ముంబై : బెంగాల్ వారియర్స్ దూకుడుకు పుణెరి పల్టన్ కుదేలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ ఆడిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇక బెంగాల్ ఆటగాళ్ల దూకుడైన ఆటకు పుణెరి ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 43-23 తేడాతో పుణెరి పల్టాన్‌పై ఘన విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ రైడర్ మణిందర్ సింగ్(14) హోరెత్తించగా.. మహ్మద్ నబిబక్ష్(8), రింకూ నర్వాల్(5) రాణించారు. ఆ జట్టు స్టార్ రైడర్ ప్రపంజన్ పూర్తిగా విఫలమయ్యాడు.
ఇక పుణెరి ఆటగాళ్లలో ఏ ఒక్కరూ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సారథి సుర్జీత్ సింత్ చేతులెత్తేయగా.. పంకజ్ మోహితె(6) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఇక డిఫెండర్ గిరీష్ ఎర్నాక్(3) ప్రత్యర్థి రైడర్లను కట్టడి చేయలేకపోయాడు. ఓవరాల్‌గా బెంగాల్ వారియర్స్ 22రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 13 రైడ్, 9 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. దీంతో పుణెరి ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి పడింది.
Comments
Please login to add a commentAdd a comment