ముంబై: ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు వేదికగా మారిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ నమోదైంది. విజయం కోసం చివరి వరకు పోరాడిన తమిళ్ తలైవాస్ కేవలం ఒక పాయింట్ తేడాతో పట్నా పైరేట్స్ ముందు తలవంచింది. సోమవారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 24–23 తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వరుసగా తానాడిన రెండు మ్యాచ్‌లలో విజయం అంచుల వరకు వచ్చి ఓడిపోవడంతో తలైవాస్ డీలా పడింది. పైరేట్స్ డిఫెండర్ జైదీప్ 5 టాకిల్ పాయింట్లతో పాటు కీలక సమయంలో రైడ్‌కు వెళ్లి రెండు బోనస్ పాయింట్లు తెచ్చి హీరోగా నిలిచాడు. మోను 5 పాయింట్లతో అతనికి తన వంతు సాయం చేశాడు. రాహుల్ చౌదరి (5 పాయింట్లు), మంజీత్ చిల్లర్ (4 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయారు.
తడబడి నిలబడి...
పట్నా పైరేట్స్ ఆటను అంత గొప్పగా ఆరంభించలేదు. మరోవైపు తలైవాస్ మొదటి మూడు నిమిషాల్లోనే నాలుగు పాయింట్లు సాధించి 4–0తో అధిక్యంలోకెళ్లింది. అయితే తరువాతి నిమిషంలో రాహుల్‌ని సూపర్ టాకిల్ చేసిన పట్నా రెండు పాయింట్లు సాధించి ఖాతా తెరిచింది. ఆ వెంటనే రైడ్‌కు వెళ్లిన ఇస్మాయిల్ రాన్ సింగ్‌ను ఔట్ చేయడంతో పాటు బోనస్ పాయింట్‌ను సాధించి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్లు సమానంగా పాయింట్లను సంపాదించడంతో విరామ సమయానికి 11–11తో సమంగా నిలిచాయి.
చివరి మూడు నిమిషాల్లో...
ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా తలైవాస్ 18–22తో వెనుకబడింది. ఈ దశలో రాహుల్, రాన్ సింగ్‌లు తమ రైడ్లతో మూడు పాయింట్లు తెచ్చారు. అదే సమయంలో పైరేట్స్ రెండు పాయింట్లను సాధించడంతో స్కోరు 21–24కు వెళ్లింది. చివరి రైడ్‌కు వెళ్లిన ప్రదీప్‌ను సూపర్ టాకిల్ చేసిన తలైవాస్‌కు రెండు పాయింట్లు వచ్చినా అది విజయాన్ని అందించలేకపోయింది.
బెంగాల్ ఘనవిజయం
రెండో మ్యాచ్‌లో బెంగాల్‌వారియర్స్ 43–23తో పుణేరి పల్టన్‌ను బోల్తా కొట్టించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ ముందు పుణేరి ఏమాత్రం నిలబడలేకపోయింది. బెంగాల్ తరపున మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’ (మొత్తం 14 పాయింట్లు)తో అదరగొట్టాడు. అతనికి ఇస్మాయిల్ నబీబ„Š (8 పాయింట్లు) సహకారం తోడవడంతో బెంగాల్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పుణేరి ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మంగళవారం విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో యూపీ యోధ తలపడతాయి.
ప్రొ కబడ్డీలో 900 పాయింట్లను సాధించిన తొలి రైడర్‌గా రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. మంజీత్ చిల్లర్ 300 టాకిల్ పాయింట్ల మార్క్‌ను అందుకున్నాడు. అజయ్ ఠాకూర్ రైడింగ్‌లో 600 పాయింట్లను సాధించాడు.
గట్టెక్కిన పట్నా పైరేట్స్
Published Tue, Jul 30 2019 4:33 AM | Last Updated on Tue, Jul 30 2019 4:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment