ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో నయా చాంపియన్ అవతరించింది. గత ఐదు సీజన్‌లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్ ఎట్టకేలకు బెంగళూరు బుల్స్ ఒడిలో వాలింది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చివరి క్షణాల్లో ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసింది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన తుదిపోరులో బెంగళూరు 38–33తో గుజరాత్‌పై గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. విరామ సమయానికి 16–9తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న గుజరాత్ రెండో అర్ధభాగంలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బెంగళూరు కెప్టెన్ రోహిత్ (1 పాయింట్) ఘోరంగా విఫలమైనా... పవన్ షెరావత్ 22 పాయింట్లతో దుమ్మురే పాడు. జట్టును ఓటమి అంచుల్లో నుంచి విజయ శిఖరాలకు చేర్చాడు. జట్టులో 3 పాయింట్లే రెండో అత్యధికం అంటే... పవన్ ఏ స్థాయిలో విజృంభించాడో అర్థమవుతోంది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తరఫున సచిన్ కుమార్ 10, ప్రపంజన్, రోహిత్ గులియా చెరో 5 పాయింట్లు సాధించారు. విజేతకు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్ జట్టుకు రూ. 1.8 కోట్లు దక్కాయి. పీకేఎల్ ఏడో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment