దబంగ్ ఢిల్లీ చేతిలో ఓటమి
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 27–33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 10 పాయింట్లు, ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. దబంగ్ ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లతో రాణించగా... ఆశు మలిక్ 9 పాయింట్లతో అతడికి సహకరించాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... టైటాన్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించింది. అయితే టైటాన్స్ రెండుసార్లు ఆలౌటై... ప్రత్యర్థి కి 4 పాయింట్లు సమర్పించుకోగా... ఢిల్లీ జట్టు ఒకేసారి ఆలౌటైంది. తాజా సీజన్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 10 విజయాలు, 9 పరాజయాలతో 55 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆరో స్థానంలో నిలవగా... దబంగ్ ఢిల్లీ 18 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో 61 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది.
యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 11 పాయింట్లతో రాణించగా... బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 10 పాయింట్లతో సత్తాచాటాడు.
పాయింట్ల పట్టికలో యూపీ యోధాస్ (59 పాయింట్లు) నాలుగో స్థానానికి చేరగా... బెంగాల్ వారియర్స్ (40 పాయింట్లు) 9వ స్థానంలో ఉంది. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పట్నా పైరెట్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment