PKL 11: ప్లే ఆఫ్స్‌లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్‌ పరిస్థితి? | PKL 11 Delhi Dabang Beat Bengal Warriors Enters Play Offs | Sakshi
Sakshi News home page

PKL 11: ప్లే ఆఫ్స్‌లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్‌ పరిస్థితి?

Dec 17 2024 10:32 AM | Updated on Dec 17 2024 10:55 AM

PKL 11 Delhi Dabang Beat Bengal Warriors Enters Play Offs

అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న దబంగ్‌ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్‌ ప్లే ఆఫ్స్‌ దశకు చేరింది. ఈ సీజన్‌లో టాప్‌-6కు అర్హత సాధించిన రెండో జట్టుగా జట్టు నిలిచింది. పుణె వేదికగా బెంగాల్‌ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 47–25 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది.

ఇక ప్రొ కబడ్డి లీగ్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌నకు అర్హత పొందింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 4 మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 71 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 12 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్‌ దశ ముగిశాక టాప్‌–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌ చేరుకుంటాయి.

మరో నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు
హరియాణా, ఢిల్లీ ఇప్పటికే తమ అర్హత సాధించగా.. మరో నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. బెంగాల్‌తో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్‌ ఏకంగా 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి.. తొమ్మిదిసార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఆరుసార్లు పాయింట్‌ నెగ్గకుండానే తిరిగి వచ్చాడు. మరో మూడుసార్లు విఫలమయ్యాడు.

ఈ క్రమంలో.. నాలుగు బోనస్‌ పాయింట్లతోపాటు 12 టచ్‌ పాయింట్లు సాధించిన అశు ఒక ట్యాకిల్‌ పాయింట్‌ కూడా నెగ్గాడు. ఢిల్లీకే చెందిన యోగేశ్‌ 9 పాయింట్లు, ఆశిష్‌ 5 పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్‌ తరఫున విశ్వాస్‌ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. నితేశ్‌ కుమార్‌ ఐదు పాయింట్లు, కెప్టెన్‌ ఫజల్‌ అత్రాచలి నాలుగు పాయింట్లు స్కోరు చేశారు.

రేసులో పుణేరి పల్టన్‌
ఇక మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 37–32 పాయింట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణేరి పల్టన్‌ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో పట్నా పైరేట్స్‌ 68 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది. 

తెలుగు టైటాన్స్‌ ఏస్థానంలో ఉందంటే?
ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇరవై మ్యాచ్‌లలో పదకొండు గెలిచిన తెలుగు టైటాన్స్‌ 60 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.

చదవండి: తమిళ్‌ తలైవాస్‌ అవుట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement