Gujarat Fortune Giants
-
యూపీ, గుజరాత్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. బుధవారం యూపీ యోధ, గుజరాత్ జెయింట్స్ హోరాహోరీగా తలపడగా, 32–32 స్కోరుతో మ్యాచ్ సమమైంది. యూపీ తరఫున పర్దీప్ నర్వాల్ 11 పాయింట్లతో సత్తా చాటగా...గుజరాత్ ఆటగాళ్లలో రాకేశ్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 52–35 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. నవీన్ కుమార్ అద్భుత ప్రదర్శన ఢిల్లీని గెలిపించింది. అతనొక్కడే 24 పాయింట్లతో దూసుకుపోవడం విశేషం. బెంగాల్ ఆటగాళ్లలో కెప్టెన్ మణీందర్ సింగ్ 16 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో యు ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి. చదవండి: ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్‌గా కుల్ధీప్ యాదవ్.. -
తలైవాస్ చిత్తు
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తమిళ్ తలైవాస్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔటైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో 50–21తో చిత్తుగా ఓడింది. గుజరాత్ రైడర్ సోను 15 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో హై–ఫై (5) సాధించిన పర్వేశ్ చక్కని సహకారం అందించాడు. మ్యాచ్‌లో గుజరాత్ ప్రత్యర్థిని మూడు సార్లు ఆలౌట్ చేసింది. తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (5) నిరాశ పరిచాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 30–37తో యూపీ యోధ చేతిలో ఓడింది. యూపీ తరఫున శ్రీకాంత్ జాధవ్ సూపర్ ‘టెన్’ (11 పాయింట్లు) చెలరేగాడు. నితేశ్ కుమార్, సురేందర్ గిల్ చెరో ఏడు పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
యు ముంబా తొమ్మిదో విజయం
జైపూర్: అభిషేక్ సింగ్ 11 పాయింట్లతో రాణించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు తొమ్మిదో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–25తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో ఇరు జట్లు చెరో 15 పాయింట్లతో చెలరేగినా... ట్యాక్లింగ్‌లో అదరగొట్టిన యు ముంబా గెలుపును ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 41–40తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
ఢిల్లీని గెలిపించిన నవీన్
పుణే: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి సూపర్ ‘టెన్’ సాధించి అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 34–30తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. నవీన్ (12 పాయింట్లు)కు ట్యాక్లింగ్‌లో విశాల్ (3 పాయింట్లు), జోగిందర్ (3 పాయిం ట్లు) సహకరించడంతో దబంగ్ విజయం ఖాయ మైంది. 12 విజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ‘టాప్’ ప్లేస్‌లో కొనసాగుతోంది. పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 55–33తో ఘనవిజయం సాధించింది. పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ 18 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
జెర్సీ మారింది... బోణీ కొట్టింది
అహ్మదాబాద్: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో అందని ద్రాక్షలా ఉన్న గెలుపు ఎట్టకేలకు తెలుగు టైటాన్స్‌ను పలకరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–24తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, విశాల్ భరద్వాజ్‌లు చెరో ఏడు పాయింట్లతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన తెలుగు జట్టు గెలుపు బోణీ కొట్టింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పసుపు రంగు జెర్సీతో బరిలో దిగిన టైటాన్స్... గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం నల్ల రంగు జెర్సీతో ఆడింది. కొత్త జెర్సీ రంగు ఏం అదృష్టం తెచ్చిందో ఏమో కానీ.. ప్రత్యర్థి జట్టును ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసింది. మొదటి అర్ధ భాగంలో సిద్ధార్థ్ రైడింగ్‌లో చెలరేగితే... రెండో అర్ధ భాగంలో విశాల్ భరద్వాజ్ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 30–33తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. హరియాణా రైడర్ వికాస్ ఖండోలా 12 పాయింట్లతో రాణించాడు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీకి కళ్లెం
ముంబై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్ జెయింట్స్నే వరించింది. దీంతో లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లు, ఒక బోనస్ పాయింటు)తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ‘టెన్’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి. -
యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్ ఏడులో యూపీ యోధ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘోరంగా ఓటమిపాలైంది. ఆ జట్టు స్టార్ రైడర్ మోను గోయత్ దారుణంగా విఫలమవడం, సమిష్టి వైఫల్యంతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 19-44 తేడాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. గుజరాత్ ఆటగాళ్లు ఆరంభం నుంచి ఆటాకింగ్ ఆడారు. ముఖ్యంగా ఆ జట్టు రైడర్లు రోహిత్ గులియా(11), సచిన్(6) రెచ్చిపోయారు. దీంతో తొలి అర్దభాగంలోనే గుజరాత్ జట్టు 19-9తో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక గుజరాత్ ఢిఫెండర్లు పర్వేష్ బైన్సాల్(6), మోరె(5) కూడా ఓ చేయి వేయడంతో యూపీ జట్టు పనిపట్టారు. యూపీ రైడర్ శ్రీకాంత్ జాదవ్(5) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్ ఎనిమిది సార్లు రైడ్‌కు వెళ్లి కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఇది యూపీపై పెద్ద ప్రభావం చూపింది. గుజరాత్ జట్టు 23 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ జట్టు 14 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. అంతేకాకుండా యూపీ జట్టును ఆలౌట్ చేసి మరో మూడు పాయింట్లను గుజరాత్ తన ఖాతాలో వేసుకుంది. -
చాంప్ బెంగళూరు బుల్స్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో నయా చాంపియన్ అవతరించింది. గత ఐదు సీజన్లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్ ఎట్టకేలకు బెంగళూరు బుల్స్ ఒడిలో వాలింది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చివరి క్షణాల్లో ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసింది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన తుదిపోరులో బెంగళూరు 38–33తో గుజరాత్‌పై గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. విరామ సమయానికి 16–9తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న గుజరాత్ రెండో అర్ధభాగంలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బెంగళూరు కెప్టెన్ రోహిత్ (1 పాయింట్) ఘోరంగా విఫలమైనా... పవన్ షెరావత్ 22 పాయింట్లతో దుమ్మురే పాడు. జట్టును ఓటమి అంచుల్లో నుంచి విజయ శిఖరాలకు చేర్చాడు. జట్టులో 3 పాయింట్లే రెండో అత్యధికం అంటే... పవన్ ఏ స్థాయిలో విజృంభించాడో అర్థమవుతోంది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తరఫున సచిన్ కుమార్ 10, ప్రపంజన్, రోహిత్ గులియా చెరో 5 పాయింట్లు సాధించారు. విజేతకు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్ జట్టుకు రూ. 1.8 కోట్లు దక్కాయి. పీకేఎల్ ఏడో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. -
ప్రొ కబడ్డీ టైటిల్ విజేత బెంగళూర్ బుల్స్
ముంబై: కూత కూతకు గెలుపు సమీకరణాలు మారిపోయాయి. ఫైనల్ మజా ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారే అంతకు మించి హోరు జరిగింది. ఈ సారైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఆడిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు ముంగిట బోల్తాపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ప్రొ కబడ్డీ ఆరో సీజన్ తుది పోరులో బెంగళూరు బుల్స్ విజేతగా అవతరించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38-33 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఆధిక్యంలో నిలిచిన గుజరాత్ రెండో భాగంలో తడబడింది. బెంగళూరు సారథి రోహిత్ ఫైనల్ పోరులో తడబడినా స్టార్ రైడర్ పవన్ మరోసారి తనదైన రీతిలో రెచ్చిపోయి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
టైటిల్ కూత ఎవరిదో?
ముంబై: ఎన్నో ఉత్కంఠ పోరాటాలు... మరెన్నో అనూహ్య ఫలితాలు. మేటి జట్లు ముందే బరిలో నుంచి తప్పుకుంటే... అనామక జట్లు మెరుపులు మెరిపించాయి. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ గ్రూప్ దశలోనే వెనుదిరగ్గా... గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరింది. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మధ్య నేడు జరిగే ఫైనల్‌తో లీగ్ ఆరో సీజన్‌కు తెరపడనుంది. రైడింగ్‌లో బలంగా ఉన్న బెంగళూరు బుల్స్... దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న గుజరాత్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు జట్లలో ఎవరు గెలిచినా... తొలిసారి టైటిల్ హస్తగతమవుతుంది. 2015లో బెంగళూరు బుల్స్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. విజేతకు రూ.3 కోట్లు... రన్నరప్ జట్టుకు రూ.1.80 కోట్లు ప్రైజ్‌మనీగా లభించనుంది. ఇరుజట్ల మధ్య చివరగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. ఈ సీజన్లో బెంగళూరు రైడర్స్ 521 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 460 పాయింట్లతో గుజరాత్ రైడర్లు నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ట్యాక్లింగ్ విషయానికొస్తే 266 పాయింట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలవగా... 223 పాయింట్లతో బుల్స్ ఆరోస్థానంలో ఉంది. గుజరాత్‌కు సచిన్, ప్రపంజన్, సునీల్... బెంగళూరుకు కెప్టెన్ రోహిత్, పవన్ కీలకం. -
ఫైనల్లో గుజరాత్
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 38–31తో యూపీ యోధాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఒక దశలో మ్యాచ్‌పై యూపీ యోధ పైచేయి కనబర్చినా... తొలి అర్ధభాగం ముగిసే సమయానికి గుజరాత్ 19–14తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాతా రెండో సగంలో మరింత దూకుడు పెంచి 29–14తో ముందంజ వేసింది. చివర్లో తేరుకున్న యూపీ వరుస పాయిట్లతో బెంబేలెత్తించినా చివరకు 7 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. గుజరాత్ తరఫున సచిన్ 10 పాయింట్లతో మెరవగా... రోహిత్, ప్రపంజన్ చెరో 5 పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున శ్రీకాంత్ 7, నితేశ్ 6 పాయింట్లు సాధించారు. -
టైటిల్ పోరుకు బెంగళూరు
కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేల్)లో బెంగళూరు బుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో బెంగళూరు 41–29 స్కోరుతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై విజయం సాధించింది. రైడింగ్‌లో బుల్స్ ఆటగాడు పవన్ షెరావత్ చెలరేగాడు. 13 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. రోహిత్ కుమార్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతను 11 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మహేందర్ సింగ్ 6 ట్యాకిల్ పాయింట్లు చేశాడు. గుజరాత్ జట్టులో సచిన్ ఆకట్టుకున్నాడు. 12 సార్లు రైడింగ్‌కు వెళ్లిన సచిన్ 10 పాయింట్లు సాధించాడు. ఓడినా... గుజరాత్‌కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా మిగిలే వుంది. ఈ నెల 3న యూపీ యోధతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో గెలిస్తే ఆ జట్టు టైటిల్ పోరుకు అర్హత సంపాదించవచ్చు. ఎలిమినేటర్–3 మ్యాచ్‌లో యూపీ యోధ 45–33తో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందింది. -
పట్నా బెర్త్ యూపీ చేతిలో...
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో ‘ప్లే ఆఫ్స్’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ చతికిలపడింది. ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో పట్నా 29–37తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 28–30తో వెనుకంజలో ఉన్న పట్నా ఆ తర్వాత మరిన్ని పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ రెండు సార్లు ఔటవడం ఫలితంపై ప్రభావం చూపింది. పట్నా తరఫున ప్రదీప్ 10 పాయింట్లు సాధించగా... గుజరాత్ తరఫున రోహిత్ 9, అజయ్ 8 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 37–31తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధా తలపడనున్నాయి. జోన్ ‘బి’లో నిర్ణీత 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పట్నా ప్రస్తుతం 55 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 52 పాయింట్లతో యూపీ యోధ నాలుగో స్థానంలో ఉంది. నేడు బెంగాల్ వారియర్స్‌తో జరిగే మ్యాచ్‌లో యూపీ యోధ గెలిస్తే 57 పాయింట్లతో ‘ప్లే ఆఫ్’ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. యూపీ యోధ ఓడిపోతే పట్నా పైరేట్స్ ‘ప్లే ఆఫ్’కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... ఇరు జట్లు 55 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు పాయింట్ల తేడా కీలకం కానుంది. ప్రస్తుతానికి పాయింట్ల తేడా పరంగా పట్నా మెరుగ్గా ఉంది. -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల బాట వీడటం లేదు. ట్యాక్లింగ్‌తో పాటు రైడింగ్‌లో విఫలమైన టైటాన్స్ సొంత ప్రేక్షకుల మధ్య కూడా సత్తా చాటలేక వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. నగరంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 27–29తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 12–17తో వెనుకంజలో ఉన్న టైటాన్స్ ఆ తర్వాత పుంజుకొని వరుస పాయింట్లు సాధించింది. ఓ దశలో 26–23తో ఆధిక్యంలోకి వచ్చింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... అనూహ్యంగా తడబడి ఓటమి మూటగట్టుకుంది. కీలక సమయంలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఔట్ కావడం ఫలితంపై ప్రభావం చూపింది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 10 పాయింట్లతో మెరవగా... టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి 8 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 53–36తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
గుజరాత్ జెయింట్స్ గెలుపు
అహ్మదాబాద్: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ దుమ్మురేపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 35–23తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన ఫార్చూన్ జెయింట్స్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 19–14తో నిలిచింది. రెండో సగంలోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 9, అజయ్ 6 పాయింట్లు సాధించారు. బెంగాల్ తరఫున మణిందర్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 45–28తో యూపీ యోధాపై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరీ పల్టన్‌తో బెంగాల్ వారియర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 45–38తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. గుజరాత్ తరఫున డాంగ్ లీ 10, రోహిత్ గులియా 7 రైడ్ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో పర్వేశ్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధా, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్, యూపీ యోధాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
గుజరాత్ జెయింట్స్ జోరు
జైపూర్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆ జట్టు 13వ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ 33–29 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. రైడింగ్‌లో 16 పాయింట్లతో పట్నా పైచేయి సాధించగా, టాకిల్‌లో గుజరాత్ డిఫెండర్లు 15 పాయింట్లతో అదరగొట్టారు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. గుజరాత్ రైడర్లలో మహేంద్ర రాజ్‌పుత్ (6), సచిన్ (5), అబొజర్ మిఘాని (4) రాణించారు. డిఫెండర్ ఫజెల్ అత్రచలి 5 టాకిల్ పాయింట్లు చేశాడు. పట్నా జట్టులో మోను గోయత్ 6 పాయింట్లు చేయగా... విజయ్ (6) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. మిగతా వారిలో పర్దీప్ నర్వాల్ 4, జవహర్ డాగర్ 2 పాయింట్లు సాధించారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 38–30 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. -
కబడ్డీ కూత టై... టై...
సొనేపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం ఆసక్తికరంగా జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా ‘టై’ అయ్యాయి. ఇంటర్ జోన్ చాలెంజ్‌లో భాగంగా హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ 41–41తో టైగా ముగి సింది. అనంతరం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, యూపీ యోధ జట్ల మధ్య పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ కూడా 30–30తో టై అయింది. నేడు జరిగే పోటీల్లో పట్నాతో యూ ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి.