ముంబై : బెంగాల్ వారియర్స్ విజయం ముంగిట బోల్తాపడింది. యూపీ యోధపై భారీ విజయంతో ఊపు మీదున్న బెంగాల్‌కు జైపూర్ పింక్ పాంథర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రొ కబడ్డీ సీజన్ 7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్ 27-25 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో బెంగాల్ నాలుగు పాయింట్లతో లీడింగ్‌లో ఉంది. కనీసం ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నా బెంగాల్ విజయం సాధించేదే. కానీ జైపూర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన.. బెంగాల్ ఆటగాళ్ల తొందరపాటుతో గెలుపు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జైపూర్ విజయంలో సారథి దీపక్ హుడా, డిఫెండర్ సందీప్ దుల్‌లు కీలకపాత్ర పోషించారు.
మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టును తొలి నాలుగు నిమిషాలు పాయింట్ల ఖాతాను తెరవనివ్వలేదు. దీంతో 0-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంజన్(7), మణిందర్ సింగ్(6), బల్దేవ్ సింగ్(6)లు రాణించడంతో తొలి అర్ద భాగం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్దభాగంలోనూ బెంగాల్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. అయితే చివర్లో తడబడటంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. జైపూర్ ఆటగాళ్లు సందీప్ దుల్(8), దీపక్ హుడా(6), దీపక్ నర్వాల్(4) కీలక సమయంలో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఓవరాల్‌గా జైపూర్ 12 రైడ్, 10 టాకిల్ పాయింట్లు సాధించగా.. బెంగాల్ 13 రైడ్, 11 టాకిల్ పాయింట్లను సాధించింది. అయితే బెంగాల్‌ను ఓ సారి ఆలౌట్ చేయడం, మూడు ఎక్సట్రా పాయింట్లు సాధించడం జైపూర్‌కు కలిసొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment