
రాహుల్ చౌదరీ (ఫైల్ ఫొటో)
సనత్‌నగర్: వరుసగా ఏడుసార్లు విజేత... ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు ఘనత. ఇదే ఆనవాయితీని కొనసాగించేందుకు అజయ్ ఠాకూర్ సేన సిద్ధమైంది. ఆగస్టులో ఇండోనేసియా వేదికగా జరుగనున్న ఈ క్రీడల్లో ఎనిమిదో స్వర్ణాన్ని సాధించడమే తమ లక్ష్యమంటున్నాడు భారత స్టార్ రైడర్ రాహుల్ చౌదరి. మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఫర్ గోల్డ్’ పేరిట జరుగుతోన్న ప్రచార కార్యక్రమంలో రాహుల్ చౌదరి పాల్గొన్నాడు.
బేగంపేట్‌లోని గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో పాఠశాల విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. చిన్నారులతో కబడ్డీ ఆడుతూ వారిని ప్రోత్సహించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయకరణ్, ప్రిన్సిపల్ మాయ సుకుమారన్, ఫిజికల్ ట్రైనర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులతో రాహుల్ చౌదరీ
విద్యార్థుల ప్రశ్న: 1990లో తొలి స్వర్ణం సాధించి నప్పటికీ, ఇప్పటికీ జట్టులో తేడా ఏమైనా ఉందా?
రాహుల్: మొదటిసారి పోటీలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఉంటారో? వారి బలాలు, బలహీనతలు ఏంటి? అనే అంశాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాం. కానీ అప్పుడు ఇప్పుడూ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
రోజూ ప్రాక్టీస్‌కు ఎంత సమయం కేటాయిస్తారు?
ఉదయం 45 నిమిషాల వ్యాయామం, వాకింగ్‌తో సరిపెడితే కుదరదు. కోచ్ పర్యవేక్షణలో 6 గంటలు, స్వతహాగా టీమ్ సభ్యులందరం కలిసి మరో 6 గంటలు... మొత్తం 12 గంటలు ప్రాక్టీస్‌కే అంకితమవుతాం.
ఫిట్‌నెస్ కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు?
పిజ్జాలు, బర్గర్‌లకు చాలా దూరంగా ఉంటాం. సహజమైన పోషకాలు లభించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాం. డ్రైప్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకుంటాం.
వరుసగా ఎనిమిదోసారి బంగారు పతకం సాధిస్తామని గట్టిగా ఎలా చెబుతున్నారు?
ఏడేళ్లుగా వివిధ దేశాల జట్ల ఆటతీరును నిశితంగా పరిశీలించాం. వారి బలాలు, బలహీనతలు స్పష్టంగా అవగతమయ్యాయి. వీటితో పాటు యావత్ భారత జాతి కూడా మాకు మద్దతుగా ఉంది. కచ్చితంగా స్వర్ణం సాధిస్తామనే విశ్వాసం బలంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment