తమిళ్ తలైవాస్‌పై ఘనవిజయం
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు జోరు కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్న హరియాణా స్టీలర్స్ లీగ్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హరియాణా స్టీలర్స్ 36–29 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది.
స్టీలర్స్ తరఫున స్టార్ రైడర్ వినయ్ 10 పాయింట్లతో సత్తా చాటగా... డిఫెన్స్‌లో మొహమ్మద్ రెజా (8 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. తమిళ్ తలైవాస్ తరఫున మొయిన్ 7 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హరియాణా జట్టు 21 రెయిడ్ పాయింట్లు సాధించి ఆధిపత్యం చెలాయించగా... 12 రెయిడ్ పాయింట్లకే పరిమితమై తమిళ్ తలైవాస్ పరాజయం పాలైంది.
ఆడిన పది మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు సాధించిన హరియాణా స్టీలర్స్ 41 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు 11 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 6 పరాజయాలు ఒక ‘టై’తో 28 పాయింట్లు సాధించిన తమిళ్ తలైవాస్ జట్టు పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
పుణేరి పల్టన్‌పై జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపు
మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 30–28 పరుగుల తేడాతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్ జట్టు తరఫున అర్జున్ దేశ్వాల్ 8 పాయింట్లు, అంకుశ్ 6 పాయింట్లతో రాణించారు. పుణేరి పల్టన్ తరఫున ఆకాశ్ షిండే 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో జైపూర్ జట్టు కీలక సమయంలో ఆధిక్యం చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... ట్యాకెలింగ్‌లో జైపూర్ 14 పాయింట్లు, పుణేరి పల్టన్ 10 పాయింట్లు సాధించాయి.
తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు 9 మ్యాచ్‌లాడిన పుణేరి పల్టన్ 5 విజయాలు, 2 ఓటములు, 2 ‘టై’లతో 33 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా సోమవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment