సురేష్ రైనా ఒంటరి పోరాటం..
రాజ్ కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా ఆకట్టుకున్నాడు. ఒకవైపు లయన్స్ టాపార్డర్ ఆటగాళ్లు వరుసగా క్యూకట్టినా.. రైనా మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. సురేష్ రైనా(75; 51 బంతుల్లో 9ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గుజరాత్ లయన్స్ 136 పరుగుల సాధారణ లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి ముందు ఉంచకల్గింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. ఆ తరుణంలో బ్రెండన్ మెకల్లమ్ -సురేష్ రైనాలు ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. కాగా, జట్టు స్కోరు 56 పరుగుల వద్ద మెకల్లమ్(18) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్(8), డ్వేన్ బ్రేవో(8), రవీంద్ర జడేజా(14)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. కాగా, రైనా మాత్రం ఆచితూచి బ్యాటింగ్ చేస్తూనే, మధ్య మధ్యలో ఫోర్లు సాధించాడు. దీంతో గుజరాత్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు సాధించగా, బరీందర్ శ్రవణ్,రెహ్మాన్, హూడా, బిపుల్ శర్మలకు తలో వికెట్ దక్కింది.