
ముంబై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్ జెయింట్స్‌నే వరించింది. దీంతో లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లు, ఒక బోనస్ పాయింటు)తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ‘టెన్’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment