పీకేఎల్ ప్లే ఆఫ్స్ రేసుకు దూరం
జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చింది. ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న తలైవాస్... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 27–34 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. తమిళ్ తలైవాస్ తరఫున హిమాన్షు, నితీశ్ కుమార్ చెరో 7 పాయింట్లతో రాణించగా... పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్, నీరజ్ నర్వాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 13 రెయిడ్ పాయింట్లు సాధించగా... తలైవాస్ 7 రెయిడ్ పాయింట్లకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. తాజా సీజన్‌లో 19 మ్యాచ్‌లాడిన తలైవాస్ 6 విజయాలు, 12 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. పీకేఎల్ ముగింపు దశకు చేరుకుంటుండగా... మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచినా... తలైవాస్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేదు. జైపూర్ పింక్ పాంథర్స్ 19 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 59 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 30–27 పాయింట్ల తేడాతో యూ ముంబాపై విజయం సాధించింది. ఈ సీజన్‌లో 19 మ్యాచ్‌లాడిన యూపీ యోధాస్ 10 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment