ముంబై: తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. సాధారణంగా మ్యాచ్ ముగిశాక రిఫరీ వేసే లాంగ్ విజిల్ కంటే ముందుగా కబడ్డీ కోర్టు వెలుపల ఉన్న సహచర ఆటగాళ్లు గెలిచామనే ఆనందంతో కోర్టులోకి దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రిఫరీలు యూపీ యోధకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ కేటాయించడంతో... టైటాన్స్‌కు ఈ సీజన్‌లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. ముంబై వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, యూపీ యోధ జట్లు నిర్ణీత సమయానికి 20–20తో సమంగా నిలిచాయి. దీంతో ప్రొ కబడ్డీ సీజన్ – 7లో తొలి ‘టై’ నమోదైంది. టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లతో) ఫర్వాలేదనిపించాడు.
చేజేతులా...
ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో బరిలో దిగిన టైటాన్స్ మొదట ఆధిక్యాన్ని ఆ తర్వాత గెలుపుని చేజేతులా జారవిడుచుకుంది. మొదట 7–3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలసత్వం ప్రదర్శించడంతో యూపీ వరుస పాయింట్లను సాధించి స్కోర్‌ను సమం చేసింది. మళ్లీ చివరి నిమిషంలో అదే అలసత్వం ప్రదర్శించి గెలుపును వదులుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో కూతకెళ్లిన టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్ సాధించి జట్టును 20–19తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో గెలిచామనే ఆనందంలో టైటాన్స్ జట్టు సభ్యులు రిఫరీ లాంగ్ విజిల్ వేశాడా..? లేదా... అనేది చూసుకోకుండా కోర్టులోకి దూసుకురావడంతో రిఫరీలు యూపీ జట్టుకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్‌ను కేటాయించారు. దీనిపై టైటాన్స్ సమీక్షకు వెళ్లగా... టీవీ అంపైర్ రిఫరీల నిర్ణయానికే కట్టుబడటంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త టైగా ముగిసింది.
ఆఖరి పంచ్ ముంబైదే..
ముంబై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆఖరి పంచ్ ముంబై కొట్టింది. గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై 20–32తో ముంబై గెలిచి వరుస పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టింది. ముంబై ఆటగాళ్లు సురీందర్ సింగ్ 9 పాయింట్లతో, అభిషేక్ సింగ్ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి.
టైటాన్స్ నాన్ టెక్నికల్ టై
Published Sat, Aug 3 2019 4:54 AM | Last Updated on Sat, Aug 3 2019 4:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment