హైదరాబాద్ : ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమిని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో యు ముంబా, తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైన టైటాన్స్ జట్టు దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ నిరాశపర్చింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 18 పాయింట్లతో రెచ్చిపోయినప్పటికీ ఢిల్లీ చేతిలో ఓటమిని తప్పించలేకపోయాడు. సూరజ్ దేశాయ్ తొలి రైడ్‌లోనే రెండు పాయింట్లతో టైటాన్స్‌కు మంచి శుభారంభాన్ని అందించాడు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరుజట్లు తొలి అర్ధభాగం ముగిసేసరికి 14-13తేడాతో టైటాన్స్ స్వల్ప ముందంజలో నిలిచింది.
అయితే రెండో అర్థభాగంలో కూడా ఇరుజట్లు చాలా జాగ్రత్తగా ఆడాయి. దీంతో చివరి కూత వరకు ఇరుజట్ల మధ్య విజయం నీదా నాదా అన్నట్లు సాగింది. అయితే ఢిల్లీ రెండు ఎక్సట్రా పాయింట్లు సాధించడం, టైటాన్స్ జట్టు ఓ సారి ఆలౌట్ అవ్వడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే చివరి రైడ్‌లో టైటాన్స్ విజయానికి మూడు పాయింట్లు అవసరం కాగా సిద్దార్థ్ దేశాయ్ ఒక్కటే సాధించాడు. దీంతో టైటాన్స్ ఓడిపోయింది. దబాంగ్ ఢిల్లీ 23 రైడ్ పాయింట్లు, 7 టాకిల్ పాయింట్లు సాధించగా.. తెలుగు టైటాన్స్ 27 రైడ్ పాయింట్లు, 6 టాకిల్ పాయింట్లు సాధించింది. టైటాన్స్ ఆటగాళ్లలో సూరజ్ దేశాయ్‌తో పాటు సిద్దార్థ్ దేశాయ్(8), విశాల్ భరద్వాజ్(4) ఫర్వాలేదనిపించారు. ఇక ఢిల్లీ ఆటగాళ్లలో నవీన్ కుమార్(14), చంద్రన్ రంజిత్(6), జోగిందర్ నర్వాల్(4) ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment