
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్ లీగ్-7 తమ తొలి మ్యాచ్‌లోనే బెంగాల్ వారియర్స్ జూలు విదిల్చింది. బెంగాల్ దెబ్బకు యూపీ యోదా చిత్తుచిత్తుగా ఓడింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్షపోరులో యూపీ యోధాపై బెంగాల్ వారియర్స్ 48-17 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో బెంగాల్‌ను ప్రతిఘటించిన యూపీ యోధా.. మ్యాచ్ జరిగే కొద్ది పట్టు విడిచింది. తొలుత పాయింట్ల ఖాతా తెరిచిన యూపీ 4-0తో మంచి లీడింగ్‌లో ఉంది. అనంతరం తొలిహాఫ్ ముగిసే సరికి యూపీ 8-11తో స్పల్ప వెనుకంజలో నిలిచింది.
రెండో అర్ధభాగం ప్రారంభమయ్యాక బెంగాల్ వారియర్స్ అసలు ఆట ప్రారంభమైంది. బెంగాల్ ఆటగాళ్ల దూకుడుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అటాకింగ్ గేమ్‌తో విరుచుకపడటంతో యూపీ ఆటగాళ్లకు ఏం చేయాలో పాలు పోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్(6) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బెంగాల్ ఆటగాళ్లలో మహ్మద్ నబిబక్ష్ 10 పాయింట్లతో రెచ్చిపోయాడు. అతడికి తోడుగా మనిందర్ సింగ్(8), బల్దేవ్ సింగ్(7), ప్రపంజన్(5) ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా బెంగాల్ 24 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ యోధా 10 రైడ్ పాయింట్లతో, 5 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థి జట్టును అందుకోలేకపోయింది. ఇక బెంగాల్ ధాటిక యూపీ జట్టు నాలుగు సార్లు ఆలౌటవ్వడం గమనార్హం.