సెమీఫైనల్స్‌లో ఓడిన యూపీ యోధాస్, దబంగ్ ఢిల్లీ
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా స్టీలర్స్ 28–25 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. తాజా సీజన్‌లో తిరుగులేని ఆధిపత్యంతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన హరియాణా స్టీలర్స్ సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి హరియాణా 12–11తో ముందంజలో నిలిచింది.
ద్వితీయార్ధంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఒత్తిడిలోకి నెట్టి చివరి వరకు దాన్ని కొనసాగించి స్టీలర్స్ తుదిపోరుకు చేరింది. హరియాణా తరఫున శివమ్ పతారె 7, వినయ్ 6 రెయిడ్ పాయింట్లు సాధించారు. రాహుల్ సత్పాల్ (5 పాయింట్లు) ట్యాక్లింగ్‌లో అదరగొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ 15 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 18 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
అయితే డిఫెన్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన స్టీలర్స్ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడంతో పాటు మరో రెండు ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించి ముందంజ వేసింది. యూపీ యోధాస్ తరఫున స్టార్ రెయిడర్ గగన్ గౌడ 10 పాయింట్లతో పోరాడగా... భవానీ రాజ్‌పుత్, హితేశ్ చెరో 5 పాయింట్లు సాధించారు. రెండో సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరెట్స్ 32–28 పాయింట్ల తేడాతో మరో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది.
ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆఖర్లో ఒత్తిడిని అధిగమించిన పైరేట్స్ విజయతీరానికి చేరింది. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 8 పాయింట్లు సాధించగా... శుభమ్ షిండే (5 పాయింట్లు), అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. ఢిల్లీ జట్టు తరఫున అశు మలిక్ (9 పాయింట్లు), మోహిత్ దేశ్వాల్ (7 పాయింట్లు) పోరాడారు. ఆదివారం జరగనున్న తుదిపోరులో హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment