రాహుల్ 'సూపర్'
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం పుణెరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ 10 పాయింట్లు సాధించి మరోసారి సత్తాచాటాడు. దీంతో ఓవరాల్ ప్రొ కబడ్డీ లీగ్లో 400 రైడింగ్ పాయింట్లను సాధించిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు సూపర్ -10ను 20వ సారి నమోదు చేసిన ఆటగాడిగా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ మ్యాచ్లో 9 రైడింగ్ పాయింట్లను నమోదు చేసిన రాహుల్.. డిఫెన్స్లో ఒక పాయింట్ సాధించాడు. ఓవరాల్గా పీకేల్ సీజన్లో 434 (రైడింగ్, టాకిలింగ్) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
పుణెతో మ్యాచ్లో రాహుల్ కళ్లు చెదిరే కదిలికలతో చెలరేగిపోయాడు. ఒక దశలో టైటాన్స్ వెనుకబడిన దశలో రాహుల్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.వరుసగా పాయింట్లను సాధిస్తూ టైటాన్స్ కు ఘన విజయం అందించాడు.దీంతో ఈ సీజన్లో టైటాన్స్ వరుసగా నాల్గో విజయం సాధించగా, ఓవరాల్గా ఐదో విజయం నమోదు చేసింది. లీగ్ ఆరంభంలో తడబడిన టైటాన్స్.. ఆ తరువాత అంచనాలను అందుకుంటూ దూసుకెళుతుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ టైటాన్స్ సాధించిన విజయాల్లో రాహుల్ తో పాటు, సందీప్ నర్వాల్, సందీప్ ధూల్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకంగా రాహుల్ రైడింగ్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తుంటే, సందీప్ నర్వాల్, సందీఫ్ ధూల్లు టాకిలింగ్లో ముఖ్యభూమిక నిర్వహిస్తున్నారు.