బెంగాల్ వారియర్స్‌పై 17 పాయింట్లతో పుణేరి ఘనవిజయం
నోయిడా: డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు బెంగాల్ వారియర్స్ చేతులెత్తేసింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టన్ అర్ధసెంచరీని మించిన పాయింట్లను అవలీలగా చేసింది. కూతకెళ్లిన రెయిడర్లు, డిఫెండర్లు క్రమం తప్పకుండా పాయింట్లను సాధించారు. దీంతో పల్టన్ 51–34 స్కోరుతో 17 పాయింట్ల తేడాతో వారియర్స్‌పై జయభేరి మోగించింది. ఆట మొదలైన 7 నిమిషాలకే బెంగాల్ ఆలౌటైంది.
మళ్లీ తొలి అర్ధభాగం ముగిసే దశలో ఆలౌట్ కావడంతో 24–11తో పుణేరి పూర్తి ఆధిపత్యంతో బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం రెండో అర్ధభాగంలోనూ వారియర్స్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఐదు నిమిషాలకే మ్యాచ్‌లో మూడోసారి ఆలౌటైంది. 11 నిమిషాల వ్యవధిలో నాలుగోసారి ఆలౌటైంది. పుణేరి జట్టు మ్యాచ్‌లో ఒకే ఒక్కసారి అది కూడా మ్యాచ్ ముగిసే ఆఖరి నిమిషంలో ఆలౌట్ కాగా... అప్పటికే పాయింట్ల ఫిఫ్టీ కొట్టింది.
పల్టన్ రెయిడర్లు ఆకాశ్ షిండే (9 పాయింట్లు), మోహిత్ గోయత్ (9), పంకజ్ మోహితె (6), డిఫెండర్లు మోహిత్ (5), గౌరవ్ ఖత్రి (3) రాణించారు. బెంగాల్ తరఫున రెయిడర్ నితిన్ కుమార్ (13) అదరగొట్టాడు. మిగతా వారిలో కెప్టెన్, డిఫెండర్ ఫజల్ అత్రాచలి (3), ప్రణయ్ రాణే (5) మెరుగ్గా ఆడారు. తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44–42తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది.
యూపీ ఆటగాళ్లలో గగన్ గౌడ (11), భవాని రాజ్‌పుత్ (10), హితేశ్ (8)లు రాణించారు. పట్నా జట్టులో రెయిడర్ దేవాంక్ (18) ఆకట్టుకున్నాడు. అయాన్ (10) రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ తలపడనుండగా, యు ముంబాతో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment