Bangalore Bulls
-
పట్నా ఫటాఫట్
నోయిడా: స్టార్ రెయిడర్లు దేవాంక్, అయాన్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఘనవిజయం సాధించింది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో పట్నా పైరెట్స్ 54–31 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన పట్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. దేవాంక్ 16 పాయింట్లు, అయాన్ 12 పాయింట్లతో సత్తా చాటారు. బెంగళూరు బుల్స్ తరఫున అక్షిత్ ధుల్ (7 పాయింట్లు) కాస్త పోరాడాడు. స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ ఒక్క పాయింట్‌కే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా పట్నా 32 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... బెంగళూరు జట్టు 13కే పరిమితమైంది. ప్రత్యరి్థని మూడుసార్లు ఆలౌట్ చేసిన పైరేట్స్... తాజా లీగ్‌లో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో పట్నా పైరెట్స్ మూడో స్థానానికి చేరింది. మరోవైపు బెంగళూరు బుల్స్ వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది. పుణేరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 29–29 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించగా... పల్టన్ తరఫున పంకజ్ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అశు రెయిడింగ్ అదుర్స్
నోయిడా: స్టార్ రెయిడర్ అశు మలిక్ 14 పాయింట్లతో సత్తా చాటడంతో... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో దబంగ్ ఢిల్లీ ఐదో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ జట్టు 35–25 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. 12 రెయిడ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లతో అశు మలిక్ విజృంభించగా... అతడికి డిఫెన్స్‌లో యోగేశ్ దహియా (5 పాయింట్లు) సహకరించాడు. బెంగళూరు బుల్స్ తరఫున నితిన్ రావల్ 7 పాయింట్లు సాధించగా... స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఫలితంగా మ్యాచ్ ఏ దశలోనూ బెంగళూరు జట్టు ఢిల్లీకి పోటీనివ్వలేకపోయింది. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 5 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 32 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. పది మ్యాచ్‌ల్లో 8వ పరాజయంతో బెంగళూరు జట్టు పట్టికలో 11వ స్థానానికి పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 46–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. తలైవాస్ తరఫున విశాల్ 12 పాయింట్లతో రాణించగా... బెంగాల్ తరఫున విశ్వాస్ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన తమిళ్ తలైవాస్ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో ఉంది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
బెంగళూర్ బుల్స్ రెండో విక్టరీ
4 నవంబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్.. ఎట్టకేలకు సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ బరిలో లేకపోయినా.. బలమైన తమిళ్ తలైవాస్‌పై 36-32తో నాలుగు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ తడబాటుకు గురైంది. సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన తమిళ్ తలైవాస్‌కు ఇది రెండో పరాజయం. బెంగళూర్ బుల్స్ ఆటగాళ్లలో అజింక్య పవార్ (6 పాయింట్లు), అక్షిత్ (6 పాయింట్లు), సురిందర్ దెహల్ (5 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్ తరఫున నరందర్ (6 పాయింట్లు), సచిన్ (5) రాణించారు. బెంగళూర్ పైచేయి : వరుస పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్.. సోమవారం తమిళ్ తలైవాస్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్లు అంచనాలకు మించి రాణించటంతో ప్రథమార్థం ఆటలో తమిళ్ తలైవాస్‌పై బెంగళూర్ బుల్స్ ఓ పాయింట్ ఆధిక్యం సాధించింది. రెయిడర్లు అజింక్య పవార్, జై భగవాన్ కూతలో మెప్పించారు. డిఫెండర్లు సౌరభ్ నందల్, సురిందర్ దెహల్ మెరుపు ట్యాకిల్స్ చేశారు. తమిళ్ తలైవాస్ సైతం రెయిడ్‌లో కాస్త నిరాశపరిచినా.. డిఫెన్స్‌లో మెప్పించింది. ఉత్కంఠగా సాగిన తొలి 20 నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ 14-13తో పైచేయి సాధించింది.సెకండ్‌హాఫ్‌లో తమిళ్ తలైవాస్ పుంజుకుంది. డిఫెండర్ల జోరుకు.. రెయిడర్లు సైతం జత కలిశారు. దీంతో తమిళ్ తలైవాస్ వేగంగానే కోలుకుంది. చివరి పది నిమిషాల ఆటలో ఏకంగా మూడు పాయింట్ల ముందంజలో నిలిచిన తమిళ్ తలైవాస్.. ఆ తర్వాత నిరాశపరిచింది. 36వ నిమిషంలో 26-26తో స్కోరు సమం చేసింది బెంగళూర్ బుల్స్. ఆఖరు ఐదు నిమిషాల్లో తలైవాస్‌ను ఆలౌట్ చేసి 29-26తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది బుల్స్. ఆఖరు వరకు అదే జోరు కొనసాగించిన బెంగళూర్ బుల్స్ 36-32తో తమిళ్ తలైవాస్‌ను బోల్తా కొట్టించింది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
హైదరాబాద్, 2 నవంబర్ 2024 : తెలుగు టైటాన్స్ పంజా విసిరింది. బెంగళూర్ బుల్స్‌ను బోల్తా కొట్టించి సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్‌పై గెలుపొందింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పవన్ సెహ్రావత్ (14 పాయింట్లు), ఆశీష్ నర్వాల్ (6 పాయింట్లు), అజిత్ పవార్ (5 పాయింట్లు), విజయ్ మాలిక్ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్ బుల్స్ తరఫున ఆల్‌రౌండర్లు పంకజ్ (9 పాయింట్లు), నితిన్ రావల్ (7 పాయింట్లు), రెయిడర్ అజింక్య పవార్ (9 పాయింట్లు), డిఫెండర్ అరుల్ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్ బుల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్ పవర్ సెహ్రావత్ సీజన్లో అత్యధిక రెయిడ్ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.తెలుగు టైటాన్స్ పంజా : ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. బెంగళూర్ బుల్స్‌పై ధనాధన్ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్ సెహ్రావత్, ఆశీష్ నర్వాల్‌లు కూతకెళ్లి బుల్స్‌ను ఆలౌట్ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్ తిరుగులేని స్థానంలో నిలిచింది. తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్ ట్యాకిల్స్‌తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది.బుల్స్ మెరుపు వేగంతో.. : విరామం అనంతరం బెంగళూర్ బుల్స్ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్ ఆలౌట్ చేసింది. మెరుపు ట్యాకిల్స్‌కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్ బుల్స్. స్టార్ రెయిడర్ పవర్ సెహ్రావత్ విఫలమైతే.. టైటాన్స్ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్‌కు పోటీ ఇచ్చిన బెంగళూర్ బుల్స్ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది. -
ఎట్టకేలకు బెంగళూర్‌కు ఓ విజయం
హైదరాబాద్, 29 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీపై 34-32తో పైచేయి సాధించి, 2 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీకి ఇది ఐదు మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్ బుల్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో తొలి విజయం కావటం గమనార్హం. బెంగళూర్ బుల్స్ తరఫున 11వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్‌పై అడుగుపెట్టిన జై భగవాన్ (11 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో బుల్స్‌కు విజయాన్ని అందించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో ఆషు మాలిక్ (13 పాయింట్లు) సూపర్ టెన్తో మెరిసినా ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. ప్రథమార్థం దబంగ్‌దే : వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న బెంగళూర్ బుల్స్‌పై దబంగ్ ఢిల్లీ ధనాధన్ షో చేసింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలోనే 22-14తో ఏకంగా ఎనిమిది పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు ఆషు మాలిక్, వినయ్ అంచనాలు అందుకోవటంతో దబంగ్ ఢిల్లీకి ఎదురు లేకుండా పోయింది. కూతలో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ పోటీ ఇచ్చినా.. డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయింది. మెరుపు ట్యాకిల్స్‌తో ప్రథమార్థంలో ఓసారి బెంగళూర్ బుల్స్‌ను ఆలౌట్ చేసింది. బుల్స్ సూపర్ షో : సెకండ్‌హాఫ్‌లో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ కూతలో ముందుండి నడిపించగా.. డిఫెండర్లు సైతం ట్యాకిల్స్‌తో మెరిశారు. ఇదే సమయంలో దబంగ్ ఢిల్లీ సైతం పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. దీంతో ద్వితీయార్థంలో సమవుజ్జీగా పాయింట్లు సాధించినా ప్రథమార్థంలో కోల్పోయిన ఆధిక్యం బెంగళూర్ బుల్స్‌ను వెంటాడింది. ఆఖరు పది నిమిషాల్లో అదరగొట్టే ప్రదర్శన చేసిన బెంగళూర్ బుల్స్ స్కోరు సమం చేసి ఏకంగా ఆధక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్‌ను దబంగ్ ఢిల్లీ నిలువరించినా.. జై భగవాన్ను ఆ జట్టు డిఫెండర్లు నిలువరించలేకపోయారు. 11 రెయిడ్ పాయింట్లతో మెరిసిన భగవాన్ బెంగళూర్ బుల్స్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆటలో మూడోంతుల భాగం ఆధిక్యంలో నిలిచిన దబంగ్ ఢిల్లీ.. ఆఖర్లో బోల్తా పడింది. -
PKL 2024: పుణెరి పల్టాన్ తీన్మార్
హైదరాబాద్, 25 అక్టోబర్ 2024 : మాజీ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్‌పై పుణెరి పల్టాన్ 14 పాయింట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. జట్టుగా రాణించటంలో పూర్తిగా విఫలమైన బెంగళూర్ బుల్స్ సీజన్లో వరుసగా నాల్గో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 36-22తో బెంగళూర్ బుల్స్‌పై పుణెరి పల్టాన్ ఏకపక్ష విజయం సాధించింది. పల్టాన్ తరఫున పంకజ్ మోహితె (6 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు) రాణించారు. బెంగళూర్ బుల్స్ ఆటగాళ్లలో పంకజ్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. బెంగళూర్ బుల్స్‌కు ఏదీ కలిసి రావటం లేదు. హ్య్రాటిక్ పరాజయాలు చవిచూసిన బుల్స్.. నాల్గో మ్యాచ్‌లోనూ ఏమాత్రం మారలేదు. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ పేలవ ప్రదర్శన ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం పుణెరి పల్టాన్‌తో మ్యాచ్‌లో బుల్స్ పూర్తిగా తేలిపోయింది. తొలి అర్థభాగం ఆటలో ఆ జట్టు 11-18తో నిలిచింది. తొలి పది నిమిషాల ఆటలో ఆ జట్టు పాయింట్లు రెండెంకలకు చేరుకోలేదు. ప్రథమార్థంలో చివర్లో పంకజ్ మెరుపులతో బుల్స్ 11 పాయింట్ల వరకు చేరుకుంది. మరోవైపు పల్టాన్ ఆటగాళ్లు పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లకు కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ (5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి (4 పాయింట్లు), ఆమన్ (4 పాయింట్లు) జతకలిశారు. మ్యాచ్ రెండో అర్థభాగంలో బెంగళూర్ బుల్స్ ప్రదర్శన కాస్త మెరుగైనా.. ఏ దశలోనూ పుణెరి పల్టాన్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. విరామం అనంతరం సైతం మెరుపు ప్రదర్శన పునరావృతం చేసిన పుణెరి పల్టాన్ చివరి 20 నిమిషాల ఆటలోనూ 18-11తో బుల్స్‌ను చిత్తు చేసింది. దీంతో పుణెరి పల్టాన్ 36-22తో బెంగళూర్‌పై అలవోక విజయం సాధించింది. సీజన్లలో పుణెరి పల్టాన్‌కు ఇది నాలుగు మ్యాచుల్లో మూడో విజయం. ఈ విక్టరీతో పీకెఎల్ 11 పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. వరుసగా నాల్గో పరాజయంతో బెంగళూర్ బుల్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. -
యూపీ యోధాస్ రెండో గెలుపు.. బెంగళూరు బుల్స్ హ్యాట్రిక్ ఓటమి
హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో యూపీ యోధాస్ రెండో విజయం సొంతం చేసుకోగా.. పర్దీన్ నర్వాల్ కెప్టెన్సీలోని బెంగళూరు బుల్స్ వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడి హ్యాట్రిక్ పరాజయం చవి చూసింది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 57-–36 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తుగా ఓడించింది. యూపీ యోధాస్ కెప్టెన్ సురేందర్ గిల్ 17 పాయింట్లతో విజృంభించాడు. ఆల్‌రౌండర్ భరత్ (14), డిఫెండర్ సుమిత్ (9) కూడా ఆకట్టుకున్నారు. బుల్స్ తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (16 ) సూపర్ టెన్ సాధించగా, జతిన్ (9) పోరాడాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను యూపీ మూడుసార్లు ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి యూపీ యోధాస్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆ జట్టు రైడర్లు ఆరంభం నుంచి కెప్టెన్ సురేందర్ గిల్, భరత్ వరుస రైడ్ పాయింట్లతో విజృంభించారు. జట్టుకు తొలి పాయింట్ అందించిన భరత్ ప్రత్యర్థి డిఫెండర్ల పట్టుకు చిక్కకుండా అలరించాడు. మరోవైపు సురేందర్ కూడా కోర్టులో పాదరసంలా కదులుతూ ఆకట్టుకున్నాడు. అదే సమయంలో యోధాస్ డిఫెండర్లు సైతం సత్తా చాటారు. బెంగళూరు తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్, జతిన్ పోరాడినా మిగతా రైడర్ల నుంచి వారికి సహకారం లభించలేదు.11వ నిమిషంలో బుల్స్‌ను ఆలౌట్ చేసిన 15–9తో ముందంజ వేసింది. ఆపై, భరత్ వెంటవెంటనే రెండు సూపర్ రైడ్లతో అలరించాడు. రెండు ప్రయత్నాల్లో ముగ్గురేసి ఆటగాళ్లను ఔట్ చేశాడు. దాంతో నాలుగు నిమిషాల వ్యవధిలోనే బెంగళూరును రెండోసారి ఆలౌట్ చేసిన యూపీ యోధాస్ 24–10తో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. ఇదే జోరుతో భరత్, సురేందర్ సూపర్ టెన్స్ పూర్తి చేసుకోగా.. యోధాస్ 33–15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలోనూ భరత్, సురేందర్ జోరు కొనసాగింది. అటువైపు బుల్స్ కెప్టెన్ పర్దీప్ సూపర్ రైడ్ చేసి సూపర్ టెన్ పూర్తి చేసుకోగా జతిన్ కూడా మెప్పించాడు. కానీ, యూపీ ఏమాత్రం పట్టు విడవలేదు. ఇరు జట్లూ కొద్దిసేపు పోటాపోటీగా రైడ్ పాయింట్లు రాబట్టగా యోధాస్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లింది. 32వ నిమిషంలో మూడోసారి బెంగళూరును ఆలౌట్ చేసిన యూపీ 49–28తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పర్దీప్తో పాటు ఇతర ఆటగాళ్లు పోరాడినా అది బెంగళూరు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. కాగా, బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో పుణెరి పల్టాన్ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా పోటీ పడనుంది. -
గుజరాత్ జెయింట్స్ బోణీ
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టు శుభారంభం చేసింది. గచ్చిచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 36–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ జెయింట్స్‌లో ప్రతీక్ దహియా 8, హిమాన్షు 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 39–34తో బెంగాల్ వారియర్స్ జట్టుపై విజయం సాధించింది. జైపూర్ జట్టు తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో సత్తా చాటాడు. 12 రెయిడింగ్ పాయింట్లతో సూపర్–10 ఖాతాలో వేసుకున్న అర్జున్ జట్టుకు కీలక సమయాల్లో ఆధిక్యం అందించాడు. అభిజిత్ మలిక్ 7 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ జట్టు తరఫున అత్యధికంగా నితిన్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు. మణీందర్ సింగ్ 8 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8:00 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటల నుంచి) తలపడతాయి. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. లీగ్‌లో ప్రతీ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన టైటాన్స్ ఈసారి శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించగా ... బెంగళూరు కెపె్టన్ ప్రదీప్ నర్వాల్ కేవలం 3 పాయింట్లే నమోదు చేసి విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–11తో 9 పాయింట్ల తేడాతో ముందంజలో నిలిచింది. అయితే ఆ తర్వాత కోలుకున్న బుల్స్ 18–11 పాయింట్లతో రెండో అర్ధభాగంలో ఆధిక్యం ప్రదర్శించింది. బుల్స్ తమ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయగా... టైటాన్స్ జట్టు బెంగళూరును రెండుసార్లు ఆలౌట్ చేసింది. పవన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో 1200 రైడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు 36–28 పాయింట్ల తేడాతో యు ముంబా జట్టును ఓడించింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
తొడగొట్టేందుకు సిద్ధం.. ప్రో కబడ్డీ లీగ్‌కు సర్వం సిద్దం
సాక్షి, హైదరాబాద్: పది సీజన్లుగా కబడ్డీ అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడాది వ్యవధిలోపే మళ్లీ ముందుకు వచ్చింది. పీకేఎల్ 11వ సీజన్‌కు నేటితో తెర లేవనుంది. గత సీజన్కంటే భిన్నంగా ఈసారి మూడు వేదికలకే టోర్నీ లీగ్ దశను పరిమితం చేస్తున్నారు. సీజన్–10 ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే నేడు టోర్నీ ప్రారంభం అవుతుంది. నవంబర్ 9 వరకు ఇక్కడే పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత నోయిడా, పుణే తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. మరోసారి 12 టీమ్‌లతోనే పీకేఆల్ జరగనుండగా... లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) ఐదు మ్యాచ్‌లతో కలిపి ఓవరాల్‌గా 137 మ్యాచ్‌లు పీకేఎల్‌లో జరుగుతాయి. టోర్నీ తొలిరోజు జరిగే మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తలపడనుండగా... మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, యు ముంబా మధ్య రెండో మ్యాచ్ మ్యాచ్ (రాత్రి 9 గంటల నుంచి) జరుగుతుంది. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 24న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేస్తారు. భారీ వేలంతో మొదలు... సీజన్–11 కోసం నిర్వహించిన వేలంలో ఆటగాళ్లకు భారీ విలువ పలికింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రూ. 1 కోటికి పైగా విలువతో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో ఏకంగా 8 మంది ఉండటం విశేషం. అత్యధికంగా తమిళ్ తలైవాస్ సచిన్ తన్వర్‌ను రూ.2 కోట్ల 15 లక్షలకు దక్కించుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు గురువారం హైదరాబాద్‌లో ట్రోఫీ ఆవిష్కరణ సహా లీగ్ ప్రచార కార్యక్రమం జరిగింది. పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తదితరులు ఇందులో పాల్గొన్నారు. దశాబ్దకాలంగా తమ లీగ్‌కు మంచి ఆదరణ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన మున్ముందు టోర్నీని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ప్రకటించారు. పీకేఎల్ రాకతో తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు వచ్చి0దని... డబ్బుతో పాటు గుర్తింపూ దక్కిందని అగ్రశ్రేణి ఆటగాళ్లు పవన్ సెహ్రావత్, ప్రదీప్ నర్వాల్ వెల్లడించారు. టైటాన్స్ రాత మారేనా... ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైన నాటినుంచి లీగ్‌లో ఉన్న ఎనిమిది జట్లలో తెలుగు టైటాన్స్ కూడా ఒకటి. కానీ మిగతా ఏడు జట్లతో పోలిస్తే టైటాన్స్‌దే ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన. టైటాన్స్ మినహా మిగిలిన ఏడు జట్లు కనీసం ఒక్కసారైనా విజేతగా నిలవడం విశేషం. రెండో సీజన్లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటి వరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లుగానైతే మరీ చెత్త ప్రదర్శనతో చివరిదైన 12వ స్థానంలో నిలుస్తూ వచ్చి0ది. ఓవరాల్‌గా 10 సీజన్లలో కలిపి 192 మ్యాచ్‌లు ఆడితే 56 మాత్రమే గెలిచి 116 ఓడిపోయింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, లీగ్‌లో దబంగ్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ కృషన్ కుమార్ హుడా ఈసారి టైటాన్స్ కోచ్‌గా రావడం జట్టుకు సానుకూలాంశం. అతని నేతృత్వంలో టీమ్ రాత మారుతుందా అనేది ఆసక్తికరం. వేలంలో ఎఫ్బీఎం ద్వారా రూ.1.72 కోట్లకు కెపె్టన్ పవన్ సెహ్రావత్‌ను టీమ్ కొనసాగించింది. విజయ్ మలిక్, అమిత్ కుమార్, సంజీవి వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే పవన్ మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి రైడర్ లేకపోవడం జట్టులో ఒక లోపం. ప్రఫుల్, ఓంకార్, మన్జీత్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. డిఫెన్స్‌లో కృషన్ ధుల్ రూపంలో కీలక ఆటగాడు ఉండగా... మిలాద్, అజిత్, సాగర్ నుంచి సహకారం అవసరం. పీకేఎల్–11లో పాల్గొనే జట్లు: తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యు ముంబా, యూపీ యోధాస్. -
నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. డిసెంబర్ 24 వరకు సాగే లీగ్ దశలో 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్‌తో పాటు నోయిడా, పుణే ఇతర వేదికలుగా ఉన్నాయి. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో బెంగళూరు బుల్స్; ఢిల్లీ దబంగ్‌తో యు ముంబా ఆడతాయి. గురువారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని జట్ల కెపె్టన్లు పాల్గొన్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడాలనుకునే కబడ్డీ అభిమానులు bౌౌజుఝyటజిౌఠీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. రూ.500, రూ.1000, రూ. 2500లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు నవంబర్ 9వ తేదీన ముగుస్తాయి. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలో... డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. -
దబంగ్ ఢిల్లీ బోణీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు గెలుపు బోణీ చేసింది. బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 38–31తో విజయం సాధించింది. ఢిల్లీ తరఫున నవీన్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేయగా... అశు మలిక్ తొమ్మిది పాయింట్లు సాధించాడు. బెంగళూరు తరఫున భరత్ 12 పాయింట్లు సంపాదించాడు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 43–32తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్; యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
ప్రో కబడ్డీ వేలం: ఐపీఎల్ రేంజ్లో ధర పలికిన ప్లేయర్స్.. రికార్డులు బ్రేక్
Pro Kabaddi.. దేశంలో క్రికెట్‌తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్ ఉంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్‌ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, 9వ సీజన్‌కు ముందు ప్రో కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్‌ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. It's the Hi-Flyer's 🌏 and we're just living in it 🤷♂️ Pawan Sehrawat shatters the #vivoPKLPlayerAuction records to emerge as the most expensive buy in the history of #vivoProKabaddi 🤯@tamilthalaivas can now breathe easy like all of us, eh? 👀 pic.twitter.com/Ej2PtKPqFv — ProKabaddi (@ProKabaddi) August 5, 2022 కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్ షెరావత్‌ను రూ.2.65కోట్లకు తమిళ్ తలైవాస్ దక్కించుకోగా.. వికాస్ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్ అట్రాసలిని పూణేరి పల్టన్స్.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్ సింగ్‌ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్‌గా పేరొందిన ప్రదీప్ నర్వాల్‌ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్‌బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్ షెరావత్.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్ రూ.65.10లక్షలకు అమీర్ హొసైన్‌ను, రవికుమార్‌ను రూ.64.10లక్షలకు(దబాంగ్ ఢిల్లీ), నీరజ్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ రూ.43లక్షలకు కొనుగోలు చేసుకున్నాయి. ನಮ್ಮ ಗೂಳಿ ಪಡೆ 😍 How's that squad looking, #BullsSene? ⚡#FullChargeMaadi #BengaluruBulls #vivoPKLPlayerAuctions pic.twitter.com/oDyrX89itc — Bengaluru Bulls (@BengaluruBulls) August 6, 2022 Ala re ala! We welcome the Sultan to Pune! 🦁 . .#PuneriPaltan #Bhaaripaltan #Gheuntak #vivoPKLPlayersAuction #BhaariAuction pic.twitter.com/CqgL2limse — Puneri Paltan (@PuneriPaltan) August 5, 2022 ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే.. రజనీష్, అంకిత్ బెనివల్ను రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్ సింగ్, మోను గోయల్,పర్వేష్ భైంస్వాల్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, సిద్దార్ధ్ దేశాయ్‌ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్, విజయ్ను రీటైన్ చేసుకుంది. Our first buy of the day Parvesh Bhainswal will be the part of #Titansquad#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/uYFjkcC4jo — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Abhishek Singh is set to expand the strength of the #Titansquad in season-9. How excited are you ?#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/gvJRfJaIkD — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Pesh hai aapke #PKL2022 #GujaratGiants squad! 💪#Giant family, how do you feel about the team? 🤩#GarjegaGujarat #Adani #vivoProKabaddi #vivoPKLPlayerAuction pic.twitter.com/UCyjmZSGdX — Gujarat Giants (@GujaratGiants) August 6, 2022 ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. -
PKL 2022: సెమీఫైనల్స్‌కు యూపీ యోధ, బెంగళూరు బుల్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధ, బెంగళూరు బుల్స్ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరాయి. సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ యోధ 42–31తో పుణేరి పల్టన్‌పై గెలుపొందగా, బెంగళూరు బుల్స్ 49–29తో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో అస్లామ్, మోహిత్ గోయత్ రెయిడింగ్ పాయింట్లతో పుణేరి 5–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడో నిమిషంలో యూపీ ఆలౌటైంది. తర్వాత పర్దీప్ వరుసగా కూతకు వెళ్లి పాయింట్లు తెచ్చిపెట్టడంతో పుంజుకుంది. స్టార్ రెయిడర్ పర్దీప్ 18 పాయింట్లతో రాణించాడు. ప్రత్యర్థి పుణేరి జట్టులో అస్లామ్ ఇనామ్దార్ (10) మెరుగనిపించాడు. రెండో ఎలిమినేటర్ పోరులో బెంగళూరు సమష్టిగా రాణించింది. రెయిడర్లు పవన్ 13, భరత్ 6, రంజీత్ చంద్రన్ 7 పాయింట్లు సాధించగా, డిఫెండర్లు మహేందర్ సింగ్ 5, సౌరభ్ నందల్ 4, అమన్ 4 పాయింట్లు చేశారు. గుజరాత్ జట్టులో రాకేశ్ (8), మహేంద్ర రాజ్‌పుత్ (5) మెరుగనిపించారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో యూపీ... పట్నా పైరేట్స్‌తో, బెంగళూరు... దబంగ్ ఢిల్లీతో తలపడతాయి. -
చాంప్ బెంగళూరు బుల్స్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో నయా చాంపియన్ అవతరించింది. గత ఐదు సీజన్లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్ ఎట్టకేలకు బెంగళూరు బుల్స్ ఒడిలో వాలింది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చివరి క్షణాల్లో ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసింది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన తుదిపోరులో బెంగళూరు 38–33తో గుజరాత్‌పై గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. విరామ సమయానికి 16–9తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న గుజరాత్ రెండో అర్ధభాగంలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బెంగళూరు కెప్టెన్ రోహిత్ (1 పాయింట్) ఘోరంగా విఫలమైనా... పవన్ షెరావత్ 22 పాయింట్లతో దుమ్మురే పాడు. జట్టును ఓటమి అంచుల్లో నుంచి విజయ శిఖరాలకు చేర్చాడు. జట్టులో 3 పాయింట్లే రెండో అత్యధికం అంటే... పవన్ ఏ స్థాయిలో విజృంభించాడో అర్థమవుతోంది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తరఫున సచిన్ కుమార్ 10, ప్రపంజన్, రోహిత్ గులియా చెరో 5 పాయింట్లు సాధించారు. విజేతకు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్ జట్టుకు రూ. 1.8 కోట్లు దక్కాయి. పీకేఎల్ ఏడో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 24–37తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (4 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. నీలేశ్ 6 పాయింట్లు సాధిం చాడు. బుల్స్ తరఫున పవన్ 13 పాయింట్లతో మెరిశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 47–37తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. సొంతగడ్డపై జరిగే చివరి మ్యాచ్‌లో నేడు పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. -
బెంగళూరు బుల్స్ చేతిలో తమిళ్ తలైవాస్ ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. జోన్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 35–44తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓటమి పాలైంది. తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ (9 రైడ్ పాయింట్లు) పోరాడినా... అతనికి సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మరో ఓటమి తప్పలేదు. బెంగళూరు తరఫున పవన్ 16, కాశీలింగ్ 12 పాయింట్లతో చెలరేగారు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 42–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. -
ఢిల్లీపై బెంగళూరు బుల్స్ పైచేయి
జైపూర్: రైడింగ్‌లో ఆకట్టుకున్న బెంగళూరు బుల్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆరో విజయాన్ని సాధిం చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 35–32తో దబాంగ్ ఢిల్లీ జట్టుపై నెగ్గి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించిన బుల్స్ చివరివరకు దాన్ని కొనసాగించింది. బెంగళూరు జట్టు 23 రైడ్, 7 ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టింది. ఇరుజట్లు చెరో రెండు సార్లు ఆలౌటయ్యాయి. బుల్స్ జట్టులో రోహిత్ కుమార్ 12 పాయింట్లు, అజయ్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ తరఫున రోహిత్ 17 సార్లు రైడింగ్‌కు వెళ్లి 11 పాయింట్లు సాధించాడు. ట్యాకిల్‌లో స్వప్ని ల్ 3 పాయింట్లతో రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–27తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో యూపీ యోధ ఆడుతుంది. -
గుజరాత్ జెయింట్స్ ఖాతాలో ఐదో గెలుపు
అహ్మదాబాద్: హోరాహోరీ పోరులో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 27–24 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. తొలి పది నిమిషాల్లో 11–3తో ఆధిక్యం కనబరిచిన బెంగళూరు బుల్స్ తొలి అర్ధభాగాన్ని 14–9తో ముగించింది. అయితే రెండో అర్ధభాగంలో గుజరాత్ అనూహ్యంగా పుంజుకోవడంతో మ్యాచ్ జరిగే కొద్దీ ఉత్కంఠ పెరిగింది. రైడర్లు వరుసగా పాయింట్లు చేయడంతో ఈ టోర్నీలో గుజరాత్ ఐదో విజయాన్ని సాధించింది. టాకిల్‌లో పర్వేశ్ (4) ఆకట్టుకున్నాడు. టాకిల్ చేసిన నాలుగు సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. రైడింగ్‌లో సచిన్ (4), రోహిత్ గులియా (4), సునీల్ కుమార్ (3) రాణించారు. అంతకుముందు జరిగిన పోరులో పుణేరి పల్టాన్ 34–17తో బెంగాల్ వారియర్స్‌పై అలవోక విజయం సాధించింది. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో హర్యానా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను ‘స్టార్ స్పోర్ట్స్–2’ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
బెంగళూరు బుల్స్‌కు మూడో విజయం
నాగ్‌పూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగాల్ వారియర్స్‌ను దెబ్బతీసింది. బుధవారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో బెంగళూరు 31–25తో వారియర్స్‌పై గెలిచింది. బెంగళూరు తరఫున రైడర్ అజయ్ కుమార్ అద్భుతంగా ఆడాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అజయ్ 8 పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ ఆశిష్ కుమార్ (5) టాకిల్‌లో అదరగొట్టాడు. టాకిల్ చేసిన ఐదు సార్లు పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో రోహిత్ కుమార్ 6, రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ చెరో 2 పాయింట్లు చేశారు. బెంగాల్ వారియర్స్ జట్టులో జాంగ్ కున్ లీ 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి 8 పాయింట్లు సాధించగా... టాకిల్‌లో సుర్జీత్ సింగ్ (4) ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. లీగ్‌లో బుల్స్‌కు ఇది మూడో విజయం కాగా బెంగాల్‌కు తొలి పరాజయం. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను ‘స్టార్ స్పోర్ట్స్–2’ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
బెంగళూరుతో టైటాన్స్ మ్యాచ్ టై
నాగ్‌పూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య మంగళవారం ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 21–21తో టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆటగాళ్లు తుదికంటా పోరాడిన తీరు ఆకట్టుకుంది. తొలి అర్ధభాగంలో బెంగళూరు 9–8తో పాయింట్ తేడాతో ఆధిక్యంలో నిలువగా... రెండో అర్ధభాగంలో మ్యాచ్ జరిగేకొద్దీ పుంజుకుంది. ప్రత్యర్థులకు దీటుగా కదిలిన టైటాన్స్ ఆటగాళ్లు చివరి క్షణాల్లో ఒక్కసారిగా రైడింగ్‌లో 5 (3, 2) పాయింట్లు తెచ్చారు. దీంతో స్కోరు 20–20 వద్ద సమమైంది. ఆ తర్వాత ఇరు జట్లు ఆఖరి రైడ్‌కు వెళ్లి ఒక్కోపాయింట్ తెచ్చాయి. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి రాణించాడు. 29 సార్లు రైడింగ్‌కు వెళ్లి 8 పాయింట్లు సాధించాడు. నీలేశ్ సాలుంకే 4, రాకేశ్, విశాల్ భరద్వాజ్ చెరో 2 పాయింట్లు, టాకిల్‌లో రాకేశ్ కుమార్ 2 పాయింట్లు చేశారు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ 5, ఆశిష్ 3 పాయింట్లు చేయగా... మహేందర్, ప్రీతమ్ చిల్లర్, రవీందర్ పాహల్ తలా రెండు పాయింట్లు సాధిం చారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32–20తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్... బెంగాల్ వారియర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ‘స్టార్ స్పోర్ట్స్–2’లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. -
టైటాన్స్ ఫ్లాప్ షో...
►వరుసగా రెండో పరాజయం ►అంతగా ఆకట్టుకోని రాహుల్ చౌదరి ►రోహిత్ కుమార్ సూపర్ రైడింగ్ ►బెంగళూరు బుల్స్ గెలుపు ► ప్రొ కబడ్డీ లీగ్ హైదరాబాద్ : తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 21–31 స్కోరుతో బెంగళూరు బుల్స్ ధాటికి పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. టాకిల్‌లో పట్టుకోల్పోయారు. రైడింగ్‌లో తేలిపోయారు. కెప్టెన్ రాహుల్ చౌదరి, రాకేశ్ కుమార్ చెరో నాలుగు పాయింట్లు సాధించగా, వికాస్, నీలేశ్ మూడేసి పాయింట్లు చేశారు. ప్రత్యర్థి జట్టులో మాత్రం రోహిత్ కుమార్ (12 పాయింట్లు) అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి పాయింట్లు తెచ్చిపెట్ట డంలో సఫలమయ్యాడు. అజయ్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. టాకిల్‌లో మహేందర్ సింగ్ తెలుగు టైటాన్స్ ఆటగాళ్లను సమర్థంగా కట్టడి చేశాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండ్ షోకు ఏ దశలోనూ టైటాన్స్ ఎదురు నిలువలేకపోయింది. ఏకంగా రెండుసార్లు ఆలౌటైంది. తొలి అర్ధభాగాన్ని 15–10తో ముగించిన బెంగళూరు బుల్స్ ఆ తర్వాత రెండో అర్ధభాగంలోనూ ఇదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా టాకిల్‌లో బెంగళూరు ఆటగాళ్ల సమన్వయం టైటాన్స్ రైడర్లను పదే పదే బోల్తా కొట్టించింది. మ్యాచ్ రెండు అర్ధభాగాల్లోనూ తెలుగు జట్టు ఏ దశలోనూ ఆధిక్యం వైపు చూడలేదు. బెంగళూరు రైడర్లలో రోహిత్‌తో పాటు అజయ్ కుమార్ రాణించాడు. రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ చెరో 3 పాయింట్లు చేశారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు రైడింగ్‌లో 17, టాకిల్‌లో 9 పాయింట్లు సాధించగా, హైదరాబాద్ రైడింగ్‌లో 15, టాకిల్‌లో కేవలం రెండే పాయిం ట్లు సాధించింది. మ్యాచ్ ఆసాంతం రైడింగ్‌లో అదరగొట్టిన రోహిత్ కుమార్‌కు ‘పర్ఫెక్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అజయ్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ జట్టుకిది వరుసగా రెండో పరాజయం కాగా... ఆడిన తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు గెలుపుతో టోర్నీలో శుభారంభం చేసింది. గట్టెక్కిన యు ముంబా... లీగ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా రెండో మ్యాచ్‌తో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో యు ముంబా జట్టు 29–28 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌పై గెలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబా జట్టు పాయింట్ తేడాతో గట్టెక్కింది. ఈ జట్టులో కశిలింగ్ (7 పాయింట్లు), అనూప్ కుమార్ (6) రాణించారు. సురీందర్ సింగ్ 4, సురేశ్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. హర్యానా తరఫున వజీర్ సింగ్ (6), వికాస్ (6) ఆకట్టుకున్నారు. సుర్జీత్ సింగ్ 4, రాకేశ్ సింగ్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి హర్యానా 15–11తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధం ప్రారంభంలోనూ హర్యానా ఆటగాళ్ల జోరే కొనసాగింది. దీంతో ఈ జట్టు ఒక దశలో 19–12తో స్పష్టమైన ఆధిక్యంలో నిలి చింది. అయితే ముంబా వరుస రైడింగ్‌లతో, టాకిల్ పాయిం ట్లతో టచ్‌లోకి వచ్చింది. దీంతో క్షణాల వ్యవధిలో ఒక్కసారిగా ఆధిక్యం తారుమారైంది. 22–20తో ముంబా ఆధిపత్యం మొదలైంది. అక్కడి నుంచి జాగ్రత్తగా ఆడిన ముంబా ఆటగాళ్లు ఆధిక్యాన్ని తుదికంటా కాపాడుకొని విజయం సాధించారు. ►హైదరాబాద్ అంచె పోటీలకు నేడు (సోమవారం) విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ, యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
పట్నాకు నాలుగో విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో చాంపియన్ పట్నా పైరేట్స్ ఎదురులేకుండా దూసుకెళుతోంది. సొంత వేదికపై గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 31-25 తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. ఇది పట్నాకు వరుసగా నాలుగో విజయం. ప్రదీప్ నర్వాల్ 8, రాజేశ్ మొండల్ 6 రైడింగ్ పాయింట్లతో అదరగొట్టారు. బెంగళూరు నుంచి రోహిత్ కుమార్ 7 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లిన పట్నాను బుల్స్ ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. 12వ నిమిషంలో 8-8తో సమానంగా నిలిచినా ఆ తర్వాత వెనుకబడి పరాజయం పాలైంది. -
టైటాన్స్‌కు మళ్లీ నిరాశ
30-28తో బెంగళూరు బుల్స్ విజయం సాక్షి, హైదరాబాద్: గత మ్యాచ్‌లో అద్భుత ఆటతీరు కనబర్చిన తెలుగు టైటాన్స్ ఉత్సాహం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భారీ విజయం తర్వాత ఆ జట్టు మళ్లీ ఓటమిని ఆహ్వానించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 30-28 స్కోరుతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ తరఫున రాహుల్ 9, నీలేశ్ 7 పాయింట్లు, బుల్స్ ఆటగాడు రోహిత్ కుమార్ 11 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేశారు. బెంగళూరు జట్టులో కెప్టెన్ సురేందర్, ఆశిష్ కూడా రాణించారు. టైటాన్స్‌కు సీజన్లో ఇది నాలుగో ఓటమి. రాహుల్ విఫలం: ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో 14 నిమిషాలకు టైటాన్స్, బుల్స్ 7-7తో సమంగా నిలిచాయి. ఈ సమయంలో ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు ఆధిక్యంలో దూసుకుపోయింది. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి తొలి అర్ధ భాగంలో 12 సార్లు రైడింగ్‌కు వెళ్లి 2 సార్లు మాత్రమే పాయింట్లతో తిరిగొచ్చాడు. సగం సమయం ముగిసే సరికి టైటాన్స్ 11-16తో వెనుకబడింది. రెండో అర్ధ భాగంలో టైటాన్స్ కోలుకుని ఒకసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా బెంగళూరు జాగ్రత్తగా ఆడి గెలిచింది. ఆఖరి నిమిషంలో మరో రైడ్‌కు అవకాశం ఉన్నా... అంపైర్లు సమయం ముగిసిందని ప్రకటించడంపై కెప్టెన్ రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ దామోదర్ పదే పదే తమ పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నాడని అతను ఆరోపించాడు. మహిళల మ్యాచ్ టై..: ఫైర్ బర్డ్స్, స్టార్మ్ క్వీన్స్ మధ్య ఆసక్తికరంగా సాగిన మహిళల లీగ్ మ్యాచ్ 14-14తో టైగా ముగిసింది. లీగ్‌లో ఏకపక్షంగా సాగిన తొలి రెండు మ్యాచ్‌లకు భిన్నంగా ఈ సారి ఇరు జట్లు ప్రతీ పాయింట్ కోసం పోటాపోటీగా తలపడ్డాయి. బర్డ్స్ తరఫున మమత ఆరు పాయింట్లు సాధించగా, క్వీన్స్ ప్లేయర్ మోతి 4 పాయింట్లు స్కోర్ చేసింది. నేటి మ్యాచ్‌లు దబాంగ్ ఢిల్లీ X జైపూర్ పింక్ పాంథర్స్ రా. గం. 8 నుంచి తెలుగు టైటాన్స్ X యు ముంబా రా. గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్-2 లో ప్రత్యక్ష ప్రసారం -
బెంగళూరు బుల్స్ బోణీ ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన హోరాహోరీ పోరులో బెంగళూరు బుల్స్ గట్టెక్కింది. చివరి ఐదు నిమిషాల్లో రోహిత్ కుమార్ సూపర్ షో చూపడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 24-23 తేడాతో నెగ్గింది. వాస్తవానికి 35వ నిమిషం వరకు బెంగాల్ జట్టు 21-15తో ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో పుంజుకున్న బుల్స్ ఒక్కో పాయింట్ సాధిస్తూ పోటీలోకొచ్చింది. రోహిత్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్ లో పుణెరి పల్టన్ 41-19 తేడాతో యు ముంబాను చిత్తుగా ఓడించింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; పుణెరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
మోహిత్ ఛిల్లర్‌కు రూ. 53 లక్షలు
► బెంగళూరు బుల్స్ సొంతం ► ప్రో కబడ్డీ లీగ్ సీజన్-4 వేలం ► జూలై 31న హైదరాబాద్‌లో ఫైనల్ ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో యువ ఆటగాడు మోహిత్ ఛిల్లర్ పంట పండింది. శుక్రవారం జరిగిన సీజన్-4 వేలంలో బెంగళూరు బుల్స్ అతడిని రూ. 53 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఇదే అత్యధిక మొత్తం. సీజన్-2లో యు ముంబా జట్టును చాంపియన్‌గా నిలపడంలో మోహిత్ కీలక పాత్ర పోషించాడు. సందీప్ నర్వాల్‌ను తెలుగు టైటాన్స్ రూ. 45.5 లక్షలకు, జీవ కుమార్‌ను యు ముంబా రూ. 40 లక్షలకు జట్టులోకి తీసుకున్నాయి. పీకేఎల్ సీజన్-4 మ్యాచ్‌లు జూన్ 25నుంచి జులై 31 వరకు జరుగుతాయి. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వేలంలో ఎనిమిది జట్లు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. లీగ్ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు ఇద్దరు పాత ఆటగాళ్లను కొనసాగించగా, మిగతావారిని వేలంలో ఎంచుకున్నాయి. దాంతో ఈ సారి అన్ని జట్లు మళ్లీ కొత్తగా కనిపించనున్నాయి. రాహుల్, సుకేశ్ టైటాన్స్‌కే... తెలుగు టైటాన్స్ జట్టు తమ ఇద్దరు ప్రధాన రైడర్లు రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డేలను కొనసాగించింది. వీరు కాకుండా మరో 13 మందిని వేలంలో ఎంచుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలి సారి పాకిస్తాన్ ఆటగాడు బరిలోకి దిగుతుండటం విశేషం. ఆల్‌రౌండర్ ముహమ్మద్ రిజ్వాన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు తీసుకుంది. వేలంలో మరో ఏడుగురు పాకిస్తానీ ఆటగాళ్లు ఉన్నా ఎవరూ తీసుకోలేదు. తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డే, వినోత్ కుమార్, కె. ప్రపంజన్, నీలేశ్ సాలుంకే (రైడర్లు), వినోద్ కుమార్, సందీప్ ధుల్ (డిఫెండర్లు), జస్మీర్ సింగ్, రూపేశ్ తోమర్, సందీప్ నర్వాల్, శశాంక్ వాంఖెడే, సాగర్ కృష్ణ, మొహమ్మద్ మఖ్సూద్, అఖ్లాఖ్ హుస్సేన్, ముహమ్మద్ రిజ్వాన్ (ఆల్‌రౌండర్లు). -
ముంబాకు వరుసగా ఎనిమిదో గెలుపు
ముంబై: సొంత వేదికపై ముంబా జట్టు మరోసారి ఆకట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 30-27 పాయింట్ల తేడాతో గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబా జట్టుకిది వరుసగా ఎనిమిదో విజయం కాగా... ఓవరాల్‌గా పదోది. ఇప్పటికే పట్నా పైరేట్స్, ముంబా జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా... మిగతా రెండు స్థానాల కోసం పుణేరి పల్టన్ (43 పాయింట్లు), బెంగాల్ వారియర్స్ (42 పాయింట్లు), తెలుగు టైటాన్స్ (38 పాయింట్లు) రేసులో ఉన్నాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
ఎదురులేని పుణే
న్యూఢిల్లీ: తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో పరాజయమనేది లేకుండా వణికించిన పుణేరి పల్టన్ మరోసారి అదే స్థాయి ఆటతీరును ప్రదర్శించింది. శనివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44-27 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఈ జట్టు రెండో స్థానానికి చేరింది. అజయ్ ఠాకూర్ 7, మంజిత్ చిల్లార్ ఆరు రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి దీపక్ హుడా ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. అయితే ఆరంభంలో బెంగళూరు నుంచి పుణే గట్టి పోటీనే ఎదుర్కోవడంతో పాటు 10వ నిమిషంలో ఆలౌట్ అయ్యింది. 10-4తో ఉన్న బెంగళూరు ఆధిక్యానికి దీపక్ హుడా సూపర్ రైడ్‌తో మరో మూడు పాయింట్లు వచ్చాయి. ఈ సమయంలో అంతగా ఫామ్‌లో లేని అజయ్ ఠాకూర్ ముగ్గురు డిఫెండర్లను అవుట్ చేసి పుణే స్కోరును పెంచాడు. దీంతో తొలి అర్ధభాగాన్ని పుణే 19-13తో ముగించింది. ద్వితీయార్ధం 32వ నిమిషం వరకు కూడా ఆట పోటాపోటీగా సాగి 24-21తో పుణే స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అయితే కొద్దిసేపట్లోనే బెంగళూరు ఆలౌట్ కావడంతో తిరిగి కోలుకోలేకపోయింది. బెంగాల్ విజయం మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 37-31 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. బెంగాల్ నుంచి జంగ్ కున్ లీ 13, నితిన్ తోమర్ 10 రైడింగ్ పాయింట్లు.. ఢిల్లీ నుంచి అనిల్ శ్రీరామ్ 12, సెల్వమణి 10 రైడింగ్ పాయింట్లు సాధించారు. ప్రస్తుతం బెంగాల్ జట్టు పుణేతో సమానంగా 42 పాయింట్లతో ఉన్నా నాలుగు పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్ పింక్‌పాంథర్స్; తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఘనవిజయం
జైపూర్: వరుసగా రెండు ఓటముల అనంతరం తెలుగు టైటాన్స్ జట్టు తిరిగి పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో రాణించిన జట్టు 40-22తో ఘనవిజయాన్ని అందుకుంది. ప్రథమార్ధం ముగిసేలోపే 18-10తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ ఆ తర్వాత మరింత దీటుగా ఆడింది. సుకేశ్ హెగ్డే 8 రైడ్ పాయింట్లు సాధించగా, డిఫెండర్లు రాహుల్, మనోజ్ నాలుగేసి టాకిల్ పాయింట్లతో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు నుంచి సుర్జీత్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించినా లాభం లేకపోయింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 32-17 తేడాతో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను ఓడించింది. -
బెంగళూరుపై జైపూర్ గెలుపు
జైపూర్: సొంత వేదికపై జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భా గంగా శనివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 30-21 తేడాతో నెగ్గింది. తొలి అర్ధ భాగం వరకు బెంగళూరు గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత జైపూర్ చకచకా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం ప్రదర్శించింది. ఆతిథ్య జట్టు నుంచి జస్వీర్ 5, రాజేశ్ నర్వాల్ 3 రైడింగ్ పాయిం ట్లతోపాటు 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగళూరు నుంచి పవన్ కుమార్ ఐదు రైడింగ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 32-22 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. -
ఢిల్లీకి తొలి విజయం
బెంగళూరు బుల్స్‌పై విజయం పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఏడు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ ఎట్టకేలకు గెలిచింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 35-21తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించి బోణీ చేసింది. ఢిల్లీ తరఫున కాశీలింగ్ (8), సెల్వమణి (7), రవీందర్ (5), సందీప్ (4), అనిల్ కుమార్ (4) మెరుగ్గా ఆడారు. దీపక్ కుమార్ దహియా (5), పవన్ కుమార్ (4), ఆశిష్ సంగ్వాన్ (3), సోమ్‌వీర్ (3)లు బుల్స్‌కు పాయింట్లు అందించారు. బుల్స్ ఆటగాళ్లు రైడింగ్‌తో పాటు క్యాచింగ్‌లోనూ విఫలం కావడం దెబ్బతీసింది. 11వ నిమిషం వరకు ఇరుజట్ల స్కోరు 5-5తో సమమైనా... సెల్వమణి జోరుతో ఢిల్లీ ఆధిక్యం క్రమంగా పెరిగింది. రైడింగ్‌కు వెళ్లిన ప్రతిసారి ఒకటి, రెండు పాయింట్లు సాధించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 16-7కు చేరింది. తర్వాత బెంగళూరు ఒకటి, రెండు పాయింట్లు సాధించినా కోర్టు ఖాళీ కావడం దెబ్బతీసింది. రెండో అర్ధభాగంలో ఢిల్లీ క్యాచింగ్ మెరుగుపడటంతో పాయింట్లు వేగంగా వచ్చాయి. బుల్స్ జట్టులో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన దహియా అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించడం విశేషం. తాజా విజయంతో ఢిల్లీ ఖాతాలో ఏడు పాయింట్లు సమకూరాయి. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్, పుణేరి పల్టాన్స్‌తో జరిగిన మ్యాచ్ 28-28తో డ్రాగా ముగిసింది. పట్నా తరఫున రోహిత్ కుమార్ అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. దీపక్ నివాస్ హుడా పుణేకు ఏడు పాయింట్లు అందించాడు. -
తెలుగు టైటాన్స్ కు మూడో గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ టోర్నమెంట్లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో విజయం లభించింది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 35-26 పాయింట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ రాహుల్ చౌదరి అద్భుత ఆటతీరును కనబరిచి 11 పాయింట్లు సాధించి తెలుగు టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు సుకేశ్ హేగ్డె నాలుగు, ధర్మరాజ్ చెరలథన్, వికాస్ కాలే మూడేసి పాయింట్లు సంపాదించగా... మేరాజ్ షేక్, రాహుల్ కుమార్ రెండేసి పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. విరామ సమయానికి 18-9తో ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్ జట్టు రెండో అర్ధభాగంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 40-26తో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాపై సంచలన విజయం సాధించింది. -
బెంగళూరు బుల్స్ కు చుక్కెదురు
బెంగళూరు: సొంతగడ్డపై ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 24-34తో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి ఐదు పాయింట్లతో జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. బుల్స్ తరఫున అమిత్ రాఠి (6), సుర్జీత్ (5), సోమ్‌వీర్ (4) పాయింట్లు సాధించారు. నితిన్ తోమర్ (7), గిరిష్ మారుతి (4), నీలేష్ షిండే (3)లు వారియర్స్‌కు పాయింట్లు అందించారు. రైడింగ్‌లో అద్భుతమైన నైపుణ్యం చూపెట్టిన వారియర్స్....క్యాచింగ్‌లో కాస్త వెనుకబడింది. ఆట 32వ నిమిషం వరకు ఒక్క పాయింట్ (21-22) మాత్రమే వెనుకబడి ఉన్న బుల్స్ ఆ తర్వాత నిరాశపర్చింది. 8 నిమిషాల్లో ఏకంగా 12 పాయింట్లు సమర్పించుకుంది. శుక్రవారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో దబాంగ్ ఢిల్లీతో యు ముంబా; బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
పట్నా పైరేట్స్‌కు మరో విజయం
ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి సొంతగడ్డపై ఆడుతున్న జట్లకు అంతగా కలిసి రావడంలేదు. విశాఖపట్నంలో తెలుగు టైటాన్స్ జట్టుకు రెండు విజయాలు, రెండు ఓటములు ఎదురవ్వగా... బెంగళూరు వేదికగా బుధవారం మొదలైన పోటీల్లో ఆతిథ్య బెంగళూరు బుల్స్‌కు తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 33-24 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు జట్టులో అమిత్ రాఠి ఒక్కడే పోరాటపటిమ కనబరిచి పది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది. మరోవైపు పట్నా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. రోహిత్ కుమార్ రెయిడింగ్‌లో విజృంభించి ఎనిమిది పాయింట్లు సంపాదించగా... సందీప్ నర్వాల్ ఐదు, మన్‌ప్రీత్ సింగ్ నాలుగు, సురేశ్ మూడు పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్ లో పుణేరి పల్టన్ 38-20 పాయింట్లతో ఢిల్లీ దబంగ్ జట్టును ఓడించింది. పుణేరి తరఫున దీపక్ హుడా 9 పాయింట్లు, మన్జీత్ చిల్లర్ 8 పాయింట్లు, సుర్జీత్ ఆరు పాయింట్లు సాధిం చగా... ఢిల్లీ తరఫున కాశీలింగ్ ఐదు, రోహిత్ మూడు పాయింట్లు సాధించారు. ఈ లీగ్‌లో ఢిల్లీకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. -
టైటాన్స్ తొడగొడుతుందా!
-
టైటాన్స్ తొడగొడుతుందా!
బెంగళూరు బుల్స్‌తో సెమీస్ నేడు ప్రొ కబడ్డీ లీగ్ ముంబై: తొలి సీజన్లో ఒకే ఒక్క పాయింట్‌తో ప్లే ఆఫ్ అవకాశాలను చేజార్చుకున్న తెలుగు టైటాన్స్ రెండో సీజన్లో మాత్రం దుమ్మురేపింది. అద్భుతమైన రైడింగ్.. అంతకుమించిన క్యాచింగ్‌తో సీజన్-2లో జైత్రయాత్ర కొనసాగించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు (శుక్రవారం) జరిగే సెమీస్ పోరులో టైటాన్స్.. బెంగళూరు బుల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 8 విజయాలు, మూడు డ్రాలతో 50 పాయింట్లతో జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. రాహుల్ చౌదరి (79 పాయింట్లు) ఈసారి కూడా ఒంటిచేత్తో ఫలితాలను శాసిస్తున్నాడు. అయితే రాహుల్ విఫలమైన ప్రతిసారి సుకేశ్ హెగ్డే, ప్రశాంత్ రాయ్‌లు జట్టుకు అండగా నిలవడం టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం. ఓవరాల్‌గా ఈ ముగ్గురి రైడింగ్‌తో ప్రస్తుతం టైటాన్స్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక దీపక్ నివాస్ హుడా క్యాచింగ్‌తో పాటు రైడింగ్‌లోనూ ఉపయోగపడుతుండటం టైటాన్స్ జట్టుకు అదనపు బలంగా మారింది. మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్న మరో ఆటగాడు మిరాజ్ షేక్ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానున్నాడు. మరోవైపు బెంగళూరు బుల్స్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ సీజన్లో టైటాన్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు ఓటమిపాలైంది. అజయ్ ఠాకూర్, కెప్టెన్ మంజీత్ చిల్లర్, రాజేశ్ మొండల్, సోమ్‌వీర్ శేఖర్ కీలక ఆటగాళ్లు. ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్‌కు అడ్డుకట్ట వేయాలని బెంగళూరు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండో సెమీస్‌లో పటిష్టమైన యు ముంబాతో... పట్నా పైరేట్స్ జట్టు తలపడుతుంది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-43 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ జట్టు ఏడు విజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడి, మరో మూడింటిని ‘డ్రా’ చేసుకొని మొత్తం 45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు నిరుటి రన్నరప్ యు ముంబా తమ జోరు కొనసాగిస్తోంది. పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 32-27తో నెగ్గి ఈ సీజన్లో 11వ విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో ఢిల్లీ దబంగ్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ముంబా చేతిలో బుల్స్ చిత్తు
బెంగళూరు: సొంతగడ్డపై ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లను బెంగళూరు బుల్స్ పరాజయంతో ప్రారంభించింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 7 పాయింట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబా 36-29తో బుల్స్‌ను మట్టికరిపించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 18-13తో ముందంజలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. ముంబా జట్టు తరఫున జీవా కుమార్ 6 పాయింట్లు సాధించగా, సురేందర్, మోహిత్ చెరో 5 పాయింట్లు స్కోర్ చేశారు. బెంగళూరు ఆటగాళ్లలో మన్జీత్ 7, ధర్మరాజ్ 6 పాయింట్లు సాధించినా తమ జట్టును ఓటమినుంచి రక్షించలేకపోయారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు బెంగాల్ వారియర్స్ పుణేరీ పల్టన్ రా. గం. 8 నుంచి బెంగళూరు బుల్స్ జైపూర్ పింక్ పాంథర్స్ రా. గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్- 2లో ప్రత్యక్ష ప్రసారం -
విశాఖలో కబడ్డీ సందడి
- తెలుగు టైటాన్స్, బెంగళూరు మ్యాచ్ డ్రా సాక్షి, విశాఖపట్నం: సాగర తీరాన కబడ్డీ సందడి మొదలైంది. ఇప్పటికే ఐదు వేదికల్లో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌కు శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్నాయి. స్థానిక పోర్ట్ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ పోటీ పడ్డాయి. ఇరు జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు నిదర్శనంగా మ్యాచ్ 28-28 స్కోరుతో డ్రాగా ముగిసింది. తెలుగు టైటాన్స్‌లో రాహుల్ చౌదరి అత్యధికంగా ఎనిమిది రైడ్ పాయింట్లు సాధించి ఆకట్టుకున్నాడు. సుకేష్ హెగ్డే 5 పాయింట్లు సాధించాడు. రాజగురు సుబ్రమణియన్ ప్రత్యర్థి ఆటగాళ్లను లాఘవంగా ఒడిసి పట్టుకుని జట్టు స్కోరును పెంచాడు. అటు బెంగళూరులో అజయ్ ఠాకూర్ అత్యధికంగా 12 రైడ్ పాయింట్లతో జోష్ కనబరిచాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ జట్టు 41-33తో బెంగాల్‌పై గెలిచింది. -
పోరు హోరాహోరీ..ఫలితం డ్రా
విశాఖపట్నం: తెలుగు టైటాన్స్‌కు సొంతగడ్డపై విజయం దక్కలేదు. తొలి అర్ధభాగంలో పట్టు బిగించిన తెలుగు టైటాన్స్‌ను మరోసారి బరిలోకి దిగిన తరువాత బెంగళూర్ బుల్స్ కుమ్మేశాయి. ముందుగా ఐదు పాయింట్లు(13-8) వెనకబడిన బుల్స్ మలి అర్ధభాగంలో ఐదు పాయింట్లు(20-15) ఆధిక్యంతో సమఉజ్జీగా (28-28)నిలిచి మ్యాచ్‌ను జారిపోకుండా నిలువరించింది. ఇరుజట్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంతో చెరో మూడేసి పాయింట్లతో సరిపెట్టుకున్నాయి. మూడో స్థానంలోనే బెంగళూర్ బుల్స్ కొనసాగుతుండగా సెమీస్ ఆశను తెలుగు టైటాన్స్ వదులుకుంది. ప్రో కబడ్డీ పేరిట విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఆరో రౌండ్ పోటీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో బెంగళూర్ బుల్స్ ఢీకొట్టాయి. తరుము కూతలో టైటాన్స్ పాయింట్లను రాబట్టగలిగినా డిఫెన్స్‌లో వెనకబడటంతో ఆట చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయి. టైటాన్స్ జట్టు విశాఖలోనే మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. టైటాన్స్‌కు లోనా... తెలుగు టైటాన్స్ జట్టు తొలి అర్ధభాగంలో ఔట్ చేయడం ద్వారా పదిపాయింట్లు రాబట్టగా బుల్స్ ఎనిమిది పాయింట్లే సాధించాయి. టైటాన్స్ మూడు బోనస్ పాయింట్లు సాధించడంతో ఆధిక్యం సాధించింది. రెండో అర్ధభాగంలో బుల్స్ చెలరేగాయి. ఏకంగా ఐదు బోనస్ పాయింట్లు సాధించిన బెంగళూర్ బుల్స్ మాత్రం జట్టు అంతా ఔటయి లోనాను టైటాన్స్‌కు సమర్పించుకుంది. టైటాన్స్ ప్రత్యర్థిని ఔట్ చేయడం ద్వారా 12 పాయింట్లు రాబట్టగా బుల్స్ పదమూడు పాయింట్లు దక్కించుకుని మ్యాచ్‌ను చేజారకుండా జాగ్రత్తపడింది. దీంతో ఇరుజట్లు 28 పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు, సినీనటుడు శ్రీకాంత్ మ్యాచ్ ఆసాంతం ఆస్వాదించారు. బోనస్‌తో పాయింటే ఓటమైంది: చివరిలో మ్యాచ్ చేజారిపోయింది. ప్రత్యర్థి బోనస్ పాయింట్‌తో సరిపెట్టుకోకుండా ఔట్ చేసి వెనక్కి మళ్లడంతో క్షణాల్లో మ్యాచ్ రూపు మారిపోయింది. తొలి అర్ధభాగంలో లీడ్‌ను చివరి నిమిషంలో కోల్పోయాం. జాతీయ జట్టు ఆటగాడి అనుభవం ముందు కాస్త తడబడ్డాం. ముంబయ్ మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుంటాం. -రాహుల్, టైటాన్స్ రైడర్