![24 Year Old House Surgeon Gives New Lives to Five People](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/5333.jpg.webp?itok=_D9bcCBb)
తాను మరణిస్తూ.. మరో ఐదుగురికి ప్రాణం పోసి
గొప్ప మనసు చాటుకున్న డాక్టర్ భూమికారెడ్డి
తల్లిదండ్రుల సహకారం ప్రశంసనీయం :
కాంటినెంటల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి
వయసులో ఆమె చాలా చిన్నది.. కానీ గొప్ప మనసుందని ప్రపంచానికి చాటి చెప్పింది.. తాను మరణిస్తున్నానని తెలిసి.. మరో ఐదుగురి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు..మరణానంతరం మరో ఐదుగురికి ప్రాణంపోయడమే కాదు.. వారి రూపంలో తాను జీవించి ఉందనేలా.. ఆమె తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. అవయవ దానంపై ఆమె నిర్ణయం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. ఇంతటి గొప్ప త్యాగానికి.. రూపమిచ్చిన ఆమె పేరు డాక్టర్ భూమికారెడ్డి..
యువ డాక్టర్ నంగి భూమికారెడ్డి (24) స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం, నంగివాండ్లపల్లి. నంగి నందకుమార్ రెడ్డి, లోహిత దంపతుల ఏకైక కుమార్తె. ఇటీవలే వైద్య విద్యను పూర్తి చేసి హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా వైద్య సేవలను అందిస్తోంది. ఫిబ్రవరి 1న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తాను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని అనుకోకుండా ప్రమాదానికి గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న భూమికారెడ్డిని సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ శివానందరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం చికిత్సలు చేసింది. క్రానియోటమీ సర్జరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం తుది శ్వాస విడిచింది.
బిడ్డ మాట కోసం..
భూమికారెడ్డి తమతో పదే పదే అవయవదానం గురించి మాట్లాడుతుండేదని, ఆ మేరకు తమ బిడ్డ మాట కోసం భూమికారెడ్డి అవయవాలను దానం చేయడానికి తమ కుటుంబ సభ్యులతో చర్చించి చివరకు అంగీకరించారు తల్లిదండ్రులు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ గుండెలవిసేలా రోదిస్తుంటే.. ఆస్పత్రిలోని సందర్శకులు, ఇతర రోగుల కళ్లు చెమ్మగిల్లాయి. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుని మరో ఐదుగురి ప్రాణాలను నిలబెట్టాలనే నిర్ణయానికి వచి్చన భూమికారెడ్డి తల్లిదండ్రులను అక్కడి డాక్టర్లు అభినందించారు. అనంతరం భూమికారెడ్డి మృతదేహానికి కాంటినెంటల్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు.
భూమికారెడ్డి త్యాగం వెలకట్టలేనిది..
యువ డాక్టర్ భూమికారెడ్డి మన మధ్య లేకపోయినా ఆమె చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆమె, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సమిష్టిగా నిర్ణయించి అవయవదానం చేయడానికి ముందుకురావడం కలకాలం గుర్తిండిపోతుంది. భూమికారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం. వైద్య రంగం ఓ మంచి వైద్యురాలిని కోల్పోయింది.
– కాంటినెంటల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి
అవయవదానం వివరాలు..
డాక్టర్ భూమికారెడ్డి అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రెండు కిడ్నీలను అవయవదానం చేశారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తులను కిమ్స్ ఆస్పత్రికి, గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి, కాలేయం కాంటినెంటల్ ఆస్పత్రికి, కిడ్నీల్లో ఒకటి నిమ్స్ ఆస్పత్రికి, మరొకటి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment