ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గుజరాత్ లయన్స్తో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలుత గుజరాత్ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో కోల్‌కతాను చిత్తు చేసిన జోష్‌లో వార్నర్ బృందం బరిలోకి దిగబోతోంది. దీంతో సన్‌రైజర్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో యువరాజ్ సరైన సమయంలో టచ్‌లోకొచ్చాడు. వార్నర్, ధావన్‌ల ఫామ్ జట్టుకు అదనపు బలం. కేన్ విలియమ్సన్ స్థానంలో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో మాత్రం ఆదుకున్నాడు. దీపక్ హుడా కూడా కోల్‌కతాతో కీలక సమయంలో బ్యాట్ ఝళిపించాడు. బౌలింగ్‌లో ముస్తఫిజుర్, భువనేశ్వర్, శరణ్ ముగ్గురూ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్ బిపుల్‌శర్మ మరోసారి కీలకం కావచ్చు.
మరోవైపు టేబుల్ టాపర్‌గా తొలి క్వాలిఫయర్ ఆడిన లయన్స్... డివిలియర్స్ ధాటికి బెంగళూరు చేతిలో అనూహ్యంగా ఓడింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ను వదులుకోకూడదనే కసితో ఉంది. ఈ నేపథ్యంలో రెండో ఫైనల్ బెర్తు కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పవర్‌కు, గుజరాత్ లయన్స్ హార్డ్ హిట్టర్లకు మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
రెండో ఫైనల్ బెర్తు ఎవరిదో?
Published Fri, May 27 2016 7:45 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement