సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన ఆతిథ్య తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశ పరిచింది. తమిళ్ తలైవాస్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తలైవాస్ తరఫున నరేందర్ ఖండోలా, సచిన్ సూపర్ టెన్స్ విజృంభించడంతో టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు.
హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 44–29 తేడాతో తెలుగు టైటాన్స్ ను చిత్తు చేసింది. ఆరంభంలో విజృంభించిన టైటాన్స్ ప్లేయర్ పవన్ సెహ్రావత్ (10) వరుసగా రెండో సూపర్ టెన్ సాధించినా.. ఆ తర్వాత తడబడ్డాడు. అనంతరం విజయ్ మాలిక్ (9) పోరాడినా ఫలితం లేకపోయింది. తమిళ్ తలైవాస్ జట్టులో నరేందర్, సచిన్ చెరో పది పాయింట్లు తీసుకురాగా.. డిఫెండర్ సాహిల్ గులియా ఐదు పాయింట్లతో హై ఫైవ్ సాధించాడు.
టైటాన్స్- తలైవాస్ పోరుసాగిందిలా
తలైవాస్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఆరంభంలో వరుస రైడ్ పాయింట్లతో చెలరేగాడు. మొదటి కూతలోనే సూపర్ రైడ్ చేయడంతో 3–0తో ఆటను ఆరంభించిన తెలుగు టైటాన్స్.. పవన్ డబుల్ రైడ్ పాయింట్‌తో 5–1తో ఆధిక్యం సాధించింది. కానీ,అభిషేక్ చేసిన ట్యాకిల్‌తో పవన్‌ను నిలువరించిన తలైవాస్ ఒక్కసారిగా జోరు పెంచింది. నరేందర్ ఖండోలా ముగ్గురు డిఫెండర్లను ఔట్ చేస్తూ సూపర్ రైడ్ చేయడంతో 7–6తో ఆధిక్యంలోకి వచ్చింది.
ఆపై కోర్టులో మిగిలిన క్రిషన్, విజయ్ మాలిన్ ను సచిన్ అవుట్ చేశాడు. ఫలితంగా ఆరో నిమిషంలోనే తెలుగు టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సాహిల్, అభిషేక్ తృత్వంలోని డిఫెండర్లు కూడా సత్తా చాటడంతో సెహ్రావత్ ను మరోసారి కోర్టు బయటికి పంపించిన తమిళ జట్టు తన ఆధిక్యాన్ని 14–9కి పెంచుకుంది.
ఈ దశలో టైటాన్స్ రైడర్ విజయ్ మాలిక్ పోరాటంతో ఆతిథ్య జట్టు వెంటవెంటనే పాయింట్లు రాబట్టి 14–15తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, తలైవాస్ రైడర్ నరేందర్‌తో పాటు సచిన్ కూడా జోరు కనబరిచాడు.సెహ్రావత్ ఎక్కువ సేపు కోర్టు బయట ఉంచిన ఆ జట్టు 20–17తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.
సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఓవైపు విజయ్ మాలిక్ రైడ్ పాయింట్లు రాబడుతున్నా.. కెప్టెన్ సెహ్రావత్ నిరాశ పరచడంతో మళ్లీ వెనకబడింది. ఇంకోవైపు సచిన్‌ను నిలువరించడంలో టైటాన్స్ డిఫెండర్లు పూర్తిగా విఫలమయ్యారు.
31వ నిమిషంలో మరోసారి ఆలౌట్ చేసిన తలైవాస్ 31–21తో ఆధిక్యం సాధించింది. పూర్తి జట్టు కోర్టులోకి వచ్చిన తర్వాత కూడా తెలుగు టైటాన్స్ తడబాటు మారలేదు. నరేందర్ తన సూపర్ టెన్ పూర్తి చేసుకుంటూ అంకిత్, అజిత్ పవార్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో మూడోసారి టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 40–24తో భారీ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి ఐదు నిమిమిషాల్లో తెలుగు జట్టు పోరాటం ఓటమి అంతరాన్ని కూడా పెద్దగా తగ్గించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment