
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో యు ముంబా జట్టు జయాపజయాలను సమం చేసింది. స్థానిక కంఠీరవ స్టేడియంలో శనివారం మ్యాచ్‌లో యు ముంబా 47–21తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తుగా ఓడించి ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబా 6 మ్యాచ్‌ల్లో గెలిచి మరో ఆరింటిలో ఓడినట్లయింది. అభిషేక్ సింగ్ 18 సార్లు రైడింగ్‌కు వెళ్లి 10 సార్లు సఫలమయ్యాడు.
మరో 7 పర్యాయాలు పాయింట్లేమీ తీసుకురాకుండా, ఒకసారి మాత్రం ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోయాడు. మరో రైడర్ అర్జున్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. హరేంద్ర ఐదుగురిని పట్టేసి ఐదు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లలో రైడింగ్‌లో నితిన్ రావల్ (5 పాయింట్లు), ట్యాకిల్‌లో అమిత్ హుడా (3 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32–23తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. విజేత జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. బెంగళూరు జట్టులో సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment