ముంబై: సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో యు ముంబా అదరగొట్టింది. సుర్జీత్ సింగ్ సారథ్యంలోని పుణెరీ పల్టన్‌ను యు ముంబా బోల్తా కొట్టించి విజయం సాధించింది. శనివారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 33-23 తేడాతో పుణెరీ పల్టన్‌పై విజయాన్ని అందుకుంది. దీంతో పుణెరి ఖాతాలో రెండో ఓటమి పడింది. తొలి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరంభంలో ధాటిగా ఆడిన పుణెరి ఆటగాళ్లు.. మ్యాచ్ జరిగే కొద్దీ ఢీలా పడ్డారు. ప్రత్యర్థి జట్టుకు దాసోహమయ్యారు. రైడింగ్‌లో, టాకిల్‌లో పూర్తిగా విఫలమయ్యారు. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్ల వేగం తగ్గింది. అయితే రెండో అర్ద భాగంలో యు ముంబా ఆటగాళ్లు విరుచుకపడ్డారు.
ఇక ఈ మ్యాచ్‌లో యు ముంబా ఆటగాళ్లు ఒకరిపై ఆధారపడకుండా సమిష్టిగా ఆడారు. రైడర్లు అభిషేక్ సింగ్(5), రోహిత్ బలియాన్(4) రాణించగా.. డిఫెండర్లు సురిందర్ సింగ్(4), సందీప్ నర్వాల్(4), ఫజల్ అత్రచలి(4) పుణెరి పని పట్టారు. ఇక పుణెరీ ఆటగాళ్లలో సారథి సుర్జీత్ సింగ్(4) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు స్టార్ డిఫెండర్ గిరీష్ ఎర్నాక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క టాకిల్ కూడా చేయలేకపోయాడు. ముంబా జట్టు 15 రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 12 రైడ్, 11 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. యు ముంబా ధాటికి పుణెరి పల్టాన్ జట్టు రెండు సార్లు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment