బెంగుళూరు పిలుస్తోంది
ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్, హైదరాబాద్ పోరు నేడు
ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ దశలో అధికశాతం రోజులు హైదరాబాద్, గుజరాత్ జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆఖరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్‌కు వస్తుందో లేదో తెలియని బెంగళూరు మాత్రం సంచలన ఆటతీరుతో అందరికంటే ముందు వెళ్లి ఫైనల్లో కూర్చుంటే... ఇప్పుడు గుజరాత్, హైదరాబాద్ ఫైనల్ బెర్త్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. నేడు జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు బెంగళూరులో ఆదివారం జరిగే ఫైనల్లో బెంగళూరుతో ఆడుతుంది.
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పవర్‌కు, గుజరాత్ లయన్స్ హార్డ్ హిట్టర్లకు మధ్య రసవత్తర పోరుకు తెర లేవనుంది. ఫైనల్లో బెర్త్ కోసం ఈ రెండు జట్లు నేడు (శుక్రవారం) ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. లీగ్ దశలో లయన్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ నెగ్గింది. అంతేకాకుండా బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో కోల్‌కతాను చిత్తు చేసిన జోష్‌లో వార్నర్ బృందం బరిలోకి దిగబోతోంది. మరోవైపు టేబుల్ టాపర్‌గా తొలి క్వాలిఫయర్ ఆడిన లయన్స్... డి విలియర్స్ ధాటికి బెంగళూరు చేతిలో అనూహ్యంగా ఓడింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ను వదులుకోకూడదనే కసితో ఉంది. తద్వారా లీగ్ మ్యాచ్‌ల్లో సన్‌పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవచ్చు కూడా.
ఆత్మవిశ్వాసంతో సన్‌రైజర్స్
కోల్‌కతాతో ఇదే మైదానంలో ఎలిమినేటర్ ఆడిన సన్‌రైజర్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో యువరాజ్ సరైన సమయంలో టచ్‌లోకొచ్చాడు. వార్నర్, ధావన్‌ల ఫామ్ జట్టుకు అదనపు బలం. కేన్ విలియమ్సన్ స్థానంలో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో మాత్రం ఆదుకున్నాడు. దీపక్ హుడా కూడా కోల్‌కతాతో కీలక సమయంలో బ్యాట్ ఝళిపించాడు. బౌలింగ్‌లో ముస్తఫిజుర్, భువనేశ్వర్, శరణ్ ముగ్గురూ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్ బిపుల్‌శర్మ మరోసారి కీలకం కావచ్చు.
ఒత్తిడిలో లయన్స్: ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్‌కు వెళ్లాల్సిన దశ నుంచి రెండో క్వాలిఫయర్ ఆడాల్సి వచ్చిన స్థితిలో లయన్స్‌పై కాస్త ఒత్తిడి ఉంది. ఓపెనర్లు మెకల్లమ్, ఫించ్ ఎవరికి వారు విధ్వంసకర ఆటగాళ్లే అయినా కలిసి మాత్రం ఆ మ్యాజిక్ చూపించలేకపోతున్నారు. రైనా, కార్తీక్, స్మిత్‌లపై బ్యాటింగ్ ఆధారపడి ఉంది. బెంగళూరుపై ధావల్ కులకర్ణి సంచలన బౌలింగ్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్ టాప్-4 బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు ఎడమచేతివాటం వారే కావడం వల్ల ఈ మ్యాచ్‌లో జకాతిని ఆడించకపోవచ్చు.
సోనీ సిక్స్‌లో రాత్రి 8.00 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం