోహైల్ శనివారం రాత్రి శ్రీశైలం అడవుల నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలతో కేఏ05 ఎంపీ 2855 నంబరుగల క్వాలీస్ వాహనంలో బెంగళూరుకు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి సమీపాన 44వ నంబరు జాతీయరహదారి వంతెనపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురూ లేవలేని స్థితిలో ఉన్నా పోలీసుల కంటపడకూడదని తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే స్థానికులు అక్కడకు చేరుకుని మానవతా దృక్పథంతో వారిని సర్వజనాస్పత్రికి చేర్చారు. అగస్టిన్, రాజు అపస్మారకస్థితికి చేరుకున్నారు. సోహైల్ మాత్రం స్పృహలో ఉన్నాడు. రోడ్డు ప్రమాదంపై అవుట్‌పోస్ట్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఉదయం పదిన్నర గంటల సమయంలో సంఘటన స్థలానికెళ్లారు. నుజ్జునుజ్జయిన క్వాలీస్ వాహనాన్ని తనిఖీ చేయగా.. సీటు కింద 9 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సర్వజనాస్పత్రిలో ఆ ముగ్గురు ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులకు ఎస్కార్టను నియమించారు. ఈ ముఠా వివరాలను తెలుసుకునేందుకు.. ఇంకా ఎక్కడెక్కడ దుంగలను నిల్వ చేశారో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. ఆ దుంగలు.. అటవీశాఖ కార్యాలయంలోనివంటూ పుకార్లు అనంతపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలను ఆధివారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. ఈ విషయంపై అటవీశాఖాధికారులు తర్జన భర్జనలో ఉండగానే...రోడ్డు ప్రమాదంలో ఎర్ర చందనం దొంగలు గాయపడి పోలీసులకు చిక్కారు. వీరి వాహనంలో లభించిన దుంగలు అటవీశాఖ కార్యాలయంలో అపహరణకు గురైనవీ ఒక్కటేనేమోనని పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఆ దుంగలు అటవీశాఖవి కాదని నిర్ధారణైంది. దీంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రతి అడుగులో.. కొత్తదనం
ఎస్పీబీఎంతో మహానగరానికి కొత్త హంగులు ఉద్యోగుల సహకారంతో జనానికి మెరుగైన సేవ వారంలో రెండు రోజులు పాతబస్తీ వాసుల కోసమే సాక్షి ఇంటర్వూ ్యలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సాక్షి, సిటీబ్యూరో ప్రతినిధి : ‘అనేక ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు, సవాళ్లు నేడు హైదరాబాద్ జనం మదిలో మెదిలే ప్రధాన అంశాలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అన్నింటా కృషి చేస్తుంది. ప్రతి అడుగులో అభివృద్ధి, సంక్షేమంతో కూడిన కొత్తదనం నింపుతూ రేపటి భవిష్యత్తుకు బాటలు వేస్తాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలక రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా నియమితులైన మహమూద్ గురువారం సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రేపటి హైదరాబాద్ కోసం తమ ప్రభుత్వం చేపట్టబోయే పథకాలు, తమ ముందున్న లక్ష్యాలు, సవాళ్లను ఆయన వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే.. హైదరాబాద్‌కు సరికొత్త ఇమేజ్ తెస్తాం హైదరాబాద్‌కు ప్రపంచ చిత్రపటంలో ఇప్పటికే ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం కలిగిన అతికొద్ది నగరాల్లో భాగ్యనగరి అగ్రభాగంలో ఉంది. అయితే ఇక్కడ స్థిరపడుతున్న వారి సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో 1930వ దశకంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వరంలో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ద్వారా ఏర్పాటు చేసిన రహదారులు, నాలాలు, మంచినీటి పైపులైన్లే ఇప్పటికీ పెద్ద దిక్కు. శివార్లలో అయితే మంచినీరు, రహదారి, వీధిలైట్ల పరిస్థితి తక్షణం మెరుగవ్వాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో హైదరాబాద్‌కు సరికొత్త ఇమేజ్ తెచ్చే దిశగా కార్యాచరణ మొదలైంది. నగర మంత్రిగా నాకూ ఆ కార్యాచరణలో భాగం పంచుకునే అవకాశం దక్కింది. రోడ్లు, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్ల (సడక్, పానీ, బిజిలీ, మకాన్- ఎస్పీబీఎం)పై దృష్టి సారించి నగరాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. సత్వర సేవలకు యాక్షన్‌ప్లాన్ రెవెన్యూ శాఖతో పాటు మహానగర పరిధిలో అన్నింటా పౌరులు, పారిశ్రామికవేత్తలకు సత్వర సేవలు అందించేందుకు ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను ప్రభుత్వం రూపొందించబోతోంది. ఉదాహరణకు నేను ఇటీవల సింగపూర్‌కు వెళ్లినప్పుడు 21 అంతస్తుల భవన నిర్మాణానికి గంటల్లో అన్ని అనుమతులు వచ్చేశాయి. మన హైదరాబాద్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అలాగే నూతన పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ పలు అవాంతరాలున్నాయి. ఇక ముందు సత్వర సేవలను అందించేదుకు కేసీఆర్ ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ముందుకు తేబోతుంది. అయితే కొత్తగా ఏర్పాటైన కొత్త రాష్ట్రం అన్నింటా ముందుకు వెళ్లాలంటే అంతటా బాధ్యతాయుతమైన వాతావరణం ఉండాలి. అందుకే నగరాభివృద్ధిలో కీలకమైన ఉద్యోగులు, సిబ్బందిని మేము మా కుటుంబసభ్యులుగానే భావిస్తూ వారితో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాం. ఇటీవల సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశంలోనూ రెండు కోట్ల జనానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళిక రూపొందించమని అధికారులను ఆదేశించ డం జరిగింది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యం నిజాం నవాబు.. నగరంలోని వేల ఎకరాల భూములు, భవంతులు అప్పటి ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూములు, భవనాలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకుని, వాటిని ప్రజా అవసరాలకు వినియోగించడం, మిగిలిన వాటిని పరిరక్షించడం చేయాలన్నది మా లక్ష్యం. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. న్యాయ వివాదాల్లో ఉన్న భూముల వివరాలు తెలుసుకుని ఉన్నత న్యాయస్థానాలకు అప్పీళ్లు వేస్తాం. మహానగర పరిధిలో రెవెన్యూ శాఖలో జవాబుదారీతనం, పారదర్శకత, సత్వర సేవల కోసం యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి వీలైనంత త్వరలో లోపాలు లేని సుపరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటా.. పద్నాలుగా సంవత్సరాల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజలు కోరుకున్న ప్రభుత్వమే కొలువుదీరింది. ఇంతటితో ప్రజల పని అయిపోయింది. మేమిక వారి సంక్షేమం, అభివృద్ధి చూసుకోవాలి. అధికారం వచ్చింది కదా అని ప్రజలకు దూరం వెళ్లాలనుకోవటం లేదు. సౌభ్రాతృత్వం - సమానత్వం, దాపరికం లేని పరిపాలన అనే ఎజెండాతో మహానగర ప్రజలకు నేను నిత్యం అందుబాటులో ఉంటా. ఈ ఆదివారం బాధ్యతలు తీసుకుంటా. అధికారులతో సమావేశాలు, సమీక్షల సమయం మినహాయిస్తే మిగిలిన సమయమంతా నగర ప్రజలకే కేటాయిస్తాం. శని, ఆదివారాల్లో అయితే ఆజంపురాలోనే పాతనగర వాసుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తాం. -
కేసీఆర్ బిజీబిజీ
బొకే అందజేసిన శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంపై పార్టీ నేతలతో మంతనాలు ఇంటి వద్ద సందడి సాక్షి,సిటీబ్యూరో: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కేసీఆర్‌కు అభినందనల వెల్లువ సాగుతోంది. ఆయన్ను కలిసేందుకు అనేకమంది బారులు తీరుతున్నారు. శుక్రవారం శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆరగంట పాటు నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రం గురించి పలు విషయాలను చర్చించినట్లు తెలిసింది. వీరితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకులతోపాటు పలుశాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధశాఖల ఉన్నతాధికారులు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ న్యాయవాదుల సంఘాల నాయకులు, పలు వ్యాపారసంస్థల అధిపతులు, పారిశ్రామివేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ కళాకారుల సంఘం నాయకులు, తెలంగాణ చిన్నపరిశ్రమల సంఘం నాయకులు, ముస్లిం, క్రైస్తవ ధార్మిక సంఘాల నేతలు, పలు జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, తెలంగాణవాదులు కాబోయే సీఎంను కలిసి అభినందించారు. మూతపడిన కల్లు దుకాణాలను తెరిపించాలి దోమలగూడ: నూతన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న కేసీఆర్‌ను తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి, కల్లు దుకాణాల సాధన సమితి ప్రతినిధులు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. హైదరాబాదులో మూతపడిన కల్లు దుకాణాలను తెరిపించాలని, తాటివనాల పెంపునకు గ్రామీణ ప్రాంతంలో ప్రతి సొసైటీకి ఐదు నుంచి పదిఎకరాల భూమిని కేటాయించాలని, గీత కార్మికుల సంక్షేమానికి గీత కార్పొరేషన్‌కు రూ.వెయ్యికోట్ల శాశ్వత నిధి కేటాయించాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి గీతకార్మికుడికి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని గౌడ ప్రతినిధులు కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. ఆయన్ను కలిసిన వారిలో గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ అంబాల నారాయణగౌడ్, కల్లు దుకాణాల సాధన సమితి కన్వీనర్ భిక్షపతిగౌడ్, గౌడ సంఘం ప్రధానకార్యదర్శి మూల శ్రావణ్‌కుమార్‌గౌడ్, గౌడ జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, గౌడ ప్రతినిధులు కాసుల సురేందర్‌గౌడ్, సదానందంగౌడ్, నారాయణగౌడ్, కక్కెర్ల కొమురయ్యగౌడ్, చెరుకు పాపయ్యగౌడ్, రామరాజుగౌడ్, నరేష్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, బాలకృష్ణగౌడ్, వేమూరు గణేష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్ తదితరులున్నారు. ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటాం ఉస్మానియాయూనివర్సిటీ : తన రాజకీయ ఎత్తుగడలతో ఎమ్మార్పీఎస్‌ను కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేశారని మాదిగ నేతలు విమర్శించారు. శుక్రవారం ఉస్మానియాయూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట రుద్రవరం లింగస్వామిమాదిగ, పురుషోత్తంమాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్రావుమాదిగ తదితరులు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ జూన్ 2న ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. -
ఐపీఎల్ 20-20పై బెట్టింగుల జోరు
పలమనేరు,న్యూస్‌లైన్ : జిల్లాలోని తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో ఐపీఎల్20-20 బెట్టింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు గంటల్లో ఫలితమొస్తుండడంతో ఈ మ్యాచ్‌లకు లక్షలాది రూపాయలు బెట్టింగుల రూపేణా చేతులు మారుతున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ విన్ ఎవరవుతారు? విన్ అయితే బ్యాటింగా, బౌలిం గా? పది ఓవర్ల మ్యాచ్ తర్వాత ఎంత స్కోరు వస్తుంది? సెకెండ్ బ్యాటింగ్‌కు దిగిన జట్టు గెలుస్తుందా, ఓడుతుం దా? ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారు? వికెట్లు పడగొట్టేదెవరు? ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కుతుంది? అంటూ పందెం కాస్తున్నారు. మరికొందరు తొందరగా డబ్బులు సంపాదించుకోవాలనో ఏమో ఓవర్ టు ఓవర్ బెట్టింగులు కడుతున్నారు. ఒక్క ఓవర్లో ఆరు బంతులకు ఎన్ని పరుగులొస్తాయి ? అనే విషయంపై నిమిషాల వ్యవధిలో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఐదు జట్లపైనే భారీగా బెట్టింగులు పంజాబ్, చెన్నైలు ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకోగా, మిగిలిన జట్లలో ఐదు అర్హత సాధించే అవకాశాలున్నాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్పై భారీగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఓ పారిశ్రామికవేత్త ఐపీఎల్ ట్రోఫీని పంజాబ్ కైవసం చేసుకుంటుందంటూ రూ.50 లక్షలు పందెం కాసినట్లు తెలుస్తోంది. ఇక మదనపల్లెకు చెందిన పలువురు రియల్టర్లు, పంజాబ్,రాజస్థాన్, కోల్‌కత్తాపై లక్షల రూపాయల బెట్టింగులు పెట్టినట్లు వినికిడి. పల్లెల నుంచి పట్టణాల దాకా........ పల్లెల్లో కోళ్ల పందేలు, పేకాట తదితర జూదాలుండేవి. పట్టణాల్లో అయితే పేకాట జోరుగా సాగుతుండేది. అయితే వ్యసనపరులు ట్రెండ్ మార్చారు. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా ఓ టీకొట్టులో కుర్చొని క్రికెట్ చూస్తూ పందెం కాస్తున్నారు. పట్టణాల్లో దాబాల వద్ద ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుకు వ్యసనపరులుగా మారిన యువకులు నిత్యం పందేలు కాసి తీవ్రంగా నష్టపోతున్నారు. తిరుపతి, మదనపల్లెలో పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్‌లు, వారు ధరించిన బంగారు ఆభరణాలను సైతం ఈ బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారని పలువురు చెబుతున్నారు. -
