టైటాన్స్‌ ఫ్లాప్‌ షో... | telugu titans Second defeat in a row | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌ ఫ్లాప్‌ షో...

Published Sun, Jul 30 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

టైటాన్స్‌ ఫ్లాప్‌ షో...

టైటాన్స్‌ ఫ్లాప్‌ షో...

వరుసగా రెండో పరాజయం
అంతగా ఆకట్టుకోని రాహుల్‌ చౌదరి
రోహిత్‌ కుమార్‌ సూపర్‌ రైడింగ్‌
బెంగళూరు బుల్స్‌ గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్‌  


హైదరాబాద్‌ : తెలుగు టైటాన్స్‌ మళ్లీ నిరాశపరిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన జోన్‌ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్‌ జట్టు 21–31 స్కోరుతో బెంగళూరు బుల్స్‌ ధాటికి పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. టాకిల్‌లో పట్టుకోల్పోయారు. రైడింగ్‌లో తేలిపోయారు. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి, రాకేశ్‌ కుమార్‌ చెరో నాలుగు పాయింట్లు సాధించగా, వికాస్, నీలేశ్‌ మూడేసి పాయింట్లు చేశారు. ప్రత్యర్థి జట్టులో మాత్రం రోహిత్‌ కుమార్‌ (12 పాయింట్లు) అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి పాయింట్లు తెచ్చిపెట్ట డంలో సఫలమయ్యాడు. అజయ్‌ కుమార్‌ 7 పాయింట్లు సాధించాడు.

టాకిల్‌లో మహేందర్‌ సింగ్‌ తెలుగు టైటాన్స్‌ ఆటగాళ్లను సమర్థంగా కట్టడి చేశాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండ్‌ షోకు ఏ దశలోనూ టైటాన్స్‌ ఎదురు నిలువలేకపోయింది. ఏకంగా రెండుసార్లు ఆలౌటైంది. తొలి అర్ధభాగాన్ని 15–10తో ముగించిన బెంగళూరు బుల్స్‌ ఆ తర్వాత రెండో అర్ధభాగంలోనూ ఇదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా టాకిల్‌లో బెంగళూరు ఆటగాళ్ల సమన్వయం టైటాన్స్‌ రైడర్లను పదే పదే బోల్తా కొట్టించింది. మ్యాచ్‌ రెండు అర్ధభాగాల్లోనూ తెలుగు జట్టు ఏ దశలోనూ ఆధిక్యం వైపు చూడలేదు. బెంగళూరు రైడర్లలో రోహిత్‌తో పాటు అజయ్‌ కుమార్‌ రాణించాడు. రవీందర్‌ పాహల్, మహేందర్‌ సింగ్‌ చెరో 3 పాయింట్లు చేశారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు రైడింగ్‌లో 17, టాకిల్‌లో 9 పాయింట్లు సాధించగా, హైదరాబాద్‌ రైడింగ్‌లో 15, టాకిల్‌లో కేవలం రెండే పాయిం ట్లు సాధించింది. మ్యాచ్‌ ఆసాంతం రైడింగ్‌లో అదరగొట్టిన రోహిత్‌ కుమార్‌కు ‘పర్‌ఫెక్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. అజయ్‌ కుమార్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ జట్టుకిది వరుసగా రెండో పరాజయం కాగా... ఆడిన తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు గెలుపుతో టోర్నీలో శుభారంభం చేసింది.

గట్టెక్కిన యు ముంబా...
లీగ్‌లో మాజీ చాంపియన్‌ యు ముంబా రెండో మ్యాచ్‌తో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో యు ముంబా జట్టు 29–28 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌పై గెలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబా జట్టు పాయింట్‌ తేడాతో గట్టెక్కింది. ఈ జట్టులో కశిలింగ్‌ (7 పాయింట్లు), అనూప్‌ కుమార్‌ (6) రాణించారు. సురీందర్‌ సింగ్‌ 4, సురేశ్‌ కుమార్‌ 3 పాయింట్లు సాధించారు. హర్యానా తరఫున వజీర్‌ సింగ్‌ (6), వికాస్‌ (6) ఆకట్టుకున్నారు. సుర్జీత్‌ సింగ్‌ 4, రాకేశ్‌ సింగ్‌ కుమార్‌ 3 పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి హర్యానా 15–11తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధం ప్రారంభంలోనూ హర్యానా ఆటగాళ్ల జోరే కొనసాగింది. దీంతో ఈ జట్టు ఒక దశలో 19–12తో స్పష్టమైన ఆధిక్యంలో నిలి చింది. అయితే ముంబా వరుస రైడింగ్‌లతో, టాకిల్‌ పాయిం ట్లతో టచ్‌లోకి వచ్చింది. దీంతో క్షణాల వ్యవధిలో ఒక్కసారిగా ఆధిక్యం తారుమారైంది. 22–20తో ముంబా ఆధిపత్యం మొదలైంది. అక్కడి నుంచి జాగ్రత్తగా ఆడిన ముంబా ఆటగాళ్లు ఆధిక్యాన్ని తుదికంటా కాపాడుకొని విజయం సాధించారు.

హైదరాబాద్‌ అంచె పోటీలకు నేడు (సోమవారం) విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌తో దబంగ్‌ ఢిల్లీ, యూపీ యోధతో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement