మళ్లీ ప్రకంపనలు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ | Delhi ncr Earthquake Strong Earthquake | Sakshi
Sakshi News home page

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు .. అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ

Published Mon, Feb 17 2025 6:55 AM | Last Updated on Mon, Feb 17 2025 10:00 AM

Delhi ncr Earthquake Strong Earthquake

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపన తీవ్రంగా ఉండటంతో భూమి కొన్ని సెకన్ల పాటు దీని ప్రభావం కనిపించింది. జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. దీని కేంద్రం ఢిల్లీ చుట్టూ ఉందని సమాచారం. భూ ప్రకంపనలతో పాటు, ఏదో విరిగిపోతున్నట్లు శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్ధాలకు జనం మరింత భయాందోళనలకు గురయ్యారు.

ఈ భూకంప ప్రకంపనల గురించి స్థానికుడు సుమన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘భూమి కింద ఏదో విరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ పెద్ద శబ్దంతో నేను నిద్రలో నుంచి మేల్కొన్నాను. ఎంతో భయాందోళనలకు లోనయ్యాను.  నేను నా ఐదేళ​ కుమారుడిని ఎత్తుకుని, ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంటి నుండి బయటకు పరుగులు తీశాను. నాలాగే చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిలబడ్డారు’ అని తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత ఢిల్లీలో ఈ స్థాయి భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

బీహార్‌, హర్యానాలో..
ఢిల్లీతో పాటు బీహార్‌,హర్యానాలలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. బీహార్‌లోని సివాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది.  ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హర్యానాలోనూ భూ ప్రకంపనలు  సంభవించాయి. హర్యానాలోని  గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్‌తక్‌, సోనిపట్‌లలో  భూమి కంపించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న బహదూర్‌గఢ్‌లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి.

 

ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భూకంపం పై ఢిల్లీ ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని, సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని తెలిపారు. మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. 



భూకంపాలకు కారణమిదే..
భూమి నాలుగు పొరలతో కూడి ఉంటుంది. ఇవి ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌. వీటిలో క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అని అంటారు. ఈ 50 కి.మీ మందపాటిగా ఉన్న పొర అనేక భాగాలుగా విభజితమై ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల ఇలాంటి ఏడు ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు  భూప్రకంపనలు సంభవిస్తాయి.  

భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ఆధారంగా కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అని కూడా అంటారు.  భూకంపం కేంద్రం నుంచి తీవ్రత ఎంతనేది కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు ఆ సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి భూకంపం ఏ తీవ్రతతో ఉందనేది చెబుతారు. భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం అంత తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే దానిని భారీ భూకంపంగా గుర్తిస్తారు.

ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్‌!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement