- నాతో చర్చించడానికి బీజేపీ నాయకులకు ధైర్యం లేదు
- గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్
తుమకూరు, న్యూస్‌లైన్ : తప్పు చేసిన ఏ ప్రభుత్వమైనా చర్యలు తప్పవని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ అన్నారు. ఆదివారం తుమకూరు వర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మంత్రిమండలిలో చేర్చుకున్న విషయంతో సహా మిగిలిన ఏ విషయాల పైనైనా బీజేపీతో సహా మిగిలిన నాయకులెవరైనా తనతో స్వేచ్ఛగా మాట్లాడవ చ్చన్నారు. వారికి తాను సరైన సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
అయితే బీజేపీ నాయకులకు తనతో మాట్లాడే ధైర్యం లేదన్నారు. తుమకూరు వర్శిటీ లోగో విషయమై కొంతమంది విద్యార్థులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్నవిషయాలను విడిచిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వీ దేశ్‌పాండే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేసిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి స్థానం ఇవ్వాలనుకోవడంలో తప్పులేదన్నారు. ఈ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని భావించడం సరికాదన్నారు. అంతకు ముందు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో ఉన్నత శ్రేణి మార్కులు సాధించిన విద్యార్థులకు 38 స్వర్ణ పతకాలను అందజేశారు. ఇక ఇదే సందర్భంలో సామాజిక సేవ కార్యకర్తలు నరసమ్మ, శంకర్, గోవింద గౌడ్, నయిస్తాలకు గవర్నర్ భరద్వాజ్ గౌరవ డాక్టరేట్‌లను అందజేశారు. కార్యక్రమంలో తుమకూరు వర్శిటీ వైస్ చాన్స్‌లర్ రాజాసాహెబ్, రిజిస్టార్‌లు సిద్ధలింగయ్య, జయరామ్ పాల్గొన్నారు.
అక్రమాలపై దర్యాప్తునకు డిమాండ్
స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ భరద్వాజ్‌ను కొందరు విదృ్యర్థి సంఘాల నాయకులు చుట్టుముట్టారు. గతంలో యూనివర్శిటీ ఇచ్చిన పీహెచ్‌డీ పౄ్టల ప్రదానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ అక్రమాలపై తక్షణమే విచారణకు ఆదేశించాలని వారు గవర్నర్‌ను కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని గవర్నర్ విద్యార్థులతో అన్నారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులు పంపించి వేశారు.