తిరుపతిలో సైబర్ హర్రర్ | Tirupati Cyber ​​Horror | Sakshi
Sakshi News home page

తిరుపతిలో సైబర్ హర్రర్

Published Sun, Jun 29 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

తిరుపతిలో సైబర్ హర్రర్

తిరుపతిలో సైబర్ హర్రర్

  •      ఆందోళనలో ప్రజలు
  •      అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
  • తిరుపతి క్రైం: ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాలు, మెట్రో పాలిటన్ సిటీలకు పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడిప్పుడే తిరుపతి పట్టణంలోకీ తొంగి చూస్తున్నా యి. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమాయక ప్రజలను రకరకాలుగా మోసగిస్తున్నారు. లక్షల రూపాయలు బహుమతిగా వచ్చాయంటూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపుతారు. ఆ మొత్తం పొందాలంటే ముందుగా కొంత నగదును చెల్లించాలని నమ్మబలుకుతారు.

    దీన్ని నమ్మి డబ్బు ఇచ్చిన వారికి ఎలాంటి బ హుమతి సొమ్మూ రాదు. లేదంటే, బహుమతి సొమ్ము పంపుతాం, బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ పంపించమని కోరుతారు. ఈ వివరాలు పంపారంటే, ఇక అంతే.. వారి అకౌంట్‌లోని మొత్తం హుష్‌కాక్.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చాలామంది యువతీ యువకులు ఇలాంటి మెసేజ్‌ల ద్వారా మోసపోయారని పోలీసులు చెబుతున్నారు. బయటకు తెలిస్తే అవమానంగా భావించి కొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారు.

    ఇలాంటి ఘటనే ఇటీవల తిరుచానూరులో వెలుగు చూసింది. నైజీరియా దేశానికి చెందిన ఇమ్మానుయేల్ ఈజీగా డబ్బు సంపాదించడం కోసం మహిళ పేరుతో తిరుపతికి చెందిన రియల్టర్ వెంకటరమణనాయుడును  ఈ మెయిల్ ద్వారా ముగ్గులోకి లాగాడు. అతని నుంచి రూ.3.61 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకున్నాడు.

    మోసపోయానని తెలుసుకున్న వెంకటరమణనాయుడు ఇమ్మానుయేల్‌ను తెలివిగా తిరుపతికి రప్పించి నిర్బంధించాడు. చివరకూ ఇద్దరూ కటకటాల వెనక్కు వెళ్లారు. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు తిరుపతితోపాటు పరిసర ప్రాంతాలకు పాకడంపై పోలీసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. కాగా ఇలాంటి నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.
     
    మెయిల్స్, మెసేజ్‌లను చూసి మోసపోవద్దు
     
    ఫోన్ మెసేజ్‌లను, మొయిల్స్‌ను చూసి మోసపోవద్దండి. ఈజీగా మనీ సంపాదించేందుకు కొంతమంది క్రిమినల్స్ ఇలాంటి వాటిని ఎరగా వాడుకుంటున్నారు. అలాంటి చీటింగ్‌లకు మోసపోకూడదు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి సైబర్‌నేరగాళ్లను పట్టుకుంటాం.
     -ఎస్వీ.రాజశేఖర్‌బాబు, ఎస్పీ, తిరుపతి అర్బన్ జిల్లా
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement