
ముంబై: ఎన్నో ఉత్కంఠ పోరాటాలు... మరెన్నో అనూహ్య ఫలితాలు. మేటి జట్లు ముందే బరిలో నుంచి తప్పుకుంటే... అనామక జట్లు మెరుపులు మెరిపించాయి. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ గ్రూప్ దశలోనే వెనుదిరగ్గా... గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరింది. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మధ్య నేడు జరిగే ఫైనల్‌తో లీగ్ ఆరో సీజన్‌కు తెరపడనుంది. రైడింగ్‌లో బలంగా ఉన్న బెంగళూరు బుల్స్... దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న గుజరాత్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.
రెండు జట్లలో ఎవరు గెలిచినా... తొలిసారి టైటిల్ హస్తగతమవుతుంది. 2015లో బెంగళూరు బుల్స్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. విజేతకు రూ.3 కోట్లు... రన్నరప్ జట్టుకు రూ.1.80 కోట్లు ప్రైజ్‌మనీగా లభించనుంది. ఇరుజట్ల మధ్య చివరగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. ఈ సీజన్‌లో బెంగళూరు రైడర్స్ 521 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 460 పాయింట్లతో గుజరాత్ రైడర్లు నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ట్యాక్లింగ్ విషయానికొస్తే 266 పాయింట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలవగా... 223 పాయింట్లతో బుల్స్ ఆరోస్థానంలో ఉంది. గుజరాత్‌కు సచిన్, ప్రపంజన్, సునీల్... బెంగళూరుకు కెప్టెన్ రోహిత్, పవన్ కీలకం.