ఉద్యమవీరునికే పట్టం
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన టీఆర్ఎస్ తన సత్తా చాటింది. క్షణం క్షణం టెన్షన్...టెన్షన్‌గా సాగిన గజ్వేల్ అసెంబ్లీ లెక్కింపులో చివరకు ఉద్యమవీరున్నే విజయం వరించింది. గజ్వేల్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో ప్రారంభం కాగా, తెలంగాణలోనే కాదు...దేశ, విదేశాల్లోని తెలంగాణవాదులంతా ఫలితం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూశారు. మధ్యాహ్నానికే లెక్కింపు పూర్తయి కేసీఆర్‌ను విజేతగా ప్రకటించడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. 21 రౌండ్లుగా చేపట్టిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఐదు మినహా మిగిలిన 16 రౌండ్లలోనూ తన ఆధిక్యాన్ని చాటారు. ఈ నియోజకర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోగల 262 బూత్‌లలో మొత్తం 1,99,062 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కేసీఆర్ 86,372 ఓట్లను దక్కించుకుని సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19,218 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే కేసీఆర్ విజయం నల్లేరుమీద నడకే అయినా, టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి కేసీఆర్‌కు గట్టిపోటీనే ఇచ్చారు. ఈ ఎన్నికలో ప్రతాప్‌రెడ్డికి మొత్తం 67,154 ఓట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ తరఫున ఇక్కడ బరిలో దిగినమాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి కేవలం 33,998 ఓట్లే సాధించారు. ప్రాదేశిక ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్, టీడీపీలతో పోలిస్తే అత్యధిక ఓట్లను సాధించిన నర్సారెడ్డి, ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం చతికిలపడ్డారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో మొత్తం పదిమంది ‘బరి’లో నిలవగా, ఏడుగురి డిపాజిట్లు గల్లంతయ్యాయి. -
సంగీతానికి మంగళం
సంగీత కళాశాలలో చారిత్రక కోర్సులకు ముగింపు అధికారుల అనాలోచిత నిర్ణయాలు సంగీత ప్రియుడు శ్రీవేంకటేశ్వరునికి నిత్య స్వరార్చన చేయడంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులది కీలకపాత్ర. శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోస్తున్న కళాశాలను టీటీడీ నిర్వహిస్తోంది. అరుుతే అధికారులు, కొందరు అధ్యాపకుల అనాలోచిత నిర్ణయూలతో ఈ సంగీత కళాశాల మూతపడే పరిస్థితులు నెలకొంటున్నారుు. తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: ఆధ్యాత్మిక భావాలు, కళలపై ఆసక్తి ఉండడంతో అప్పటి టీటీడీ ఈవో చెలికాని అన్నారావు 1959లో సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రారంభంలో సంగీత విశారద, సంగీత ప్రవీణ కోర్సులను ప్రవేశపెట్టారు. అరుుతే 55 ఏళ్ల నుంచి ఉన్న ఈ చారిత్రక కోర్సులకు టీటీడీ అధికారులు మంగళం పాడేందుకు నిర్ణయించారు. శాస్త్రీయ కళలు, సంగీతంపై అవగాహన లేని, ఆధ్యాత్మిక చింతనలేని ఓ అధికారి ఈ చారిత్రక తప్పిదానికి కారణమయ్యాడు. కళాశాలలో ఈ కోర్సుల్లో మాత్రమే అత్యధికంగా విద్యార్థులు ఉంటారు. అలాంటి ఈ కోర్సులకు మంగళం పాడాలని నలుగురు అధ్యాపకులు కంకణం కట్టుకున్నారు. వీరి ప్రతిపాదనలను ఆమోదిస్తూ అధికారులు కోర్సులకు మంగళం పలికేందుకు పచ్చజెండా ఊపేశారు. తొలగింపు కోర్సుల ఫైల్ చక చక నడిపేస్తున్నారు. దీనిపై వచ్చే పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయి ఎస్వీ సంగీత నృత్య కళాశాల టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయిగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేనన్ని వసతులు, కోర్సులతో విరాజిల్లుతోంది. శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడులోనూ ఇన్ని సౌకర్యాలతో పగటి పూట సంగీత కళాశాల లేదు. అలాంటి కళాశాలలో ప్రక్షాళన పేరుతో సంగీతం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే మరే కళాశాలకు దీనికి పోటీ ఉండదు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శ్రీవారికి నిత్య సంగీత కైంకర్యం జరుగుతోందంటే అది సంగీత కళాశాల ఘనతే. శ్రీవారి సేవలు, ఉత్సవాల్లో పెద్ద ఎత్తున సంగీత కైంకర్యాలు కళాశాల నిర్వహణలోనే జరుగుతున్నాయి. అలాంటి కళాశాలలో కోర్సుల ఎత్తివేత నిర్ణయంతో మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. గత ఈవోలు సంగీత కళాశాల నిర్వహణకు వెనకడుగు వేయలేదు. మిగతా విద్యాసంస్థల నిర్వహణ వేరు... ఈ కళాశాల నిర్వహణ వేరు అని భావించి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కళాశాలకు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసలు కళాశాల ఉండడమే దండగని భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కళాశాలను మూసే కుట్ర దశలవారీగా కళాశాలను మూత వేసేందుకు కుట్ర జరగుతోంది. ఈ కుట్రలో నలుగురు అధ్యాపకులు ఓ అధికారితో భాగస్వామి అయ్యారు. తొలుత కోర్సుల తగ్గింపు, తరువాత దశల వారీగా కోర్సులను ఎత్తివేత ద్వారా విద్యార్థులను తగ్గించవచ్చు అని భావిస్తున్నారు. తద్వారా విద్యార్థులు లేరని కళాశాలకు శాశ్వతంగా తాళం వేసే కుట్ర శరవేగంగా జరిగిపోతోంది. డే కళాశాలలో మెత్తం 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సంగీత విశారద, ప్రవీణ కోర్సుల్లో(3 సంవత్సరాలు కలిపి) 182 మంది ఉన్నారు. బీమ్యూజిక్, ఎంఏ మ్యూజిక్ కోర్సుల్లో కేవలం 64 మంది విద్యార్థులు ఉన్నారు. అధికారులు నిర్ణయించినట్టు విశారద, ప్రవీణ కోర్సులకు మంగళం పలికితే కళాశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోతుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల తొలగింపే లక్ష్యంగా... సంగీత కళాశాలలో 28 మంది పర్మినెంట్, 20 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. విశారద కోర్సులను తొలగిస్తే మిగిలే విద్యార్థుల సంఖ్య కేవలం 64 మంది మాత్రమే. వీరికి 48 మంది అధ్యాపకులు అవసరమా అని యాజమాన్యం ఆలోచించక తప్పదు. తద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించవచ్చనేది టీటీడీ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే కుట్రలో భాగంగా కోర్సులను ఎత్తివేయడానికి ప్రయత్నించడం బాధాకరం. -
ఇన్ఫోసిస్ ఉద్యోగ మేళాకు భారీ స్పందన
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : నగరంలోని వీరశైవ విద్యాలయంలో గురువారం ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన ఉద్యోగ మేళాకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ బసవరాజ్ ప్రారంభించి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి గతంలో ఈ కళాశాలలో చదివిందని గుర్తు చేశారు. ఇదే కళాశాలలో ఆ కంపెనీ బృహత్ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరపడంతో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగాలు కల్పించి పేద విద్యార్థులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె సన్న బసవరాజు, ప్రొఫెసర్లు కే.మల్లికార్జునప్ప, ఎం.భోజరాజు, కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కాగా ఈ ఇంటర్వ్యూల్లో స్థానిక కళాశాలతోపాటు అల్లం సుమంగళమ్మ కళాశాల, హొస్పేట విజయనగర కళాశాల, కొట్టూరేశ్వర కళాశాల, సిరుగుప్ప ప్రభుత్వ కళాశాలకు చెందిన 487 మంది బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ విద్యార్థులు పాల్గొనగా 80 మంది ఎంపికయ్యారు. ఇందులో స్థానిక వీరశైవ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు, హొస్పేట విజయనగర కళాశాల నుండి 34 మంది, అల్లం సుమంగళమ్మ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. -
కమలమెక్కడ?
బీజేపీకి విపక్ష స్థానంపై రేపు నిర్ణయం నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించే విషయమై గురువారం నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప తెలిపారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ బుధవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారని, అనంతరం న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై తగు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కాగా ఎమ్మెల్యేల విదేశీ పర్యటనలపై నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 30 వరకు వారం పాటు జరిగే సమావేశాల్లో 1,201 ప్రశ్నలను స్వీకరించగా, 630 ప్రశ్నలను అంగీకరించామని చెప్పారు. సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులేవీ పెండింగ్‌లో లేవని, కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని ఆయన తెలిపారు. -
తప్పు చేస్తే ఏ ప్రభుత్వమైనా చర్యలు తప్పవు
నాతో చర్చించడానికి బీజేపీ నాయకులకు ధైర్యం లేదు గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ తుమకూరు, న్యూస్‌లైన్ : తప్పు చేసిన ఏ ప్రభుత్వమైనా చర్యలు తప్పవని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ అన్నారు. ఆదివారం తుమకూరు వర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మంత్రిమండలిలో చేర్చుకున్న విషయంతో సహా మిగిలిన ఏ విషయాల పైనైనా బీజేపీతో సహా మిగిలిన నాయకులెవరైనా తనతో స్వేచ్ఛగా మాట్లాడవ చ్చన్నారు. వారికి తాను సరైన సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే బీజేపీ నాయకులకు తనతో మాట్లాడే ధైర్యం లేదన్నారు. తుమకూరు వర్శిటీ లోగో విషయమై కొంతమంది విద్యార్థులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్నవిషయాలను విడిచిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వీ దేశ్‌పాండే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేసిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి స్థానం ఇవ్వాలనుకోవడంలో తప్పులేదన్నారు. ఈ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని భావించడం సరికాదన్నారు. అంతకు ముందు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో ఉన్నత శ్రేణి మార్కులు సాధించిన విద్యార్థులకు 38 స్వర్ణ పతకాలను అందజేశారు. ఇక ఇదే సందర్భంలో సామాజిక సేవ కార్యకర్తలు నరసమ్మ, శంకర్, గోవింద గౌడ్, నయిస్తాలకు గవర్నర్ భరద్వాజ్ గౌరవ డాక్టరేట్లను అందజేశారు. కార్యక్రమంలో తుమకూరు వర్శిటీ వైస్ చాన్స్‌లర్ రాజాసాహెబ్, రిజిస్టార్లు సిద్ధలింగయ్య, జయరామ్ పాల్గొన్నారు. అక్రమాలపై దర్యాప్తునకు డిమాండ్ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ భరద్వాజ్‌ను కొందరు విదృ్యర్థి సంఘాల నాయకులు చుట్టుముట్టారు. గతంలో యూనివర్శిటీ ఇచ్చిన పీహెచ్డీ పౄ్టల ప్రదానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ అక్రమాలపై తక్షణమే విచారణకు ఆదేశించాలని వారు గవర్నర్‌ను కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని గవర్నర్ విద్యార్థులతో అన్నారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులు పంపించి వేశారు. -
బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు
సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీలోకి తిరిగి చేరే విషయంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, ఒకవేళ అలాంటి ఆహ్వానం ఏదైనా అందితే తమ పార్టీ నాయకులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని బీఎస్ఆర్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు బీ. శ్రీరాములు అన్నారు. ఆయన శుక్రవారం సింధనూరులో విలేకరులతో మాట్లాడారు. బీజేపీలోకి యడ్యూరప్పను తిరిగి చేర్చుకునే విషయంలో ప్రయత్నాలు జరిగి ఉండవచ్చన్నారు. అయితే చేరిక విషయంలో తాను ఎలాంటి వ్యక్తిగత నిర్ణయం తీసుకునేది లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలను నిర్ల క్ష్యం చేయడం వల్ల తమ పార్టీ అభ్య ర్థులు ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి, చిత్రదుర్గం, హావేరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలనే యోచన ఉందన్నారు. బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి బట్టబయలైందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిపై మండిపడ్డారన్నారు. కొందరు ఉపాధ్యాయులు కూడా డిమాండ్ల పరిష్కారం కోసం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చూస్తే ప్రభుత్వం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎంతగా విఫలమైందో అర్థమవుతుందన్నారు. వెంటనే వరి, మొక్కజొన్న, పత్తికి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్న విషయం గుర్తు చేయగా, తాము ఆయన కన్నా చిన్నవారమని, చిన్న చిన్న తప్పులు చేసి ఉండవచ్చని వాటిని ఆయన క్షమిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. కార్యక్రమంలో బీఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.కరియప్ప, బసనగౌడ దద్దల్, ప్రముఖులు కే.భీమణ్ణ, వకీల్ నిరుపాది తదితరులు పాల్గొన్నారు.