తమిళ్ తలైవాస్‌పై ఘనవిజయం
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న హరియాణా స్టీలర్స్... లీగ్‌లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో హరియాణా స్టీలర్స్ 42–30తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన స్టీలర్స్ ఓవరాల్‌గా 23 రెయిడ్ పాయింట్లు, 13 ట్యాకిల్ పాయింట్లు సాధించింది. ప్రత్యరి్థని రెండుసార్లు ఆలౌట్ చేయడం ద్వారా మరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
స్టీలర్స్ తరఫున వినయ్ (9 పాయింట్లు), నవీన్ (6 పాయింట్లు), రాహుల్ (6 పాయింట్లు) రాణించారు. తలైవాస్ తరఫున మోయిన్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడిన స్టీలర్స్ 12 విజయాలు, 3 పరాజయాలతో 61 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 14 మ్యాచ్‌లాడిన తలైవాస్ 5 విజయాలు, 8 పరాజయాలు, ఒక ‘టై’తో 33 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 34–33తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది.
పల్టన్ తరఫున ఆకాశ్ షిండే 12 పాయింట్లతో అదరగొట్టగా... గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ 16 పాయింట్లతో పోరాడినా లాభం లేకపోయింది. తాజా సీజన్‌లో 15 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లతో 47 పాయింట్లతో పల్టన్ మూడో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరెట్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment