‘సూర్య’ ప్రతాపం | Sunrisers Hyderabad crush Gujarat Lions by 9 wickets | Sakshi
Sakshi News home page

‘సూర్య’ ప్రతాపం

Published Mon, Apr 10 2017 2:14 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

‘సూర్య’ ప్రతాపం - Sakshi

‘సూర్య’ ప్రతాపం

► సన్‌ రైజర్స్‌కు రెండో విజయం
► 9 వికెట్లతో గుజరాత్‌ చిత్తు
► రాణించిన రషీద్‌ ఖాన్‌
► వార్నర్, హెన్రిక్స్‌ అర్ధసెంచరీలు


ఆదివారం హైదరాబాద్‌ నగరంలో భానుడు తీవ్ర ప్రతాపం చూపించాడు. చిక్కటి ఎండలో బయటకు వెళ్లినవారు అల్లాడిపోయారు. కానీ అదే సమయంలో క్రికెట్‌ అభిమానులకు మాత్రం మరో ‘సన్‌’ సాంత్వన చేకూర్చింది. ఐపీఎల్‌లో తమ జోరు కొనసాగిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఏ మాత్రం పోటీనివ్వలేకపోయిన గుజరాత్‌ లయన్స్‌ను చిత్తుగా ఓడించి సొంతగడ్డపై తమ బలాన్ని ప్రదర్శించింది. ముందుగా అప్ఘాన్‌ ఫిరంగి రషీద్‌ తన లెగ్‌ స్పిన్‌తో ప్రత్యర్థి పని పట్టగా... అనంతరం వార్నర్, హెన్రిక్స్‌ అలవోకగా ఆడుతూ 27 బంతులు మిగిలి ఉండగానే గెలుపును రైజర్స్‌ ఖాతాలో వేశారు.

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ లయన్స్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పుడు దానిని నాలుగుకు పెంచుకుంది. ఇక్కడి ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం ఏకపక్షంగా సాగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లయన్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.

డ్వేన్‌ స్మిత్‌ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జేసన్‌ రాయ్‌ (21 బంతుల్లో 31; 5 ఫోర్లు), దినేశ్‌ కార్తీక్‌ (32 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించారు. రషీద్‌ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం రైజర్స్‌ 15.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 140 పరుగులు సాధించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (45 బంతుల్లో 76 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిక్స్‌ (39 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు అభేద్యంగా 108 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రషీద్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ముంబైలో బుధవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో రైజర్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.

చెలరేగిన రషీద్‌...
లయన్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో రాయ్‌ దూకుడు కనబర్చగా... ఆ తర్వాత  కార్తీక్, స్మిత్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆ జట్టు కాస్త మెరుగైన స్థితిలో కనిపించింది. రైజర్స్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో గుజరాత్‌ బ్యాటింగ్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. మొదట్లో భువీ, బిపుల్‌ వేసిన వరుస ఓవర్లలో రాయ్‌ వరుసగా రెండేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు.

అయితే రషీద్‌ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తన తొలి ఓవర్లోనే అద్భుత బంతితో మెకల్లమ్‌ (5)ను అవుట్‌ చేసి అతను లయన్స్‌ను దెబ్బ తీశాడు. తర్వాతి ఓవర్లో భువనేశ్వర్, రాయ్‌ను పెవిలియన్‌ పంపించాడు. రషీద్‌ వెంటనే తన వరుస ఓవర్లలో ఫించ్‌ (3), రైనా (5)లను అవుట్‌ చేయడంతో గుజరాత్‌ మరింత ఇబ్బందుల్లో పడింది. ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఒక బౌలర్‌ ముగ్గురిని ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేయడం ఇదే తొలిసారి. ఈ దశలో కార్తీక్, స్మిత్‌ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 46 బంతుల్లో 56 పరుగులు జోడించారు. అయితే ఐదు బంతుల వ్యవధిలో కార్తీక్, స్మిత్‌ వెనుదిరగడంతో గుజరాత్‌ భారీ స్కోరు ఆశలు సన్నగిల్లాయి.
 
భారీ భాగస్వామ్యం...
ప్రయోగాత్మకంగా ఐపీఎల్‌లో మొదటిసారి తొలి ఓవర్‌ వేసిన రైనా మూడు పరుగులే ఇచ్చాడు. అయితే అతని తర్వాతి ఓవర్లో మాత్రం సన్‌ చెలరేగింది. ఇందులో వార్నర్‌ రెండు, ధావన్‌ ఒక సిక్సర్‌ బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ధావన్‌ (9)ను అవుట్‌ చేయడంలో ప్రవీణ్‌ సఫలమైనా, ఆ తర్వాత వార్నర్, హెన్రిక్స్‌ జోడి చకచకా పరుగులు సాధించింది. లెగ్‌ స్పిన్నర్‌ తేజస్‌ బరోకా తొలి రెండు బంతులను వార్నర్‌ ఫోర్లుగా మలచగా, ఆ తర్వాత ధావల్‌ ఓవర్లో హెన్రిక్స్‌ వరుసగా మరో రెండు బౌండరీలు కొట్టాడు.

లయన్స్‌ బౌలింగ్‌ మరీ పేలవంగా ఉండటంతో ఇద్దరు సన్‌ బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. 31 బంతుల్లో వార్నర్‌ అర్ధసెంచరీ పూర్తయింది. రైజర్స్‌ జట్టు తరఫున అతనికి ఇది 23వ అర్ధ సెంచరీ కాగా, హైదరాబాద్‌లో 9వది. ఈ క్రమంలో టి20 క్రికెట్‌లో 7 వేల పరుగులు, సన్‌రైజర్స్‌ తరఫున 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న వార్నర్, ఒక్క ఉప్పల్‌ స్టేడియంలోనే వేయి పరుగులు సాధించడం విశేషం. మరోవైపు 38 బంతుల్లో వరుసగా రెండో మ్యాచ్‌లో హెన్రిక్స్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బరోకా తర్వాతి బంతినే భారీ సిక్సర్‌గా మలచి వార్నర్‌ మ్యాచ్‌ ముగించాడు.

స్కోరు వివరాలు
గుజరాత్‌ లయన్స్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) ధావన్‌ (బి) భువనేశ్వర్‌ 31; మెకల్లమ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 5; రైనా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 5; ఫించ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 3; కార్తీక్‌ (సి) ఓజా (బి) నెహ్రా 30; డ్వేన్‌ స్మిత్‌ (సి) సబ్‌ శంకర్‌ (బి) భువనేశ్వర్‌ 37; కులకర్ణి (రనౌట్‌) 1; ప్రవీణ్‌ కుమార్‌ (నాటౌట్‌) 7; బాసిల్‌ థంపి (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135.
వికెట్ల పతనం: 1–35, 2–37, 3–42, 4–57, 5–113, 6–114, 7–115; బౌలింగ్‌: బిపుల్‌ శర్మ 4–0–24–0, భువనేశ్వర్‌ 4–0–21–2, నెహ్రా 4–0–27–1, రషీద్‌ ఖాన్‌ 4–0–19–3, కటింగ్‌ 3–0–29–0, హెన్రిక్స్‌ 1–0–12–0.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (నాటౌట్‌) 76; ధావన్‌ (సి) మెకల్లమ్‌ (బి) ప్రవీణ్‌ 9; హెన్రిక్స్‌ (నాటౌట్‌) 52; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 140.
వికెట్‌ పతనం: 1–32; బౌలింగ్‌: రైనా 2–0–24–0, ప్రవీణ్‌ 2–0–16–1, తేజస్‌ 3.3–0–33–0, కులకర్ణి 2–0–17–0, కౌషిక్‌ 4–0–29–0, బాసిల్‌ థంపి 2–0–21–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement