టైటాన్స్‌ది అదే కథ.. అదే వ్యథ | Pro Kabaddi 2019 Patna Pirates Beat Telugu Titans | Sakshi
Sakshi News home page

తీరుమారని టైటాన్స్‌

Published Fri, Jul 26 2019 10:03 PM | Last Updated on Fri, Jul 26 2019 10:06 PM

Pro Kabaddi 2019 Patna Pirates Beat Telugu Titans - Sakshi

హైదరాబాద్‌: ప్రో కబడ్డీ సీజన్‌-7లో తెలుగు టైటాన్స్‌ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. హ్యాట్రిక్‌ ఓటమి అనంతరం కూడా టైటాన్స్‌ ఆటగాళ్ల తీరు మారలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కనీస పోరాట పటిమను ప్రదర్శించిన టైటాన్స్‌ ఆటగాళ్లు పట్నా పైరేట్స్‌ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. పట్నా డిఫెండింగ్‌ ధాటికి టైటాన్స్‌ రైడర్లు పూర్తిగా తేలిపోయారు. టైటాన్స్‌ స్టార్‌ రైడర్‌ సిద్దార్థ్‌ దేశాయ్‌ ఓ మోస్తారుగా రాణించగా.. గత మ్యాచ్‌ హీరో సూరజ్‌ దేశాయ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 34-22 తేడాతో టైటాన్స్‌ను చిత్తు చేసింది. పట్నా స్టార్‌ రైడర్‌, సారథి పర్‌దీప్‌ నర్వాల్‌ 7 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. డిఫెండర్‌ జైదీప్‌ 6 పాయింట్లతో టైటాన్స్‌ పనిపట్టాడు. 

పట్నా ధాటికి టైటాన్స్‌ తొలి రెండు నిమిషాలు ఖాతానే తెరవలేదు. దీంతో 0-4తో వెనుకంజలో ఉంది. అయితే ఈ సమయంలో విశాల్‌ భరద్వాజ్‌ సూపర్‌ టాకిల్‌తో టైటాన్స్‌కు రెండు పాయింట్లు అందించి ఖాతా తెరిచాడు. ఈ ఆనందం కూడా టైటాన్స్‌ అభిమానుల్లో ఎంతసేపు నిలువలేదు. పట్నా ఆటగాళ్లు అటాకింగ్‌ ఆడటంతో టైటాన్స్‌ ఆటగాళ్లు విలవిల్లాడారు. దీంతో తొలి ఆర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్‌ జట్టు 9-23 తేడాతో భారీ వెనుకంజలో ఉంది. ఇక రెండో అర్థభాగంలో సిద్దార్థ్‌ దేశాయ్‌ ఒంటరి పోరాటంతో స్కోర్‌ అంతరాన్ని తగ్గించాడు కానీ ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. పట్నా జట్టు 12 రైడ్, 16 టాకిల్‌ పాయింట్లతో దడదడలాడించగా.. టైటాన్స్‌ జట్టు 10 రైడ్‌, 8 టాకిల్‌ పాయింట్లు మాత్రమే సాధించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement