లయన్స్‌కు సన్ స్ట్రోక్ | hyderabad sunrisers won by 10 wickets | Sakshi
Sakshi News home page

లయన్స్‌కు సన్ స్ట్రోక్

Published Fri, Apr 22 2016 12:16 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

లయన్స్‌కు సన్ స్ట్రోక్ - Sakshi

లయన్స్‌కు సన్ స్ట్రోక్

10 వికెట్ల తేడాతో నెగ్గిన హైదరాబాద్
గుజరాత్‌కు తొలి ఓటమి
చెలరేగిన వార్నర్, శిఖర్
రాణించిన భువనేశ్వర్
 

భారీ షాట్లకు పోలేదు. విధ్వంసకర బ్యాటింగ్ చేయలేదు.. అయినా లీగ్‌లోకి కొత్తగా వచ్చిన గుజరాత్ లయన్స్‌కు సన్‌రైజర్స్ గట్టి స్ట్రోకే ఇచ్చింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా చెలరేగుతూ  హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న లయన్స్‌కు తొలి ఓటమిని రుచి చూపెట్టింది. ఓపెనర్లు వార్నర్, ధావన్‌ల బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ తొలిసారి 10 వికెట్ల తేడాతో నెగ్గింది.
 
 
 
రాజ్‌కోట్: ఎట్టకేలకు హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. మొన్న సొంతగడ్డపై పటిష్టమైన ముంబైని మట్టికరిపించిన సన్‌రైజర్స్... ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై చెలరేగిపోయింది. బౌలింగ్‌లో సమష్టిగా చెలరేగి గుజరాత్ లయన్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు), శిఖర్ ధావన్ (41 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) దుమ్మురేపడంతో ఐపీఎల్-9లో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు చేసింది. కెప్టెన్ సురేశ్ రైనా (51 బంతుల్లో 75; 9 ఫోర్లు) అర్ధసెంచరీతో చెలరేగినా... మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత హైదరాబాద్ 14.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 137 పరుగులు చేసింది.


కెప్టెన్ ఇన్నింగ్స్...: పిచ్‌పై కాస్త పచ్చిక ఉండటంతో ఆరంభంలో సన్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. దీంతో ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఫించ్ (0) అవుటయ్యాడు. తర్వాత రైనా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చివరి వరకు పోరాడాడు. ఐదో ఓవర్‌లో మెకల్లమ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, ఓ సిక్స్) భారీ సిక్సర్, ఫోర్‌తో జోరు పెంచాడు. పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని ఎనిమిదో ఓవర్‌లో బిపుల్ శర్మ విడగొట్టడంతో లయన్స్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 6.4 ఓవర్లలో 56 పరుగులు జోడించారు. మ్యాచ్ మధ్యలో హైదరాబాద్ బౌలర్లు మరింత చెలరేగారు.

ఓ ఎండ్‌లో రైనాను నిలబెట్టి... రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో భారీ హిట్టర్లు దినేశ్ కార్తీక్ (8), బ్రేవో (8), జడేజా (14 బంతుల్లో 14)లను అవుట్ చేశారు. దీంతో లయన్స్ రన్‌రేట్ పూర్తిగా మందగించింది. ఈ క్రమంలో రైనా 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌లో భువనేశ్వర్ (4/29) ఐదు బంతుల తేడాలో రైనా, అక్షదీప్ (5), స్టెయిన్ (1)లను అవుట్ చేయడంతో గుజరాత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.

 వార్నర్ దూకుడు...: లక్ష్య ఛేదనలో హైదరాబాద్ దూకుడును చూపెట్టింది. ముఖ్యంగా వార్నర్... తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదడంతో 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్‌లో ప్రవీణ్ 13 పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు, ఐదో ఓవర్లలో వార్నర్ ఐదు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ స్కోరు 63 పరుగులకు చేరుకుంది. గుజరాత్ బౌలర్లలో ఏ ఒక్కరు కూడా పరుగులు నిరోధించలేకపోయారు. ఈ జోడిని విడదీసేందుకు స్వయంగా కెప్టెన్ రైనానే రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో ధావన్ కూడా సమయోచితంగా ఆడాడు. స్పిన్‌లో సింగిల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. ఈ ఇద్దరి నిలకడతో తొలి 10 ఓవర్లలో 96 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు కాస్త నెమ్మదిగా ఆడిన ధావన్... 12వ ఓవర్‌లో రెండు బౌండరీలు సాధించి జోష్ తెచ్చాడు. ఇక 48 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో ఈ జోడి వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ విజయానికి అవసరమైన పరుగులు జత చేసింది. భువనేశ్వర్ కుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది.


 స్కోరు వివరాలు
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) భువనేశ్వర్ 0; మెకల్లమ్ (సి) హుడా (బి) బిపుల్ 18; రైనా (సి) హెన్రిక్స్ (బి) భువనేశ్వర్ 75; దినేశ్ కార్తీక్ (సి) భువనేశ్వర్ (బి) హుడా 8; బ్రేవో (సి) భువనేశ్వర్ (బి) శరణ్ 8; జడేజా (బి) ముస్తాఫిజుర్ 14; అక్షదీప్ నాథ్ (సి) బిపుల్ (బి) భువనేశ్వర్ 5; స్టెయిన్ (సి) మోర్గాన్ (బి) భువనేశ్వర్ 1; ప్రవీణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 135.


వికెట్ల పతనం: 1-0; 2-56; 3-74; 4-91; 5-117; 6-133; 7-133, 8-135.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-29-4; బరీందర్ శరణ్ 4-0-36-1; ముస్తాఫిజుర్ 4-0-19-1; దీపక్ హుడా 3-0-22-1; హెన్రిక్స్ 3-0-17-0; బిపుల్ శర్మ 2-0-10-1.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ నాటౌట్ 74; ధావన్ నాటౌట్ 53; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (14.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 137.
బౌలింగ్: స్టెయిన్ 2-0-17-0; ప్రవీణ్ 2-0-31-0; బ్రేవో 3-0-26-0; రైనా 2-0-16-0; ప్రవీణ్ తాంబే 2-0-17-0; జడేజా 2.5-0-20-0; ధవల్ కులకర్ణి 1-0-9-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement