పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో తెలుగు టైటాన్స్ 12వ విజయాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్ 48–36తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టును కెప్టెన్, రెయిడర్ పవన్ సెహ్రావత్ ముందుండి నడిపించాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన కెపె్టన్ 11 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. 4 బోనస్ పాయింట్లు కలుపుకొని మొత్తం 15 పాయింట్లు సాధించాడు. స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (11) కూడా క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చాడు.
డిఫెండర్లలో అంకిత్ (6), అజిత్ పవార్ (3) రాణించారు. పుణేరి జట్టులో రెయిడర్ అజిత్ (10 పాయింట్లు) అదరగొట్టాడు. సబ్‌స్టిట్యూట్‌గా ఆలస్యంగా మైదానంలోకి దిగిన అజిత్ 13 సార్లు కూతకెళ్లి 10 పాయింట్లు చేశాడు. మిగతా సహచరుల్లో రెయిడర్ ఆర్యవర్ధన్ నవలె (8), డిఫెండర్లు అమన్ (5), దాదాసో పూజారి (3) రాణించారు.
అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 31–28తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందడంతో ప్లే ఆఫ్స్‌కు ఐదో జట్టుగా అర్హత సాధించింది. జైపూర్ జట్టులో కెప్టెన్, రెయిడర్లు అర్జున్ దేశ్వాల్ (9), అభిజిత్ మాలిక్ (7) నిలకడగా స్కోరు చేశారు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మీర్‌బఘేరి (5), అంకుశ్ రాఠి (3) మెరుగ్గా ఆడారు.
బెంగాల్ వారియర్స్ తరఫున రెయిడర్లు ప్రణయ్ (8), అర్జున్ రాఠి (7) ఆకట్టుకున్నారు. డిఫెండర్లలో వైభవ్ గార్జే 4 పాయింట్లు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్... గుజరాత్ జెయంట్స్‌తో పోటీ పడనుండగా, దబంగ్ ఢిల్లీ... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment