
పట్నా: తమిళ్ తలైవాస్ ఖాతా ఆలస్యంగానే తెరిచింది. పుంజు కుంది ఆలస్యంగానే... చివరకు గెలిచింది మాత్రం దర్జాగా! రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రైడింగ్ ప్రదర్శనతో... ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–28తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి హరియాణా స్టీలర్స్ ధాటికి 19–10 స్కోరుతో తలైవాస్ వెనుకబడింది. కానీ ద్వితీయార్ధంలో అటు రైడింగ్, ఇటు టాకిల్స్‌తో తమిళ్ జట్టు వేగం పెంచి గెలిచింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 20–41తో పుణేరి పల్టన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆట మొదలై పది నిమిషాలైనా... ప్రత్యర్థి పుణేరి 14 పాయింట్లు చేసినా... పట్నా మాత్రం ఖాతా తెరువలేకపోయింది. రెండుసార్లు ఆలౌటై భారీ తేడాతో మూల్యం చెల్లించుకుంది. పుణేరి తరఫున అమిత్ 9, పంకజ్ 8, మన్‌జీత్ 6 పాయింట్లు చేసి జట్టును గెలిపించారు.